హెచ్-1బీ వీసాలకు కొత్త రూల్స్.. కనీస వేతనం 14 వేల డాలర్లు పెంచే యోచన!

హెచ్-1బీ వీసాలకు కొత్త రూల్స్.. కనీస వేతనం 14 వేల డాలర్లు పెంచే యోచన!
  • అమెరికా సర్కారుకు లేబర్ డిపార్ట్‌‌‌‌మెంట్ కీలక ప్రతిపాదన

వాషింగ్టన్:  అమెరికా కార్మిక శాఖ ఒక కీలక ప్రతిపాదనను ట్రంప్ సర్కార్ ముందుకు తెచ్చింది. హెచ్-1బీ వంటి కీలక వీసాల మీద పని చేసే వారి కనీస వేతన పరిమితులను (ప్రెవైలింగ్ వేజెస్) భారీగా పెంచాలని సూచించింది. ఈ కొత్త సంస్కరణల వల్ల అమెరికాలో పనిచేసే విదేశీ ఉద్యోగుల సగటు వార్షిక వేతనం సుమారు 14,000 డాలర్లు (సుమారు రూ. 11.7 లక్షలు) పెరిగే అవకాశం ఉంటుంది. 

దాదాపు 20 ఏండ్లుగా  అమల్లో ఉన్న పాత వేతన పద్ధతులను మార్చడం ద్వారా విదేశీయులకు, స్థానిక అమెరికన్లకు ఇచ్చే జీతాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించాలని గత కొంతకాలంగా ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే అమెరికా లేబర్ డిపార్ట్ మెంట్ ..ప్రస్తుతమున్న నాలుగు వేజ్ లెవల్స్ మార్పులు చేస్తూ ప్రతి స్థాయిలోనూ కనీస వేతన శాతాన్ని పెంచాలని ప్రతిపాదించింది. దీని ప్రకారం.. ఎంట్రీ లెవల్ ఉద్యోగుల వేతన పరిమితిని 17వ శాతం నుంచి 34వ శాతానికి పెంచనున్నారు.

 అంటే, అమెరికాలో ఒకే రకమైన సాఫ్ట్‌‌‌‌వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేసే 100 మంది అమెరికన్లలో అతి తక్కువ జీతం తీసుకునే 17వ వ్యక్తి ఎంత తీసుకుంటున్నాడో.. అంత జీతం ఇచ్చి విదేశీయుడిని (హెచ్-1బీ వంటి వీసాలపై) నియమించుకోవడానికి కంపెనీలకు అనుమతి ఉండేది. ఇప్పుడు ఆ కనీస పరిమితిని 34వ వ్యక్తి తీసుకునే జీతానికి పెంచనున్నారు. అలాగే, అత్యున్నత స్థాయి ఉద్యోగుల వేతన పరిమితిని 67  నుంచి 88 శాతానికి పెంచనున్నారు.