ప్రస్తుతం ఓటీటీ డిజిటల్ ప్రపంచంలో సగటు మనిషికి వినోదం నిత్యావసరంగా మారింది. రోజంతా పడిన కష్టాన్ని మరిచిపోవడానికి ప్రతి ఒక్కరూ కాస్త రిలాక్స్ అవుతూ డిజిటల్ స్క్రీన్లను ఆశ్రయిస్తున్నారు. అయితే ఓటీటీ అంటే ఒకప్పుడు ప్రకటనల గోల లేకుండా నచ్చిన కంటెంట్‌ను ప్రశాంతంగా ఆస్వాదించే వేదిక. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని ఓటీటీ సంస్థలు ప్రవర్తిస్తున్న తీరుపై మాత్రం ప్రేక్షకులు తీవ్రంగా మండిపడుతున్నారు.
యాడ్స్ మధ్యలో మూవీనా?
బుల్లి తెరపై ఓటీటీలు చూడాలంటే భారీగా డబ్బులు పిండి సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు వసూలు చేస్తున్నాయి . అయితే జియో హాట్ పై ప్రేక్షకుల్లో తీవ్ర ఆసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రతి ఐదు నిమిషాలకు వరుసగా రెండు మూడు యాడ్స్ తో దాడి చేస్తూ వీక్షకుల సహనానికి దారుణమైన పరీక్ష పెడుతోంది. అసలు మనం సినిమా చూస్తున్నామా లేక యాడ్స్ మధ్యలో మూవీనా? ఓటీటీకి డబ్బులు కడుతున్నామా... లేక యాడ్స్ చూడటానికా? అంటూ బుల్లితెర ప్రేక్షకులు తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు.
ఫ్యామిలీతో చూస్తే అంతే సంగతులు..
పలు ఓటీటీల్లో కేవలం యాడ్స్ సంఖ్య మాత్రమే కాదు, వాటిలో వస్తున్న కంటెంట్ మరింత అసహ్యకరంగా తయారైంది. ఇంట్లో పిల్లలు, పెద్దలతో కలిసి కుటుంబ సమేతంగా సినిమా చూద్దామని హాట్ స్టార్ ఆన్ చేస్తే చాలు.. సడన్‌గా పాన్ మసాలా, కండోమ్ ప్రకటనలు దర్శనమిస్తున్నాయి. అంతటితో ఆగకుండా తమ ప్లాట్‌ఫామ్‌లో ఉన్న బోల్డ్ సినిమాలు, అశ్లీల వెబ్ సిరీస్‌ల క్లిప్పింగ్స్‌ను పదే పదే వేస్తూ భయపెడుతున్నారు. పక్కన ఉన్న చిన్న పిల్లలు ఆ యాడ్ ను చూసి అదేం మూవీ? అని అడిగితే ఏం చెప్పాలో తెలియక తల్లిదండ్రులు తెల్లముఖం వేయాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. పిల్లల ముందే ఇలాంటి ప్రకటనలు రావడం ఇబ్బందికరంగా మారిందని, కనీసం చూసే కంటెంట్‌కు తగ్గట్టైనా ప్రకటనలు చూపించాలని సూచిస్తున్నారు.
వేరే దారి చూస్తున్న జనాలు..
నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి ప్లాట్‌ఫామ్‌లు సబ్‌స్క్రైబర్ల సమయానికి, డబ్బుకు విలువనిస్తూ కొంత వరకు యాడ్స్ తగ్గించి వినోదాన్ని అందిస్తోంది. కానీ జియో హాట్ స్టార్ మాత్రం వినియోగదారులను పిప్పి చేస్తోంది. ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ సీన్ పీక్స్‌లో ఉన్నప్పుడు మధ్యలో యాడ్స్ రావడం వీక్షకుల మూడ్‌ను పూర్తిగా పాడుచేస్తోంది. ఈ టార్చర్ కంటే పాతకాలపు ఉచిత టీవీయే నయం రా బాబు అని నిట్టూరుస్తున్నారు. చాలామంది హాట్ స్టార్ ను పక్కన పెట్టి వేరే ఓటీటీ ప్లాట్ ఫామ్స్ వైపు మొగ్గుచూపుతున్నారు. జియో హాట్ స్టార్ కంటే యూ ట్యూబ్ బెటర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
