టైగర్ నాకు బెస్ట్  లాంచింగ్ అవుతుంది : నుపూర్ సనన్‌‌

టైగర్ నాకు బెస్ట్  లాంచింగ్ అవుతుంది : నుపూర్ సనన్‌‌

రవితేజ హీరోగా వంశీ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. కృతి సనన్ చెల్లెలు నుపూర్ సనన్‌‌ ఈ చిత్రంతో హీరోయిన్‌‌గా టాలీవుడ్‌‌కు పరిచయం అవుతోంది. ఈనెల 20న సినిమా విడుదలవుతున్న సందర్భంగా నుపూర్ సనన్​ ఇలా ముచ్చటించింది.

 ‘‘ఇందులో ‘సార’ అనే మార్వాడీ అమ్మాయిగా కనిపిస్తా. ప్రేమించిన వ్యక్తి కోసం ఏదైనా చేసే అమ్మాయి. గ్లామర్‌‌‌‌గా కనిపిస్తూనే నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర. ఫస్ట్ సినిమాకే ఇలాంటి చాలెంజింగ్ క్యారెక్టర్ లభించడం సంతోషంగా ఉంది. ఇందులో రవితేజ గారు హీరోగా నటించడం, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ నిర్మిస్తున్న చిత్రం కావడంతో.. తెలుగులో నాకిది మంచి లాంచింగ్ అవుతుందని భావిస్తున్నాను. అలాగే డైరెక్టర్ వంశీ.. దాదాపు 200 మందిని ఆడిషన్స్ చేశాక, ఈ పాత్రకు నేను యాప్ట్ అవుతానని నమ్మారు. ఇక రవితేజ గారు మాస్ మహారాజా అనే బిరుదుకు పర్ఫెక్ట్ యాప్ట్.

ఆయన కామిక్ టైమింగ్ అద్భుతం.  హిందీ కూడా బాగా మాట్లాడతారు కనుక నాకు చాలా హెల్ప్ అయింది.  నా కెరీర్‌‌‌‌ విషయంలో అక్క కృతిసనన్ ఇచ్చిన సలహా ఒక్కటే. ‘నువ్వు నీలా ఉండు’ అని. దాన్నే ఫాలో అవుతున్నాను. తెలుగులో నాకు సాయిపల్లవి ఇష్టం. అలాగే అనుష్క, కీర్తి సురేష్ కూడా. టాలీవుడ్ హీరోల్లో నాని, రామ్, విశ్వక్ సేన్ ఇష్టం.  ప్రస్తుతం నవాజుద్దీన్ సిద్ధిఖీతో ఓ సినిమా చేస్తున్నాను’’.