OTT Movies : ఈ వారం ఓటీటీలోకి వచ్చే సినిమాలు ఇవే!

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి వచ్చే సినిమాలు ఇవే!

హంతకుడు ఎవరు?

టైటిల్ : డిటెక్టివ్ షెర్డిల్ 
ప్లాట్​ ఫాం : జీ5, 
డైరెక్షన్ : రవి ఛబ్రియా
 కాస్ట్​ : దిల్జిత్ దోసాంజ్, డయానా పెంటీ, బొమన్ ఇరానీ, చుంకీ పాండే, బనితా సంధు, రత్న పాఠక్ షా, సుమీత్ వ్యాస్

ఈ కథ బుడాపెస్ట్‌‌లో ప్రారంభం అవుతుంది. డిటెక్టివ్ షెర్డిల్ (దిల్జిత్ దోసాంజ్) తన దగ్గరకు వచ్చిన కేసులను ఈజీగా ఛేదిస్తుంటాడు. అందుకే అక్కడి పోలీసులు కూడా కొన్ని కేసులను పరిష్కరించేందుకు షెర్డిల్ సాయం కోరుతుంటారు. ఒకరోజు బుడాపెస్ట్‌‌లో ఉంటున్న ప్రసిద్ధ వ్యాపారవేత్త పంకజ్ భట్టి (బోమన్ ఇరానీ) హత్యకు గురవుతాడు. పోలీస్​ ఆఫీసర్‌‌‌‌ నటాషా (డయానా పెంటీ)కు ఆ కేసు దర్యాప్తు బాధ్యతలు అప్పగిస్తారు.

 కానీ.. ఆమె షెర్డిల్‌‌ సాయం కోరుతుంది. షెర్డిల్‌‌ ఇన్వెస్టిగేషన్‌‌ మొదలుపెట్టాక భట్టి కుటుంబంలోని ప్రతి ఒక్కరినీ అనుమానిస్తాడు. భట్టి రాసిన వీలునామా చదివిన షెర్డిల్‌‌కు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. అతని ఆస్తిలో ఎక్కువ భాగాన్ని భార్య రాజేశ్వరి (రత్న పాఠక్ షా), కుమారుడు అంగద్ (సుమీత్ వ్యాస్), కూతురు శాంతి (బనితా సంధు)లకు కాకుండా మరో వ్యక్తికి రాస్తాడు. అతను ఎవరు? భట్టిని ఎవరు చంపారు? తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి. 

పోలీస్‌‌ మిస్సింగ్​!

టైటిల్ : కేరళ క్రైమ్‌‌ ఫైల్స్‌‌ సీజన్‌‌ 2 
ప్లాట్​ ఫాం : జియో హాట్‌‌స్టార్‌‌, 
డైరెక్షన్ : అహ్మద్ కబీర్
కాస్ట్​ : ఇంద్రన్స్, హరిశ్రీ అశోకన్, సిరాజుద్దీన్ నాజర్, అర్జున్ రాధాకృష్ణన్, లాల్, అజు వర్గీస్, నవాస్ వల్లికున్ను, సంజు సానిచెన్, శిబ్లా ఫరా 

రెండేళ్ల క్రితం విడుదలైన కేరళ క్రైమ్‌‌ ఫైల్స్‌‌ సీజన్‌‌-–1 వెబ్‌‌సిరీస్‌‌ విజయం సాధించడంతో ఇప్పుడు సీజన్‌‌–2ని రిలీజ్‌‌ చేశారు. మొదటి సీజన్​లో కథ ఓ వేశ్య మర్డర్‌‌‌‌ కేసు చుట్టూ తిరుగుతుంది. ఈ సీజన్​ కథలోకి వెళ్తే.. కేరళలోని ఒక పోలీస్‌‌ స్టేషన్‌‌లో పని చేసే అధికారులంతా అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తాయి. దాంతో వాళ్లందర్నీ వేరే చోట్లకు ట్రాన్స్‌‌ఫర్‌‌ చేస్తారు. వాళ్ల ప్లేస్‌‌లో కొత్తవాళ్లను నియమిస్తారు. 

అయితే.. బదిలీపై అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిన అంబులి రాజు (ఇంద్రన్స్) అనే ఓ సిన్సియర్ కానిస్టేబుల్ కనిపించకుండా పోతాడు. దాంతో ఆ స్టేషన్‌‌కు కొత్తగా వచ్చిన  సీఐ కురియన్ (లాల్), ఎస్సై నోబుల్ (అర్జున్ రాధాకృష్ణన్) దర్యాప్తు మొదలుపెడతారు. అంబిలి రాజు ఆచూకీ కనిపెట్టేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ ప్రయాణంలో వాళ్లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? అంబులి రాజు ఏమయ్యాడు? తెలియాలంటే వెబ్‌‌సిరీస్‌‌ చూడాలి. 

కార్తీకకు ఏం జరిగింది? 

టైటిల్ : యుగి, 
ప్లాట్​ ఫాం : ఆహా
డైరెక్షన్ : జాక్ హారిస్,
కాస్ట్​ : కతిర్, పవిత్ర లక్ష్మి, నట్టి నటరాజ్, ఆనంది, ఆత్మీయ రాజన్, మునీష్ కాంత్, ప్రతాప్ పోతన్, నమో నారాయణ్, వినోదిని వైద్యనాథన్ 

పురుషోత్తమన్ (ప్రతాప్ పోతన్) అనే సీనియర్ పోలీస్ ఆఫీసర్​ని స్మగ్లింగ్‌‌కు సాయం చేస్తున్నాడనే ఆరోపణలతో సస్పెండ్‌‌ చేస్తారు. అతన్ని ఒక పొలిటీషియన్‌‌ గ్యాంగ్‌‌ వెతుకుతుంటుంది. ఒకరోజు పురుషోత్తమన్ డిటెక్టివ్ నందకుమార్ (నరైన్)కు ఫోన్‌‌ చేసి ఒక అమ్మాయిని వెతికే పనిని అప్పగిస్తాడు. అతనికి సాయంగా ఉండేందుకు సబ్-ఇన్‌‌స్పెక్టర్‌‌‌‌ రాజ్‌‌కుమార్ (కథిర్)ని కూడా పంపుతాడు. అప్పటినుంచి నందకుమార్‌‌‌‌ తన అసిస్టెంట్‌‌, రాజ్‌‌కుమార్‌‌‌‌తో కలిసి కార్తీక (ఆనంది)ని వెతుకుంటాడు. 

అదే టైంలో పొలిటీషియన్‌‌కు చెందిన సేతు (నట్టి) అనే రౌడీ టీం కూడా కార్తీకను వెతికే పనిలో ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన నందకుమార్‌‌‌‌కు కార్తీక ప్రెగ్నెంట్‌‌ అని, ఒకరోజు బస్‌‌స్టాప్ దగ్గర నిల్చొని ఉన్న ఆమెని ఎవరో గుర్తు తెలియని మహిళ కారులో ఎక్కించుకుని తీసుకెళ్లిందని తెలుస్తుంది. అప్పటినుంచే కార్తీక కనిపించకుండా పోతుంది. ఇంతకీ కార్తీకకు ఏం జరిగింది? వీళ్లంతా ఆమెని ఎందుకు వెతుకుతున్నారు? తెలుసుకోవాలంటే సినిమా చూడాలి.