బోనస్ సిస్టమ్తో దోపిడీకి ఉబెర్ ప్లాన్.. దిమ్మతిరిగే హ్యాక్తో షాక్ ఇచ్చిన నైజీరియా డ్రైవర్లు!

బోనస్ సిస్టమ్తో దోపిడీకి ఉబెర్ ప్లాన్.. దిమ్మతిరిగే హ్యాక్తో షాక్ ఇచ్చిన నైజీరియా డ్రైవర్లు!

టెక్‌ దిగ్గజం ఉబెర్ (Uber) కంపెనీయే నివ్వెరపోయేలా నైజీరియా డ్రైవర్లు చేసిన ఒక  ప్రయోగం ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. కార్పొరేట్ కంపెనీలు అందించే ఇన్సెంటివ్‌లు, బోనస్‌లను అక్కడి డ్రైవర్లు ఏ విధంగా తమకు అనుకూలంగా మార్చుకున్నారనే ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ హాస్యనటుడు ట్రెవర్ నో (Trevor Noah) తన షోలో ఈ ఆసక్తికరమైన అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడంతో ఇది మరింత ప్రాచుర్యం పొందింది. అసలు నైజీరియా డ్రైవర్లు ఆ టెక్ దిగ్గజం నిబంధనలను ఎలా తిప్పికొట్టారో ఈ కథనంలో చూద్దాం.

ఉబెర్ వేసిన ప్లాన్.. డ్రైవర్ల కౌంటర్ ఎటాక్!

కొన్ని సంవత్సరాల క్రితం ఉబెర్ సంస్థ ఆఫ్రికా మార్కెట్లోకి, ముఖ్యంగా నైజీరియాలోని లాగోస్ నగరంలో తన వ్యాపారాన్ని విస్తరించేందుకు భారీ ప్రయత్నాలు చేసింది. స్థానిక  క్యాబ్ డ్రైవర్లతో పోటీ పడేందుకు, తన ప్లాట్‌ఫామ్‌ వైపు డ్రైవర్లను ఆకర్షించేందుకు ఉబెర్ భారీ ఆఫర్లు ప్రకటించింది.

ముఖ్యంగా ఎయిర్‌పోర్ట్ నుంచి సిటీలోకి ప్రయాణికులను చేరవేసే డ్రైవర్లకు సాధారణ ఛార్జీలతో పాటు అదనంగా  బోనస్‌లు, సబ్సిడీలను ఇస్తామని ఉబెర్ ఆఫర్ ఇచ్చింది. ప్రయాణికులకు ఎప్పుడూ కార్లు అందుబాటులో ఉండాలనేది ఉబెర్ ప్రధాన ఉద్దేశం. అయితే, నైజీరియా డ్రైవర్లు ఈ నిబంధనలోని లూప్‌హోల్స్  పట్టుకుని ఒక అద్భుతమైన మార్గాన్ని ఎంచుకున్నారు.

అసలు ట్రిక్ ఇదే: ప్రయాణికుడు లేకపోయినా బోనస్ పక్కా!

ఉబెర్ ఇచ్చిన బోనస్ నిబంధనలను బేరీజు వేసుకున్న డ్రైవర్లు ఒక మాస్టర్ ప్లాన్ వేసారు.  ప్రయాణికులను ఎక్కించుకుని తిరగడం కంటే, కేవలం ఉబెర్ ఇచ్చే బోనస్‌లతోనే సులభంగా సంపాదించవచ్చని  లెక్కగట్టారు.  నగరంలోని డ్రైవర్లు ఎయిర్‌పోర్ట్ లొకేషన్‌కు రైడ్ బుక్ చేసుకునేవారు. ప్రయాణికులు ఎవరూ లేకపోయినా సరే, ఖాళీగానే ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి అక్కడి నుంచి తిరిగి సిటీకి వచ్చేసేవారు.

 ఇలా చేయడం వల్ల ఉబెర్ ఇచ్చే బోనస్ అమౌంట్ ద్వారా పెట్రోల్ ఖర్చులు పోను మంచి లాభాలు మిగిలేవి.  ప్రయాణికుల కోసం ఎలాంటి ఇబ్బంది పడకుండా, రోజంతా కేవలం ఈ ట్రిక్ ద్వారానే బోనస్‌లు కాజేస్తూ హాయిగా జీవించవచ్చని నిరూపించారు. 

కార్పొరేట్ కంపెనీకి దిమ్మతిరిగే షాక్

 కంపెనీలు ఇచ్చే ఇన్సెంటివ్‌లను వ్యాపార వృద్ధి కోసం వాడతామని కంపెనీ భావిస్తే, యూజర్లు మాత్రం ఆ సిస్టమ్ నుంచి ఎలా లాభం పొందాలనే కోణంలో ఆలోచిస్తారు  అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఉబెర్ పెట్టిన నిబంధనల వల్ల సంస్థ వ్యాపారం పెరుగుతుందని ఆశించినా, డ్రైవర్లు మాత్రం కేవలం బోనస్‌లనే తమ ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నారు.

ఈ ఉదంతంపై నెటిజన్లు సరదాగా స్పందిస్తూ నైజీరియన్ల వ్యాపార చతురతను, ప్రాక్టికల్ ఆలోచనను ప్రశంసిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, ఒక గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం అనుసరించిన విధానాన్ని స్థానిక పరిస్థితులకు అనుగుణంగా డ్రైవర్లు తమకు అనుకూలంగా మలచుకున్న ఈ వైనం కార్పొరేట్ వర్గాల్లో ఇప్పటికీ ఒక హాట్ టాపిక్‌గా మారింది.