
అన్నదమ్ముల మధ్య..
టైటిల్ : కంఖజుర,
ప్లాట్ ఫాం : సోనీ లివ్
డైరెక్షన్ : చందన్ అరోరా,
కాస్ట్ : రోషన్ మాథ్యూ, మోహిత్ రైనా, త్రినేత్ర హల్దార్ గుమ్మరాజు, సారా జేన్ డయాస్, నినాద్ కామత్, మహేష్ శెట్టి, హీబా షా
ఇజ్రాయెల్ టీవీ సిరీస్ మ్యాగ్‌పై ఇన్స్పిరేషన్తో ఈ వెబ్సిరీస్ని తీశారు. కథలోకి వెళ్తే.. గోవాలో ఉంటున్న ఆషు (రోషన్ మాథ్యూ) ఒక మర్డర్ కేసులో14 సంవత్సరాలపాటు జైలులో ఉంటాడు. విడుదలైన తర్వాత తన అన్న మాక్స్ (మోహిత్ రైనా) దగ్గరకు వెళ్తాడు. అప్పటికే అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదిస్తాడు. తన పాత ఫ్రెండ్స్ పెడ్రో (నినాద్ కామత్), శార్దుల్ (మహేష్ శెట్టి)తో కలిసి తన వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తుంటాడు.
ఈ క్రమంలో ఆషుని పెద్దగా పట్టించుకోడు. ఆషు మాత్రం తన అన్న వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటూ ఉంటాడు. అదే టైంలో ఒక మాస్టర్ మానిప్యులేటర్ అయిన లోకల్ ఏసీపీ (హీబా షా) ఓ పెద్ద ప్లాన్ వేస్తుంది. ఆ ప్లాన్ ఏంటి? ఆషు తన అన్నకి దగ్గరయ్యాడా? లేదా? తెలియాలంటే ఈ వెబ్‌సిరీస్ చూడాలి.
విగ్రహం తాకాడని..
టైటిల్ : మై హీరో
ప్లాట్ ఫాం : అమెజాన్ ప్రైమ్ వీడియో
డైరెక్షన్ : అవినాష్ విజయ్ కుమార్
కాస్ట్ : జిలాలీ రెజ్ కల్లా, మాస్టర్ వేద కౌశల్, దత్తన్న, ప్రకాష్ బెల్వాడి, అంకితా అమర్, ఎరిక్ రాబర్ట్స్, జేమ్స్ జియోయా, నిరంజన్ దేశ్‌పాండే
గ్యారీ (జిలాలి రెజ్ కల్లా) అమెరికాలో మాజీ సైనికుడు. చనిపోయిన తన కొడుకుకు పిండ ప్రదానం చేయడానికి మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్‌కు వస్తాడు. అక్కడ కర్నాటకలోని చిక్కమగళూరు జిల్లాలోని ఒక పల్లెటూరికి చెందిన యంగ్ టూరిస్ట్ గైడ్ విశ్వ (మాస్టర్ వేదిక్ కౌశల్)ను కలుస్తాడు. విశ్వ, చనిపోయిన తన కొడుకు మధ్య ఉన్న ఒక వింత పోలికను చూసి గ్యారీ ఆశ్చర్యపోతాడు. ఇద్దరికీ మంచి స్నేహం ఏర్పడుతుంది.
ఆ తర్వాత విశ్వ గతాన్ని తెలుసుకుంటాడు గ్యారీ. విగ్రహాన్ని తాకినందుకు అగ్ర కులస్తులు విశ్వ చేతులను నరికేయడానికి ప్రయత్నించారని తెలిసి చలించిపోతాడు. ఆ సంఘటన వల్లే అతను తన సొంతూరు నుంచి పారిపోయి వచ్చి మహేశ్వర్‌లో ఉంటాడు. ఈ విషయం తెలిసిన తర్వాత విశ్వని తీసుకుని గ్యారీ చిక్కమగళూరుకు ప్రయాణం ప్రారంభిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? తెలుసుకోవాలంటే సినిమా చూడాలి.
ఆ ఇంట్లో ఏముంది?
టైటిల్ : డీమన్,
ప్లాట్ ఫాం : ఆహా
డైరెక్షన్ : రమేశ్ పళనీవేల్
కాస్ట్ : సచిన్ మణి, అబర్నతి, సురుతి పెరియసామి
విఘ్నేష్ శివన్ (సచిన్ మణి) డైరెక్టర్‌గా ఒక హర్రర్ సినిమా తీయాలి అనుకుంటాడు. అదే టైంలో అతనికి ఒక ప్రొడ్యూసర్ పరిచయం అవుతాడు. అతను విఘ్నేష్‌తో సినిమా తీయడానికి ఒప్పుకుంటాడు. దాంతో విఘ్నేష్ డిస్టర్బెన్స్ లేని ఒక ప్లేస్‌కి వెళ్లి కథ రాయాలని నిర్ణయించుకుని.. సిటీ మధ్యలో ఉన్న ఒక కొత్త ఫ్లాట్‌కు మకాం మారుస్తాడు. కథ రాయడం మొదలుపెడతాడు. అప్పుడే ఒక అమ్మాయి(అబర్నతి)ని కూడా ప్రేమిస్తాడు. వాళ్ల తల్లిదండ్రులు ఒప్పుకున్నాక ఆమెను పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు.
అంతా బాగానే ఉంది అనుకునే టైంలో విఘ్నేష్‌కు ప్రతిరోజూ నిద్రలో కలలు రావడం మొదలవుతుంది. వాటిలో తరచూ ఒక దెయ్యం కనిపిస్తుంటుంది. దాంతో అతనికి నిద్ర పట్టకపోవడమే కాకుండా తాను కూడా చనిపోతానేమో అనే భయం కలుగుతుంది. అలా ఎందుకు జరుగుతుందని ఆరా తీస్తే.. అతను ఉంటున్న ఇంట్లో ఇదివరకే రెండు కుటుంబాలు చనిపోయాయని తెలుస్తుంది. ఇంతకీ ఆ ఇంట్లో దెయ్యం ఉందా? లేదా? విఘ్నేష్ తన సమస్య నుంచి ఎలా బయటపడ్డాడు? తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.