నేహా బోరా రిలీజ్.. అభిజీత్ దీప్కేకు నో.. ఎందుకు..?

 నేహా బోరా రిలీజ్.. అభిజీత్ దీప్కేకు నో.. ఎందుకు..?

కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే ఆచూకీ విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. 2026 అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా ఆందోళన సందర్భంగా దీప్కేను అదపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు.. ఆయనను ఇప్పటికీ విడుదల చేయలేదు. అదే కేసులో అరెస్టయిన AISA ప్రసిడెంట్ నేహా బోరాను విడుదల చేశారు. అరెస్టు చేసిన కొన్ని గంటలకే ఫార్మాలిటీస్ పూర్తి చేసి ఆమెను రిలీజ్ చేశారు. నేహా బోరాను విడుదల చేసిన పోలీసులు.  దీప్కేను ఎందుకు రహస్య ప్రదేశంలో బంధించారనే ప్రశ్నలు వెల్లువెత్తున్నాయి. 

దీప్కే ఆచూకీ విషయంలో విమర్శలు వెల్లువెత్తడంతో.. శనివారం (అక్టోబర్ 17) ఆయనను మెజిస్ట్రేట్ ముందు ప్రవేశ పెట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.

కనౌట్ ప్లేస్ లోని సెంట్రల్ పార్క్ కు వెళ్లకుండా దీప్కేకు రెండు నోటీసులు పంపినట్లు పోలీసులు చెబుతున్నారు. శాంతి యుత వాతావరణాన్ని దెబ్బతీసేలా.. నోటీసులను ఉల్లంఘించినందుకు అరెస్టు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. 

దీప్కే శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించారని పోలీసులు వాదిస్తున్నారు. 50 వేల రూపాయల బాండ్ పూచీకత్తుతో.. ఏడాది పాటు హింసాత్కక ఘటనల్లో పాల్గొననని, శాంతికి భంగం వాటిల్లేలా వ్యవహరించనని చేసిన ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు అరెస్టు చేసినట్లు మెజిస్ట్రేట్ కు విన్నవించాలని భావిస్తున్నారు. 

దీప్కే నిర్బంధంపై సీజేపీ ప్రశ్నలు:

దీప్కే నిర్బంధంపై సీజేపీ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. దీప్కేను ఇప్పటి వరకు ఎక్కడ దాచారో కూడా తెలియటం లేదని ఆ పార్టీ ప్రతినిధులు తెలిపారు. లాయర్ తో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వటం లేదని అంటున్నారు. 

యువకులను ప్రభుత్వం ఎందుకు టెర్రరిస్టుల మాదిరిగా ట్రీట్ చేస్తోంది..? మేము భారత పౌరులమే.. అందరికీ వర్తించే రాజ్యాంగ హక్కులు మాకు వర్తిస్తాయి అని పేర్కొన్నారు. 

దీప్కే మూడు రంగుల జాతీయ జెండాతో నడుస్తున్న క్రమంలో అరెస్టు చేశారని.. ఆయన హింసకు ఎక్కడ  పాల్పడ్డారని ప్రశ్నించారు. నిర్బంధాలతో యువతను ఉద్యమాలకు దూరం చేయలేరని మండిపడ్డారు. 

దీప్కే ఆచూకీతో పాటు  నిర్బంధానికి గల చట్టపరమైన కారణాలను వెల్లడించాలని సీజేపీ ఢిల్లీలోని మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు   లేఖ రాశారు. 

 నేహా బోరా ఆచూకీ తెలియక గంటల తరబడి అనిశ్చితి నెలకొన్న తర్వాత, ఆమెను ఆర్‌కే పురం పోలీస్ స్టేషన్‌లో గుర్తించినట్లు ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) ఇంతకుముందు తెలిపింది. అయితే, ఆమెను దాదాపు ఐదు గంటల పాటు ఢిల్లీ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు తరలించారని ఆరోపించింది. అర్ధరాత్రి స్టేషన్ కు వెళ్లిన లాయర్లకు బోరాను కలుసుకునే అవకాశం కూడా పోలీసులు ఇవ్వలేదని మండిపడ్డారు. మందులు ఇవ్వడానికి కూడ అనుమతించడంలేదని ఆరోపించారు.