భారత్‎కు సాధ్యం కానిదేదీ లేదు.. రిటైర్మెంట్ వేళ పాక్‌కు IAF చీఫ్ స్ట్రాంగ్ కౌంటర్

భారత్‎కు సాధ్యం కానిదేదీ లేదు.. రిటైర్మెంట్ వేళ పాక్‌కు IAF చీఫ్ స్ట్రాంగ్ కౌంటర్

న్యూఢిల్లీ: రిటైర్మెంట్ వేళ ఇండియన్ ఎయిర్‎ఫోర్స్ చీఫ్ ఏపీ సింగ్ పాకిస్తాన్‎కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. భారత్‎కు సాధ్యం కానిదేదీ లేదని.. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండియా చేపట్టిన ఆపరేషన్ సింధూరే ఇందుకు నిదర్శమని అన్నారు. ఆపరేషన్ సింధూర్‎లో భాగంగా పశ్చిమ సరిహద్దు వెంబడి సుమారు 1,200 కిలోమీటర్ల వెడల్పు, 200 కిలోమీటర్ల లోతు పరిధిలో ఖచ్చితమైన దాడులు జరిపిందంటూ భారత వైమానిక దళ పరాక్రమాన్ని ఆయన కొనియాడారు. 

ఈ ఆపరేషన్ ద్వారా ఐఏఎఫ్ పరిధికి అందని శత్రు లక్ష్యం అంటూ ఏదీ లేదని నిరూపితమైందని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత రక్షణ సామర్థ్యాలు ప్రపంచ దేశాలకు తెలిశాయని అన్నారు. దేశ భద్రత, శత్రువులను నిలువరించడంలో వాయు సేన అత్యంత నిర్ణయాత్మకమైన పాత్ర పోషిస్తుందన్నారు. దేశానికి ముప్పు వాటిల్లినప్పుడు తక్షణమే స్పందించే ప్రధాన రక్షణ సాధనంగా ఐఏఎఫ్ నిలిచిందని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ సక్సెస్‎తో సంతృప్తి చెంది ఆగిపోకుండా భవిష్యత్తులో సవాళ్లను ఎదుర్కొనేందుకు వైమానిక దళం తన రక్షణ సామర్ధ్యాలను ఎప్పటికప్పుడూ మరింత విస్తరించాలని సూచించారు. 

2025, ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. బైసారన్ మైదాన ప్రాంతంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. ఉగ్రమూకలు కురిపించిన తుటాల వర్షానికి 26 మంది పర్యాటకులు బలయ్యారు. మతం ఆధారంగా ఒకే వర్గాన్ని టార్గెట్ చేసుకుని నరమేధానికి పాల్పడ్డారు. ఈ ఘటన యావత్ దేశాన్ని ఉలిక్కి పాటుకు గురి చేసింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్‎లో భాగంగా ఐఏఎఫ్ పాకిస్తాన్ భూభాగంలోకి చొరబడి మరీ దాడులు చేసి ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసింది.