నటించడం కంటే నేచురల్ గా చేసే పర్ఫార్మెన్స్ కే ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతారు ఆడియెన్స్. అందుకే కొత్తవాళైనా సరే సహజంగా నటిస్తే నెత్తిన పెట్టుకుంటారు. రియా శిబు.. కూడా ఈ కోవలోకే వస్తుంది. తన నేచురల్ యాక్టింగ్ ప్రేక్షకుల్ని కట్టిపడేసిన ఈ అమ్మాయి ఒకే ఒక్క సినిమాతో పాపులారిటీ సంపాదించుకుంది. నివిన్ పౌలీ నటించిన 'సర్వమ్ మాయ' సినిమాలో డెలులు పాత్రలో ఒదిగిపోయింది. నటిగా, నిర్మాతగా నాలుగు సినిమాలు చేసిన రియాకి ఇది నటిగా రెండో సినిమా.
రియా 2004లో పుట్టింది. చెన్నైలోని త్రివేండ్రం ఇంటర్నేషనల్ స్కూల్లో చదువు విజువల్ కమ్యూనికేషన్స్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. నటికాకముందే రియాకి ఇండస్ట్రీతో పరిచయం ఉంది. ఆమె తండ్రి సినీ ప్రొడ్యూసర్. వాళ్లకి తమిళనాడులోని 'తమీన్స్ ఫిల్మ్' ప్రొడక్షన్ కంపెనీ ఉంది. ఈ కంపెనీ తమిళ, మలయాళ సినిమాల ప్రొడక్షన్ తోపాటు ఎగ్జిబిషన్, డిస్ట్రిబ్యూషన్లు కూడా చూసుకుంటుంది. రియా బ్రదర్ హిదు హరూన్ కూడా యాక్టరే. మలయాళం, తమిళం, హిందీ సినిమాల్లో నటించాడు. అయితే రియా కూడా తండ్రిలాగే మొదట ప్రొడ్యూసర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది.
2023లో హిందీలో 'ముంబైకర్స్', తమిళంలో 'థగ్స్' అనే సినిమాలకు నిర్మాతగా వ్యవహరించింది. 2024లో 'ముర', గతేడాది 'వీర ధీర శూరన్' వంటి చిత్రాలను నిర్మించింది. ప్రొడక్షన్లో ఉంటూనే మరోవైపు నటిగా తన లక్ ని టెస్ట్ చేసుకుంది. 2024లోనే మలయాళం సినిమా 'కప్'తో మొదటిసారి స్క్రీన్ పై కనిపించింది. లేటెస్ట్ గా వచ్చిన 'సర్వమ్ మాయ'లో 'డెలులు' అనే పాత్రలో నటించింది. ఆ సినిమాలో ఆమె పర్ఫార్మెన్స్ కి బెస్ట్ అప్రిషియేషన్స్ లభించాయి. ప్రస్తుతం బసిల్ జోసెఫ్, టొవినో థామస్, వినీత్ శ్రీనివాసన్ నటిస్తో న్న 'అతిథి'లో ఓ పాత్ర పోషిస్తోంది. ఆ సినిమా వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
"చిన్నప్పటి నుంచి సినిమాలు, కళలంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఫిల్మ్ స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు కథలు రాస్తూ.. అందులోని పాత్రల్లో నన్ను నేను ఊహించుకునేదాన్ని. అలా యాక్టింగ్ మీద నాకు ప్యాషన్ పెరుగుతూవచ్చింది. నాకు ఫోన్ లేదా ఐప్యాడ్ వచ్చాక ఫొటోలు దిగడం, పర్ఫామెన్స్ చేసి వాటిని వీడియోలు తీసుకునేదాన్ని. నేను చూసిన హాలీవుడ్ సినిమాల్లోని సీక్వెన్స్ లను ఇమిటేట్ చేయడానికి ప్రయత్నించేదాన్ని. అయితే అప్పట్లో నేను బర్త్ డేలకు స్కూల్ కి ఖరీదైన బట్టలు వేసుకుని వెళ్లేదాన్ని. అప్పుడు టీచర్స్ నన్నుయాక్టర్ అవుతావా? పాప్ స్టార్లా రెడీ అయ్యావే అని సరదాగా అనేవాళ్లు. ఇప్పుడు 'సర్వమ్ మాయా'లో డైరెక్టర్ అఖిల్ సత్యన్ నాకు అవకాశం ఇవ్వడంతో ఆ కల నిజమైంది. అందరూ నన్ను నయనతార, నజ్రియాలతో పోలుస్తుంటే చాలా థ్రిల్లింగ్గా ఉంది.
'సర్వమ్ మాయ'.. ఎక్స్పీరియెన్స్
నిజానికి మొదట్లో చాలా టెన్షన్ పడ్డాను. ఎందుకంటే నివిన్ పౌలీ లాంటి స్టార్ పక్కన నటించడం అంత ఈజీ కాదు. పైగా నాకు సినిమా కెమెరా ముందు నటించడం కొత్త. ఎలా జరుగుతుందో అనుకున్నా కానీ మేం ఇద్దరం చాలా ఫాస్ట్ గా ఫ్రెండ్స్ అయిపోయాం. అందువల్ల మా కెమిస్ట్రీ చాలా నేచురల్గా ఉంటుంది. చాలా విషయాలు మాట్లాడుకునేవాళ్లం. ఫీడ్ బ్యాక్ షేర్ చేసుకునేవాళ్లం. అవన్నీ నాకు డెలులు పాత్ర పోషించడానికి చాలా హెల్ప్ అయ్యాయి. ఈ సినిమా షూటింగ్ టైంలో సరదాగా ఉన్నప్పుడు నివిన్ పౌలీకి జెన్ జీ లెసన్స్ కూడా చెప్పాను. వాటిలో కొరియన్ 'ఫింగర్ హార్ట్' కూడా ఉంది. అది డైరెక్టర్ అఖిలికి నచ్చింది. దీంతో సినిమాలోనూ ఆసీన్ పెట్టించారు. నువ్వు ఎలా ఉంటావో అలానే మాకు నచ్చావు. కాబట్టి ఇంట్లో ఎలా ఉంటావో అలానే ఉండమనేవాళ్లు. కాస్ట్యూమ్స్ కూడా నావే. కాస్ట్యూమ్ డిజైనర్ సమీరా కొన్ని రకాల కలర్స్ యాడ్ చేసి మ్యాజిక్ చేసేవాళ్లు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో జ్ఞాపకాలను నాకిచ్చింది 'సర్వమ్ మాయ'.
ఫ్యామిలీ సపోర్ట్
నా బ్రదర్ హైదు హరూన్ యాక్టర్ కావడంతో నాకున్న డౌట్స్ అన్నీ అడిగేదాన్ని. అలా నాకు చాలాసార్లు హెల్ప్ చేశాడు. నాకు టెన్షన్ ఉంటే వెంటనే తనకి చెప్తాను. తను నాకు ఎప్పుడూ చెప్పేది ఏంటంటే.. చేయాలనుకున్న పని మీదే దృష్టి ఉంచు. వేరే వాటిని పట్టించుకోవద్దు అని. నాన్న గురించి చెప్పాలంటే.. మొదటి నుంచి ఆయన చేసే వర్క్ గురించి చాలా క్యూరియస్ గా ఉండేదాన్ని. ప్రతీది అడిగేదాన్ని. ఆయన కూడా చాలా ఓపికగా నాకు వివరించేవాళ్లు. అలా నాకు మొదట ప్రొడక్షన్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. అందుకని ప్రొడ్యూసర్గానే ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఒక్కసారి పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యానంటే సొంతంగా హ్యాండిల్ చేయగలననే నమ్మకం నాకుంది" అని పలు ఇంటర్వ్యూల్లో పంచుకుంది.
