IND vs NZ: మిచెల్, నికోల్స్, కాన్వే హాఫ్ సెంచరీలు.. తొలి వన్డేలో టీమిండియా టార్గెట్ ఎంతంటే..?

IND vs NZ: మిచెల్, నికోల్స్, కాన్వే హాఫ్ సెంచరీలు.. తొలి వన్డేలో టీమిండియా టార్గెట్ ఎంతంటే..?

న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా బౌలర్లు అంచనాలకు తగ్గట్టుగా రాణించడంలో విఫలమయ్యారు. ఆదివారం (జనవరి 11) వడోదర వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. కివీస్ కు ఓపెనర్లు నికోల్స్ (62), కాన్వే (56) ఓపెనర్లతో పాటు డారిల్  మిచెల్ (84) హాఫ్ సెంచరీ చేయడంతో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. మిచెల్ 84 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత బౌలర్లలో హర్షిత్ రానా, ప్రసిద్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ తలో రెండు వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్ కు ఒక వికెట్ దక్కింది.  

ఓపెనర్లు అదరహో:

ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ కు ఓపెనర్లు హెన్రీ నికోల్స్, డేవాన్ కాన్వే అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. తొలి వికెట్ కు 117 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారీ స్కోర్ కు బాటలు వేశారు. ఆరంభంలో ఆచితూచి ఆడిన వీరిద్దరూ ఆ తర్వాత క్రమంగా బ్యాట్ ఝులిపించారు. 4 పరుగుల వద్ద కుల్దీప్.. కాన్వే క్యాచ్ మిస్ చేయడంతో టీమిండియా త్వరగా తొలి వికెట్ సాధిబీచే అవకాశాన్ని కోల్పోయింది. ఈ క్రమంలో మొదట నికోల్స్ తర్వాత కాన్వే తమ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ప్రమాదకరంగా మారుతున్న ఓపెనింగ్ జోడీని హర్షిత్ రానా విడగొట్టాడు. 

మిచెల్ ఒంటరి పోరాటం: 

నికోల్స్ (62) ను ఔట్ చేసి ఇండియాకు తొలి వికెట్ అందించాడు. కాసేపటికే కాన్వే (56) కూడా ఔట్ కావడంతో కివీస్ స్వల్ప వ్యవధిలో ఓపెనర్లను కోల్పోయింది. ఆ తర్వాత మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన విల్ యంగ్ (12).. ఐదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన ఫిలిప్స్ (12) నిరాశపరిచారు. దీంతో వికెట్ నష్టపోకుండా 117 పరుగులతో పటిష్టంగా కనిపించిన న్యూజిలాండ్.. 170 పరుగులకు నాలుగు వికెట్లను చేజార్చుకుంది. వికెట్ కీపర్ మిట్చ్ హే (18), కెప్టెన్ మైకేల్ బ్రేస్ వెల్ (16) తక్కువ పరుగులకే వెనుదిరగడంతో న్యూజిలాండ్ కష్టాల్లో పడినట్టు అనిపించింది. అయితే ఒక ఎండ్ లో వికెట్లు పడుతున్నా మరో ఎండ్ లో మిచెల్ (88)చివరి వరకు క్రీజ్ లో ఉండి జట్టుకు డీసెంట్ టోటల్ అందించాడు.