నిహారిక కొణిదెల పేరు వినగానే ఒకప్పుడు మెగా డాటర్ అనే గుర్తింపు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఆమె ఒక సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్. తన 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' బ్యానర్‌పై వైవిధ్యమైన కంటెంట్‌తో దూసుకుపోతుంది. అయితే ఇటీవల తనపై వస్తున్న విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చారు నిహారిక. త్వరలో విడుదల కానున్న 'రాకాస' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
నా ప్రతి అడుగుపై విమర్శలు
కెరీర్ ప్రారంభం నుండి నా ప్రతి అడుగుపై విమర్శలు వస్తూనే ఉన్నాయి అన్నారు నిహారిక. నేను ఏ నిర్ణయం తీసుకున్నా ప్రశ్నలే ఎదురవుతున్నాయి అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.11 మంది కొత్త కుర్రాళ్లతో 'కమిటీ కుర్రాళ్ళు ' సినిమా తీస్తున్నప్పుడు అంతమంది కొత్తవాళ్లతో రిస్క్ ఎందుకు? తలనొప్పులు కొనితెచ్చుకోవడం అవసరమా? అని చాలా మంది ప్రశ్నించారు. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించి అందరి నోళ్లు మూయించిందని చెప్పారు.
ఇప్పుడు నయన్ సారిక, సంగీత్ శోభన్ ప్రధాన పాత్రల్లో వస్తున్న 'రాకాస' విషయంలోనూ అదే పరిస్థితి అని చెప్పుకొచ్చారు నిహారిక. హారర్ కామెడీ, పైగా భారీ వీఎఫ్ఎక్స్ (VFX) ఎందుకు? సేఫ్ జోన్‌లో వెళ్లొచ్చు కదా అన్న విమర్శలకు ఆమె తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.. అన్నయ్య వరుణ్ తేజ్‌తో భారీ బడ్జెట్ సినిమా అనౌన్స్ చేయగానే, అప్పుడే అంత పెద్ద ప్రాజెక్ట్ అవసరమా? అని కొందరు విమర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నన్ను ఎవరూ ఆపలేరు!
నిహారిక తన ప్రసంగంలో ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. ఎదుటివారు ఏమనుకుంటున్నారనే దానికంటే, తన కథపై తనకు ఉన్న నమ్మకమే ముఖ్యమని చెప్పారు. నేను ఏం చేసినా విమర్శించే వాళ్లు ఉంటూనే ఉంటారు. చిన్న వాళ్లతో చేస్తే ఎందుకు అంటారు, పెద్ద వాళ్లతో చేస్తే ఎందుకు అంటారు. కానీ నేను నమ్మిన దారిలో ముందుకు సాగుతాను. నా ప్లానింగ్‌ను, నా ఇన్‌స్టింక్ట్స్‌ను నేను నమ్ముతాను. ఎవరూ నన్ను ఆపలేరు అని నిహారిక కుండబద్దలు కొట్టారు.
ఏప్రిల్ 3న 'రాకాస' సందడి
విజువల్ వండర్‌గా రాబోతున్న 'రాకాస' ఏప్రిల్ 3న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. కేవలం నిర్మాతగానే కాకుండా, క్రియేటివ్ హెడ్‌గా కూడా నిహారిక ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. ఒకపక్క వెబ్ సిరీస్‌లు, మరోపక్క భారీ సినిమాలు నిర్మిస్తూ టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేస్తున్న నిహారిక, రాబోయే రోజుల్లో మరిన్ని ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు.
