అప్పుల ఊబిలో ఉన్న పాకిస్థాన్ పగటికలలు.. 2035 నాటికి చంద్రుడిపైకి వెళ్తామంటూ ప్రకటన!

అప్పుల ఊబిలో ఉన్న పాకిస్థాన్ పగటికలలు.. 2035 నాటికి చంద్రుడిపైకి వెళ్తామంటూ ప్రకటన!

ఒకపక్క దేశంలో విపరీతమైన ద్రవ్యోల్బణం, ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలు, దారుణమైన పేదరికం, లక్షల కోట్ల విదేశీ అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆర్థికంగా అతలాకుతలం అవుతున్న పాకిస్థాన్ ఇప్పుడు ఏకంగా జాబిల్లిపైకి వెళ్లేందుకు సాహసిస్తోంది. ప్రజలు తినేందుకు తిండి లేక, తాగేందుకు నీళ్లు లేక పూటగడవక అల్లాడుతుంటే.. పాక్ ప్రభుత్వం మాత్రం చైనా భుజానెక్కి అంతరిక్షంలో చరిత్ర సృష్టిస్తామంటూ పగటికలలు కంటోంది. 2035 నాటికి చంద్రుడిపై ల్యాండింగ్ చేస్తామంటూ ప్రకటించి అందరినీ విస్మర్యానికి గురిచేస్తోంది.

చైనా సహాయంతో అంతరిక్ష యాత్ర:
ఆర్థిక సంక్షోభం వెంటాడుతున్నప్పటికీ పాకిస్థాన్ తన అంతరిక్ష కలను సాకారం చేసుకునేందుకు డ్రాగన్ దేశంపై పూర్తిగా ఆధారపడుతోంది. ప్లానింగ్ మినిస్టర్ అహ్సన్ ఇక్బాల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. పాకిస్థాన్ తరఫున తొలి వ్యోమగామి నవంబర్ 25న చైనా అంతరిక్ష కేంద్రం నుంచి నింగికి దూసుకెళ్లనున్నారు. చైనా నిర్మించిన అంతరిక్ష నౌక ద్వారా.. చైనీస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, శిక్షణతో ఈ యాత్ర జరగనుంది. ఈ మిషన్‌లో ఎంపికైన వ్యోమగామి 'పేలోడ్ స్పెషలిస్ట్'‌గా వ్యవహరించి కక్ష్యలో శాస్త్రీయ ప్రయోగాలను నిర్వహించనున్నారు. అంతేకాక అంతరిక్షంలో ఉన్న సమయంలో ఆ వ్యోమగామి మాండరిన్(చైనీస్) భాషలో మాట్లాడాల్సి ఉండటం గమనార్హం. 1990 నుంచి పాకిస్థాన్ అంతరిక్ష కార్యక్రమాలకు చైనానే అండగా నిలుస్తూ వస్తోంది.

చంద్రుడిపై ల్యాండింగ్ - భారత్‌తో పోటీకి ప్లాన్:
చైనా చేపడుతున్న 'చాంగ్ అమ్-8' మిషన్‌కు పాకిస్థాన్ స్వదేశంలో తయారు చేసిన లూనార్ రోవర్‌ను అందించాలని ప్రణాళికలు రచిస్తోంది. 2028 నాటికి ఇది జరిగే అవకాశం ఉంది. ఈ చైనా-లీడ్ లూనార్ ఎక్స్‌ప్లోరేషన్ ద్వారా 2035 నాటికి చంద్రుడిపై పాకిస్థాన్ జెండా పాతాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత్ 2040 నాటికి మానవసహిత చంద్రుడి యాత్రను పూర్తి చేయాలని భావిస్తుండగా.. దానికంటే ఐదేళ్ల ముందే చంద్రుడిపై కాలుమోపాలని పాక్ ఉవ్విళ్లూరుతోంది. 

ఆర్థిక సంక్షోభంపై విమర్శలు:
పాకిస్థాన్ అంతరిక్ష ప్రణాళికలు ఒకవైపు ఆశ్చర్యపరుస్తున్నప్పటికీ.. మరోవైపు అక్కడి దయనీయ ఆర్థిక పరిస్థితులు తీవ్ర విమర్శలకు తావిస్తున్నాయి. ప్రస్తుతం పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణం 7.1 శాతంగా ఉండగా, జాతీయ పేదరికం ఏకంగా 28.9 శాతానికి చేరింది. దాదాపు 7 కోట్ల మంది ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారు. IMF సహాయంతో ఏదోలా నెట్టుకొస్తున్న ఆ దేశం ప్రజల కడుపు నింపే మార్గాలు వెతకాల్సింది పోయి.. పక్క దేశాల భుజాలపై ఎక్కి అంతరిక్ష కలలు కనడం పగటికలలేనని ఆర్థిక నిపుణులు ఎద్దేవా చేస్తున్నారు. తిండికి తిప్పలు పడుతున్న దేశం చంద్రుడిని ఏలుతామనడం హాస్యాస్పదంగా మారిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో.