నేటి ఉరుకుల పరుగుల జీవితంలో రోజంతా ఆఫీస్ ఫైళ్లు, ల్యాప్టాప్లు, ఇంటి పనుల ఒత్తిడితో తల్లిదండ్రులు తీవ్రంగా అలసిపోతున్నారు. అయినప్పటికీ, రాత్రి పడుకునే ముందు పిల్లల పక్కన చేరి చందమామ కథో, నీతి కథో చెప్పేందుకు సమయం కేటాయించేవారు చాలామందే ఉన్నారు.
అయితే, ఇది కేవలం వాళ్లను జోకొట్టి నిద్రపుచ్చడానికి మాత్రమే అనుకుంటే పొరపాటే! రాత్రి పూట పిల్లలకు కథలు చెప్పడం అనేది వారి మాయా ప్రపంచంలోకి పెద్దలు వెళ్లడానికి, వారితో బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి లభించే ఒక అద్భుతమైన అవకాశం. ఈ అలవాటు పిల్లల మానసిక వికాసానికి ఎలా దోహదపడుతుందో, దీన్ని మరింత ఆసక్తికరంగా ఎలా మార్చవచ్చో ఇక్కడ తెలుసుకుందాం.
అనుబంధాన్ని పెంచే అమృత సమయం
తల్లిదండ్రులు పిల్లల పక్కన కూర్చుని కథ చెప్పినప్పుడు వారి మధ్య ఎంతో ఆత్మీయమైన, ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. కథలోని పాత్రల గురించి పిల్లలు ప్రశ్నలు అడగడం, తమకు తోచిన అభిప్రాయాలను వ్యక్తపరచడం, తల్లిదండ్రులతో కలిసి హాయిగా నవ్వడం వంటి చిన్న చిన్న సందర్భాలు వారి మధ్య ఉన్న దూరాన్ని తగ్గిస్తాయి. రోజూ కొంతసేపు తమ కోసం తల్లిదండ్రులు సమయాన్ని కేటాయిస్తున్నారనే భావన పిల్లల్లో కలిగినప్పుడు, వారిలో ప్రేమ, ఆదరణ, మానసిక భద్రతాభావం అమాంతం పెరుగుతాయని పరిశోధనలు సైతం సూచిస్తున్నాయి.
క్రమబద్ధమైన దినచర్య.. ప్రశాంతమైన నిద్ర
రాత్రి పడుకునే ముందు పళ్లు తోముకోవడం, బెడ్ ఎక్కడం, కథ చదవడం వంటి అలవాట్లను ఒక క్రమ పద్ధతిలో అలవాటు చేయడం వల్ల పిల్లలకు తర్వాత ఏం జరగబోతోందో ఒక స్పష్టత వస్తుంది. రోజంతా స్కూల్, ఆటలతో హడావుడిగా గడిపిన మైండ్, కథలు వినడం ద్వారా ప్రశాంతత వైపు అడుగులు వేస్తుంది. ఇది వారు హాయిగా నిద్రపోయేలా చేయడానికి దోహదపడుతుంది. అయితే, నిద్రలేమి సమస్యలకు కథలే పూర్తి పరిష్కారమని మాత్రం భావించకూడదు. ఇదొక మంచి అలవాటు మాత్రమేనని గుర్తించాలి.
భాషా నైపుణ్యాలకు గట్టి పునాది
కథలు వినడం వల్ల పిల్లల మెదడు చురుగ్గా మారుతుంది. వారికి ఎన్నో కొత్త కొత్త పదాలు పరిచయమవడమే కాకుండా వాక్య నిర్మాణం, భావాలను వ్యక్తపరిచే తీరు సులువుగా అర్థమవుతాయి. కథ చెప్తున్నప్పుడు పిల్లల మైండ్లో ఓ విజువల్ సినిమా రన్ అవుతుంది. దీనివల్ల వారిలో ఊహాశక్తి అద్భుతంగా పెరుగుతుంది. అలాగే కథలో తర్వాత ఏం జరుగుతుందో ఊహించమని అడగడం, ఈ పాత్ర చేసిన పని నీకు నచ్చిందా అని చర్చించడం వల్ల వారి ఆలోచనా పరిధి, సంభాషణా చాతుర్యం ఎంతో మెరుగవుతాయి.
కథ కంటే.. చెప్పే ‘తీరు’ ముఖ్యం
పుస్తకంలో ఉన్న కథను కేవలం ఒక వార్తలా చదివి ముగించేస్తే పిల్లలకు బోర్ కొడుతుంది. అందువల్ల కథను ఎంపిక చేసుకునే చాన్స్ పిల్లలకే ఇవ్వాలి. కథ చెప్పేటప్పుడు పిచ్చుక మాట్లాడితే ఒకలా, ఏనుగు మాట్లాడితే ఒకలా గొంతు మార్చి (వాయిస్ మోడ్యులేషన్) చెప్తే పిల్లలు ఫుల్ థ్రిల్ అవుతారు. మధ్యమధ్యలో వారిని ప్రశ్నలు అడగనిస్తూ, పాత్రల మంచి చెడ్డల గురించి వారితో మాట్లాడితేనే ఆ సమయం వారికి ఒక ఆహ్లాదకరమైన అనుభవంగా మారుతుంది.
