ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో హింసాత్మక నిరసనలు మిన్నంటాయి. దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగి నగరమంతా అగ్నిప్రమాదాలు, విధ్వంసాలతో దద్దరిల్లిపోతోంది. అయితే ఈ భయానక వాతావరణంలోనూ ఓ జంట ప్రదర్శించిన కూల్ నెస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆర్క్ డి ట్రయంఫ్ సమీపంలోని ఒక వీధి కేఫ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కొద్ది దూరంలోనే చెత్త కుండీలు కాలిపోతూ మంటలు ఎగిసిపడుతున్నా.. ఆ జంట మాత్రం ఏమాత్రం చలించకుండా టేబుల్ వద్ద కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకుంటూ.. వైన్ తాగుతూ, సిగరెట్లు కాలుస్తూ కనిపించారు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "కొంచెం సివిల్ అన్రెస్ట్ తమ సాయంత్రం సరదాను పాడుచేయడానికి ఆ జంట ఒప్పుకోలేదు.. సిగరెట్లు అంత తేలిగ్గా ఆగిపోవు కదా" అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. మరో వీడియోలో ఒక మహిళ పొగలు కక్కుతున్న పారిస్ వీధుల్లో.. కాలిపోతున్న ఎలక్ట్రిక్ బైక్‌లు, నిరసనకారుల మధ్య నుంచి ఎలాంటి భయం లేకుండా జాగింగ్ చేస్తూ వెళ్లిన వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
A couple in France refuse to let a little civil unrest ruin a perfectly good evening ...the cigarettes aren't going to smoke themselves https://t.co/UObslhiu91
— RT (@RT_com) October 19, 2026
ఫ్రాన్స్‌లో అల్లర్లు ఎందుకు మొదలయ్యాయి?
2026 బడ్జెట్లో భాగంగా ప్రభుత్వం 4వేల కంటే ఎక్కువ ఉపాధ్యాయుల పోస్టులను తొలగించాలన్న నిర్ణయానికి వ్యతిరేకంగా మొదట విద్యార్థులు రోడ్డెక్కారు. తరగతి గదుల కిక్కిరిసిపోవడం, పాఠశాలల మౌలిక వసతులు క్షీణించడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ నిరసన క్రమంగా నిరుద్యోగం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, జీవన వ్యయంపై పెద్దఎత్తున ప్రజా ఆగ్రహానికి దారితీసింది. ముఖ్యంగా ఇరాన్-అమెరికా ఘర్షణల కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఏకంగా 36 శాతం పెరగడం, ద్రవ్యోల్బణం 3.1 శాతానికి చేరుకోవడం ప్రజల్లో ఆగ్రహాన్ని రగిలించింది.
కఠిన చర్యలు.. కర్ఫ్యూలు
ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరడంతో పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణలు జరిగాయి. దేశవ్యాప్తంగా సుమారు 2వేల 500 మందిని అరెస్ట్ చేయగా.. ఒక్క పారిస్‌లోనే 855 మంది అదుపులోకి తీసుకున్నారు. హింసాకాండను ఖండించిన అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్.. దీని వెనుక వామపక్ష ఉగ్రవాద వర్గాలు, క్రిమినల్ గ్యాంగ్‌లు ఉన్నాయని ఆరోపించారు. పారిస్‌లో రాత్రి 8 గంటల తర్వాత నిరసనలను నిషేధించడంతో పాటు, అనేక ప్రాంతాల్లో కర్ఫ్యూలు విధించారు.
అల్లర్ల వెనుక అమెరికా హస్తం ఉందా?
ఫ్రాన్స్‌లో చెలరేగిన ఈ అల్లర్లు, ఇంధన సంక్షోభం వెనుక నేరుగా అమెరికా హస్తం ఉందనే అధికారిక ఆధారాలు లేనప్పటికీ.. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు ఈ సంక్షోభాన్ని తీవ్రతరం చేశాయి. ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఎనర్జీ సప్లై లాజిస్టిక్స్‌ని దెబ్బతీశాయి. దీని ఫలితంగానే ఫ్రాన్స్‌లో మునుపెన్నడూ లేనివిధంగా ఇంధన ధరలు భారీగా పెరిగి, సామాన్యుల జీవితాలను అస్తవ్యస్తం చేశాయి. పరోక్షంగా ఈ అంతర్జాతీయ వాణిజ్య, ఇంధన సంక్షోభాలే ఫ్రాన్స్‌లో ఈ హింసాత్మక నిరసనలకు ఆజ్యం పోశాయని తెలుస్తోంది. మరోపక్క అమెరికా మాట విననందుకు అనేక యూరోపియన్ దేశాల్లో అశాంతికి సీఐఏ కుట్రలు పన్నిందనే వాదన కూడా గట్టిగానే వినిపిస్తోంది.
