కొత్త ఆటోల పర్మిట్లు ఓఆర్ఆర్ పరిధిలోని వారికే !

కొత్త ఆటోల పర్మిట్లు ఓఆర్ఆర్ పరిధిలోని వారికే !
  • హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి వారే అర్హులు .. 
  • పాత ఆటోల స్థానంలో కొత్త పర్మిట్లకు నో ఛాన్స్​ 
  • ఇంతకు ముందు ఆటో తీసుకున్నట్టు తేలితే పర్మిట్​ రద్దు  
  • గైడ్​లైన్స్​ రిలీజ్​ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్​సిటీ, వెలుగు: కొత్త ఆటో పర్మిట్లు ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల వారికి మాత్రమే జారీ చేస్తామని అధికారులు ప్రకటించారు. దాదాపు 23 ఏండ్లుగా ఏ ప్రభుత్వం హైదరాబాద్​లో ఆటోలకు పర్మిట్లు ఇవ్వలేదు. 

కాంగ్రెస్​సర్కారు ఏర్పడిన తర్వాత స్వయం ఉపాధికోసం ఆటోలు నడుపుకోవాలనుకునే వారి కోసం పర్మిట్లు జారీ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా జీవో, గైడ్​లైన్స్​విడుదల చేయడమే కాకుండా జారీ ప్రకియ కూడా ప్రారంభించింది. అయితే, పొల్యూషన్​కు చోటు లేకుండా ఎలక్ట్రిక్​, సీఎన్జీ, ఎల్పీజీ  ఆటోలను మాత్రమే అనుమతిస్తామని అధికారులు ప్రకటించారు. 

65 వేల ఆటోలకు పర్మిట్లు ఇస్తామని, వీటిలో 20 వేల ఎలక్ట్రిక్​, 10 వేల సీఎన్జీ, మరో 10 వేలు ఎల్పీజీ ఆటోలు ఉండగా, మరో 25 వేల పర్మిట్లు పాత పెట్రోల్, డీజిల్​ఆటోలను ఎలక్ట్రిక్​ రెట్రోఫిట్టెడ్​ఆటోలుగా మార్చుకునేందుకు అవకాశం ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. 

ఆటో ఎక్కడైనా కొనుక్కోవచ్చు 

ఆటో పర్మిట్లకు పూర్తిగా  ఓఆర్ఆర్ పరిధిలోని ప్రాంతాల్లో ఉన్న వారే అర్హులు. తప్పనిసరిగా త్రీవీలర్ డ్రైవింగ్​లైసెన్స్​కలిగి ఉండాలి. పర్మిట్​కోసం ఆర్టీఏ వెబ్​సైట్​లో దరఖాస్తు చేసుకోవాలి. ఓఆర్ఆర్​పరిధిలోనే ఉంటున్నట్టు నివాస ధ్రువీకరణతో పాటు బర్త్ సర్టిఫికెట్​, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుతో జత చేయాలి. ఒకరికి ఒకే పర్మిట్ ఇస్తారు. 

పాత ఆటోల స్థానంలో కొత్త పర్మిట్లు ఇవ్వరు. ఒకరు తీసుకున్న పర్మిట్ తో మరొకరు ఆటో కొనేందుకు అవకాశం ఉండదు. పర్మిట్ పొందాక ఆటోలను తెలంగాణలో ఎక్కడి నుంచైనా కొనొచ్చు. గతంలో కేవలం హైదరాబాద్​లోని షోరూమ్​లలో మాత్రమే కొనాలన్న నిబంధన ఉండేది. దీనివల్ల చాలా మంది ఆటోడీలర్లు, ఆటో ఫైనాన్షియర్స్​కుమ్మక్కై ధరలు భారీగా పెంచి అమ్ముకున్నట్టు ఫిర్యాదులు వచ్చాయి. ఆ పరిస్థితి రాకుండా పర్మిట్లు పొందిన వారు ఏ ప్రాంతంలోని షోరూమ్ లో అయినా కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించారు.  

అలాగే, పర్మిట్లు పొందిన వారు పేరు, తండ్రిపేరు, పుట్టినతేదీ, ఆధార్​ నెంబర్, మొబైల్​నెంబర్​, ఓఆర్ఆర్​ పరిధిలో నివసిస్తున్నట్టు అడ్రస్​ప్రూఫ్​లను డీలర్లకు సమర్పించాలి. ఒక దరఖాస్తుదారుడు ఎల్పీజీ, ఎలక్ట్రిక్, సీఎన్​జీలో ఏదో ఒక ఆటోనే  సెలక్ట్​ చేసుకోవాలి.  ఈ పథకానికి ఆయా జిల్లాలకు చెందిన ఆర్టీఏ కార్యదర్శి నోడల్​ఆఫీసర్​గా వ్యవహరిస్తారు. ఇంతకు ముందు ఆటో తీసుకుని ఉన్నట్టు తేలితే పర్మిట్​రద్దు చేస్తారు. 

పర్మిట్​పొందిన వారికి డీలర్లు 60 రోజుల్లో  ఆటో డెలివరీ ఇవ్వాలి. రిజిస్ట్రేషన్లన్నీ ఓఆర్ఆర్​ లిమిట్స్​లోనే చేసుకోవాలి. ఫస్ట్​కమ్​ఫస్ట్​సర్వ్​పద్ధతిలో రిజిస్ట్రేషన్​చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్​టైంలో ఆఫీసర్లు గైడ్ లైన్స్​లో పేర్కొన్న విధంగా అన్ని డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్నాయా? లేదా? చెక్​చేయాలి.