రామగుండం కమిషనరేట్ పరిధిలో ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ సక్సెస్ : సీపీ అంబర్ కిశోర్ ఝా

రామగుండం కమిషనరేట్ పరిధిలో ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ సక్సెస్ : సీపీ అంబర్ కిశోర్ ఝా
  • కమిషనరేట్ పరిధిలో 166 మంది బాలలకు విముక్తి, 20 కేసులు
  • రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా

మంచిర్యాల, వెలుగు: రామగుండం కమిషనరేట్ పరిధిలో ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ విజయవంతంగా నిర్వహించామని సీపీ అంబర్ కిశోర్ ఝా అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రతి ఏటా రెండు సార్లు ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తున్నమన్నారు. బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమం ద్వారా తప్పిపోయిన, కిరాణా, మెకానిక్ షాపులు, హోటళ్లు, వివిధ కంపెనీలు, రోడ్లపై భిక్షాటన చేస్తున్న బాలలను గుర్తించి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి వారికి అప్పగించామని, అవసరమైతే చిల్డ్రన్ హోమ్‌లకు పంపింస్తామని తెలిపారు.

మంచిర్యాల జిల్లా పరిధిలో 93 మంది బాలురు, 25 మంది బాలికలను  గుర్తించామన్నారు. వారితో పనులు చేయిస్తున్న 15 మందిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా లో 30 మంది బాలురు, 18 మంది బాలికలను గుర్తించి ఐదుగురిపై నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సక్సెస్​ చేయడంలో పోలీస్ శాఖతో కలిసి కృషి చేసిన వివిధ శాఖల అధికారులు, సిబ్బందిని సీపీ అభినందించారు.