ఇస్లామాబాద్: పాకిస్తాన్ గగనతలంలో భారత విమానాల నిషేధాన్ని ఆ దేశం మరో నెల రోజుల పాటు పొడిగించింది. భారత రిజిస్ట్రేషన్ కలిగిన విమానాలతో పాటు భారత ఎయిర్‌లైన్స్ యాజమాన్యం లీజుకు తీసుకున్న లేదా నడిపే విమానాలపై తమ గగనతల నిషేధం నవంబర్ 24 వరకు అమల్లో ఉంటుందని పాకిస్తాన్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ (పీఏఏ) వెల్లడించింది. తాజా పొడిగింపు సైనిక విమానాలకు కూడా వర్తిస్తుందని పీఏఏ శనివారం ‘ఎక్స్’లో స్పష్టం చేసింది.
ఈ మేరకు కొత్తగా నోటీస్ టు ఎయిర్‌మెన్ (నోటమ్) జారీ చేసినట్లు పీఏఏ అధికార ప్రతినిధి వెల్లడించినట్లు జియో న్యూస్ పేర్కొంది. జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో 2025 ఏప్రిల్‌లో జరిగిన టెర్రర్ దాడితో ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. దీంతో అదే ఏడాది ఏప్రిల్ 23న మొదటగా విధించిన ఈ నిషేధాన్ని ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వస్తున్నారు. పాక్ గగనతల పరిధిలోని కరాచీ, లాహోర్ ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ రీజియన్లు (ఎఫ్‌ఐఆర్) రెండింటికీ ఈ తాజా నోటమ్ వర్తిస్తుంది.
