తాగునీటిలో ఫ్లోరైడ్ దేశవ్యాప్తంగా ఉన్న సమస్య. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ బాధితుల కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువే. పుట్టుకతోనే కాళ్లు, చేతులు వంకరగా మారటం, వంగిన నడుముతో, ఎదగని శరీరంతో.. ఒక్కటేమిటి. ఆ బాధలు వర్ణనాతీతం. ఇప్పటి వరకు ఉన్న ఫ్లోరైడ్ ప్రత్యా్మ్నాయ మార్గాలు సమస్యను పూర్తిగా తొలగించలేకపోయాయి. దీనికి తోడు ఖర్చుతో కూడుకున్నవి కావడం. అయితే తక్కువ ఖర్చుతో.. పనస తొక్కలతో ఫ్లోరైడ్ తొలగించే టెక్నిక్ ను మన పొరుగు రాష్ట్రం ఒడిషాలో కనుగొన్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
పనస తొక్కలతో నీటిలోని ఫ్లోరైడ్ను సమర్థవంతంగా తొలగించవచ్చని ఒడిశాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) రూర్కెలా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వ్యర్థాలుగా పారేసే పనస తొక్కల (Jackfruit Peels) నుంచి తక్కువ ఖర్చుతో కూడిన మెటీరియల్ను తయారు చేసి ఫ్లోరైడ్ ను వేరు చేసే సరికొత్త టెక్నాలజీకి పేటెంట్ కూడా సాధించారు.భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ సమస్యకు ఇది పర్యావరణ అనుకూలమైన, తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయంగా నిలవనుంది.
పరిశోధన ప్రత్యేకతలు:
ఎన్ఐటీ రూర్కెలా కెమికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ సుస్మితా మిశ్రా, రీసెర్చ్ గ్రాడ్యుయేట్ ప్రతిమా మింజ్ ఈ ఘనత సాధించారు. పనస తొక్కల నుంచి సేకరించిన యాక్టివేటెడ్ కార్బన్ను (Activated Carbon), జిర్కోనియం (Zirconium) అనే మూలకంతో అనుసంధానించారు. ఇది నీటిలో కరిగి ఉన్న ఫ్లోరైడ్ను చాలా వేగంగా ఆకర్షించి విడదీస్తుంది.
ప్రయోగశాల పరీక్షల్లో ఈ మెటీరియల్ కేవలం 10 నుండి 20 నిమిషాల వ్యవధిలోనే నీటిలో ఉన్న 90 నుంచి 97 శాతం ఫ్లోరైడ్ను విజయవంతంగా తొలగించింది. ల్యాబ్ అంచనాల ప్రకారం ఈ మెటీరియల్ తయారీకి గ్రాముకు కేవలం రూ. 37 మాత్రమే ఖర్చు అవుతుంది.
ఇప్పటి వరకు ఉన్న పద్ధతుల కంటే ఎలా మెరుగైనది?
ప్రస్తుతం వాడుతున్న ఫ్లోరైడ్ నివారణ పద్ధతులతో పోలిస్తే ఇది ఎంతో లాభదాయకమైనదిగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఎక్కువ వాడకంలో ఉన్న పద్ధతులు ఇవి:
1. రివర్స్ ఆస్మోసిస్ (RO):
ఈ పద్ధతిలో చాలా నీరు వృథా అవుతుంది. అలాగే ఆరోగ్యానికి మేలు చేసే కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు కూడా పోతాయి. కానీ పనస తొక్కల సాంకేతికతలో ఆ సమస్య ఉండదు.
2. అయాన్ ఎక్స్ఛేంజ్ & యాక్టివేటెడ్ అల్యూమినా:
ఈ పద్ధతులలో హానికరమైన రసాయనాలు వాడాల్సి వస్తుంది. పనస తొక్కల పద్ధతి పూర్తిగా పర్యావరణ అనుకూలమైనది (Eco-friendly).
ఈ పరిశోధన ప్రస్తుతం ప్రయోగశాల స్థాయిలో (TRL 4) విజయవంతమైంది. దీనిని భవిష్యత్తులో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఇళ్లకు, కమ్యూనిటీలకు అందుబాటులోకి తెచ్చేలా తక్కువ ఖర్చుతో కూడిన వాటర్ ప్యూరిఫైయర్/ఫిల్టర్ ప్రోటోటైప్లను అభివృద్ధి చేయడానికి శాస్త్రవేత్తలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
