Oscars 2026: “నో టు వార్”.. ఆస్కార్ వేదికపై శాంతి సందేశం.. యుద్ధ వ్యతిరేక బ్యాడ్జీలతో హాలీవుడ్ స్టార్స్

Oscars 2026: “నో టు వార్”.. ఆస్కార్ వేదికపై శాంతి సందేశం.. యుద్ధ వ్యతిరేక బ్యాడ్జీలతో హాలీవుడ్ స్టార్స్

ప్రపంచ సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన “98వ ఆస్కార్ అవార్డుల” వేడుక.. ఈసారి కేవలం సినిమాలకే పరిమితం కాకుండా, గ్లోబల్ సమస్యలపై చర్చకు వేదికగా మారింది. 2026 ఆస్కార్ కార్యక్రమంలో పలువురు హాలీవుడ్ ప్రముఖులు యుద్ధ వ్యతిరేక సందేశాలు, మానవ హక్కుల అంశాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ప్రత్యేకంగా స్పానిష్ నటుడు జేవియర్ బార్డెమ్ (Javier Bardem) తన స్పీచ్లో “No to war” మరియు “Free Palestine” అంటూ గాజాలో శాంతి కోసం పిలుపునిచ్చారు. ఆయన ధరించిన సూట్కు “No a la guerra” (యుద్ధానికి వ్యతిరేకం) మరియు పాలస్తీనాకు మద్దతుగా మరో బ్యాడ్జీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.జేవియర్ బార్డెమ్ గతంలోనే 2003లో ఇరాక్‌పై జరిగిన యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఇదే తరహా “నో టు వార్” బ్యాడ్జ్ ధరించి ఆస్కార్ వేదికపైకి వచ్చానని గుర్తుచేసుకున్నారు.

జేవియర్ బార్డెమ్: హోస్ట్  ప్రియాంక చోప్రాతో పాటు నటుడు జేవియర్ ఆస్కార్ అవార్డులు ప్రదానం చేశాడు. "నో కంట్రీ ఫర్ ఓల్డ్ మెన్" లాంటి సినిమాలతో అద్భుతమైన నటుడిగా జేవియర్ పేరు తెచ్చుకున్నాడు. పైరేట్స్ ఆఫ్ ద కరీబియన్, డూన్ సహా పలు సినిమాల్లో విభిన్నిమైన పాత్రలతో చెరగని ముద్రవేశాడు. అలాగే నో టు వార్ అంటూ బ్రిటిష్ నటి చరిత్ర చంద్రన్ కూడా బ్యాడ్జిపెట్టుకుంది. ఇంకా కొంతమంది ఇలాంటి బ్యాడ్జీలతోనే వచ్చారు.

అమెరికన్ యాక్టర్ మార్క్ రఫెలో వంటి నటులు కూడా అవార్డు సీజన్ ప్రారంభం నుంచే సామాజిక అంశాలపై స్పందిస్తూ వస్తున్నారు. “ప్రపంచంలో జరుగుతున్న విషయాలను పట్టించుకోకుండా ఉండటం కష్టం” అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

రెడ్ కార్పెట్‌పై కూడా పలువురు హాలీవుడ్ స్టార్స్ “Artists4Ceasefire”, “ICE OUT”, “BE GOOD” వంటి సందేశాలతో ఉన్న బ్యాడ్జిలు  ధరించి తమ నిరసన వ్యక్తం చేశారు. గాజాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య కాల్పుల విరమణకు మద్దతు తెలుపుతూ హాలీవుడ్ వేదికను ఉపయోగించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

మొత్తానికి ఈ ఏడాది ఆస్కార్ వేడుకలు.. గతంతో పోలిస్తే మరింత రాజకీయ వాతావరణంలో జరిగాయని విశ్లేషకులు భావిస్తున్నారు. గ్లోబల్ సంక్షోభాలు, మానవ హక్కుల సమస్యలు, యుద్ధాలపై హాలీవుడ్ తన స్వరాన్ని వినిపించిందని అంటున్నారు.