- ఎర్రవల్లిలో హార్టికల్చర్, ఇరిగేషన్ అధికారుల పర్యటన
- కేసీఆర్ ఫాంహౌస్, చుట్టుపక్కల పంట పొలాల పరిశీలన
- పాండురంగ చెరువు నుంచి నీటి సరఫరా, డ్రిప్ ఇరిగేషన్ పై ఆరా
ములుగు, గజ్వేల్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు చెందిన ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌కు నీటి మళ్లింపుపై సమగ్ర విచారణ జరిపేందుకు సంబంధిత శాఖల అధికారులు రంగంలోకి దిగారు.
గురువారం సిద్దిపేట జిల్లా హార్టికల్చర్ డిప్యూటీ డైరెక్టర్(డీడీ) సువర్ణ, ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) శ్రీనివాస్, డీఈఈ చాందీరాం నాయక్, ఆయా శాఖల మండల స్థాయి అధికారులు సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని పాండురంగ చెరువు పరిసరాల్లో పర్యటించారు. కొండపోచమ్మ సాగర్, పాండురంగ చెరువు నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్ కు నీటిని తరలిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు.
పాండురంగ చెరువు నుంచి నీళ్లు ఎక్కడెక్కడికి సరఫరా అవుతున్నాయి, ఔట్ లెట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో చూశారు. జోన్ల వారీగా బోరు మోటార్లు, పైపుల ద్వారా నీటి సరఫరా తీరును పరిశీలించారు. అలాగే గతంలో ఎర్రవల్లికి మంజూరైన డ్రిప్ ఇరిగేషన్ పథకం అమలు తీరును ప్రత్యేకంగా పరిశీలించారు.
డ్రిప్ ఇరిగేషన్ స్కీమ్ అమలుకు సంబంధించిన వివరాలను హార్టికల్చర్ అధికారులు మ్యాప్‌ల ద్వారా ఇరిగేషన్ అధికారులకు వివరించారు. వీరి వెంట ఇరిగేషన్ ఏఈఈ సాగర్, ఉస్మాన్ సాహిమ్, హార్టికల్చర్ ఆఫీసర్ లు సౌమ్య, భాస్కర్ రెడ్డి ఉన్నారు. పై అధికారుల ఆదేశాల మేరకు ప్రాథమిక స్థాయిలో పరిశీలించామని, పూర్తి స్థాయి ఎంక్వైరీ తర్వాత ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని హార్టికల్చర్ డీడీ సువర్ణ తెలిపారు.
