ఈ ఏడాది ఇప్పటి వరకూ రోజుకు 700 మంది ఐటీ ఉద్యోగులను తొలగించిన కంపెనీలు. లేఆఫ్స్ లో ఆల్ టైం రికార్డ్.. తీసేసినోళ్లు అందరూ పెద్ద పెద్ద ఉద్యోగులే.. లక్షల్లో జీతం తీసుకుంటున్నోళ్లే.. ఉద్యోగులను తీసేసిన కంపెనీల్లో మైక్రోసాఫ్ట్, గూగుల్, ఒరాకిల్ లాంటి దిగ్గజాలు ఉండటం ఇదే ఫస్ట్ టైం.. 2026లో.. జనవరి నుంచి జూన్ వరకు అంటే 6 నెలలు.. 180 రోజులు.. ఈ లెక్క తీసుకుంటే.. రోజుకు 700 మంది ఐటీ ఉద్యోగులు తమ ఉద్యోగాలన కోల్పోయారు. హైదరాబాద్ నుంచి అమెరికా వరకు.. యూకే నుంచి వైజాగ్ వరకు ప్రపంచ వ్యాప్తంగా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అనటానికి ఈ డేటాకే నిదర్శనం.
టెక్ ఇండస్ట్రీలో 2026 సరికొత్త మార్పులకు వేదికైంది. గత ఏడాది కరోనా నాటి ఓవర్ రిక్రూట్మెంట్ సర్దుబాటు చేసేందుకు కంపెనీలు లేఆఫ్స్ ప్రకటించగా.. ఈ ఏడాది మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం ఏఐ ఆటోమేషన్ కారణంగా టెక్ కంపెనీలు భారీగా ఉద్యోగాల కోత విధిస్తున్నాయి. 'AI-ఫస్ట్' బిజినెస్ మోడల్‌లోకి మారడమే లక్ష్యంగా వేలాది మంది ఇంజనీర్లు, మేనేజర్లు, సపోర్ట్ స్టాఫ్‌ను ఇంటికి పంపుతున్నాయి.
Layoffs.fyi డేటా ప్రకారం.. ఈ ఏడాది ఇప్పటివరకు 219 కంపెనీలు ఏకంగా లక్షా 19వేల 494 మంది టెక్ ఉద్యోగులను తొలగించాయి. ఖరీదైన AI ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, స్పెషలైజ్డ్ చిప్స్ కొనుగోలుకు అవసరమైన నిధుల కోసమే కంపెనీలు హ్యూమన్ హెడ్‌కౌంట్‌ను నిర్దాక్షిణ్యంగా తగ్గిస్తుండటం గమనార్హం.
కంపెనీల వారీగా లేఆఫ్స్ ఇలా..
* ఒరాకిల్: గడిచిన ఏడాది కాలంలో 21వేల ఉద్యోగులను తొలగించి ఈ లేఆఫ్స్ ట్రెండ్‌లో ముందంజలో ఉంది. AI ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు నిధులు మళ్లించడమే దీనికి కారణం.
* మెటా: మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని మెటా దాదాపు 8వేల మందిని తొలగించగా, మరో 7వేల మందిని AI విభాగాల్లోకి మార్చింది.
* ఇంటుఇట్ & సిస్కో: ఇంటుఇట్ తన సిబ్బందిలో 3వేల మందిని తొలగించగా, సిస్కో మంచి త్రైమాసిక ఫలితాలు సాధించినప్పటికీ AI అవసరాల కోసం 4వేల మందిని తీసేసింది.
* గూగుల్ & క్లౌడ్‌ఫ్లేర్: గూగుల్ తన క్లౌడ్ విభాగంలో 1,500 నుండి 3,000 ఉద్యోగాలను తగ్గించగా, క్లౌడ్‌ఫ్లేర్ రికార్డు స్థాయి ఆదాయాన్ని సాధిస్తూనే 20% సిబ్బందిని (1,100 మంది) తొలగించింది.
ఇతర రంగాలకూ పాకిన AI సెగ..
ఏఐ ప్రభావం కేవలం సాఫ్ట్‌వేర్ రంగానికే పరిమితం కాలేదు. క్రిప్టో ఎక్స్ఛేంజ్ కాయిన్‌బేస్ రొటీన్ పనులను ఆటోమేట్ చేయడానికి 700 మందిని తొలగించింది. ఫిన్‌టెక్ దిగ్గజం పేపాల్ కూడా కస్టమర్, మర్చంట్ సర్వీసుల్లో AIని జోడించి వేలాది మందిని తొలగిస్తోంది. ఆటోమొబైల్ దిగ్గజం జనరల్ మోటార్స్ సైతం తమ ఇంజనీరింగ్, టెక్నాలజీ విభాగాల్లో లేఆఫ్స్‌కు సాఫ్ట్‌వేర్ ఆటోమేషన్ పురోగతి ప్రధాన కారణమని అంగీకరించింది. మొత్తంగా 2026లో టెక్ కంపెనీల మనుగడకు, పోటీని తట్టుకోవడానికి మానవ వనరుల కంటే AI ఆటోమేషనే ప్రాధాన్యంగా మారిందని లేఆఫ్ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.
