Pawan Kalyan : 'నీ ప్రయాణం తిరుగులేనిది'.. పవన్ కళ్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానంపై అల్లు అరవింద్ ఎమోషనల్ నోట్!

Pawan Kalyan : 'నీ ప్రయాణం తిరుగులేనిది'.. పవన్ కళ్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానంపై అల్లు అరవింద్ ఎమోషనల్ నోట్!

తెలుగువారి గుండెల్లో 'పవర్ స్టార్'గా చెరిగిపోని ముద్ర వేసిన పవన్ కల్యాణ్ సినీ ప్రయాణం సరిగ్గా 30 ఏళ్లు (3 దశాబ్దాలు) పూర్తి చేసుకుంది. 1996 అక్టోబర్ 11న ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ 'గీతా ఆర్ట్స్' బ్యానర్‌పై నిర్మించిన 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' చిత్రంతో కల్యాణ్ బాబుగా పవన్ కల్యాణ్ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ కథానాయికగా నటించారు. తొలి చిత్రంతోనే తనలోని మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యంతో, సరికొత్త మేనరిజంతో ప్రేక్షకుల మనసు దోచుకున్నారు.

అల్లు అరవింద్ ఎమోషనల్ నోట్

ప్రస్తుతం పవన్ కల్యాణ్.. ఒక నటుడిగానే కాకుండా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ప్రజాక్షేత్రంలోనూ చెరగని ముద్ర వేస్తున్నారు. ఈ అరుదైన సందర్భాన్ని పురస్కరించుకుని, ఆ తొలి చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించిన లెజెండరీ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఒక అత్యంత భావోద్వేగపూరితమైన నోట్‌ను విడుదల చేశారు.

"డియర్ పవన్ కల్యాణ్, మనిద్దరం కలిసి చేసిన మొదటి సినిమా విడుదలై 30 ఏళ్లు దాటిందంటే నేను నమ్మలేకపోతున్నాను. ఇది వినగానే ఆశ్చర్యంతో పాటు తీవ్రమైన షాక్‌కు గురయ్యాను. ఇండస్ట్రీలో నీ ప్రయాణం ఎవరికీ సాధ్యంకాని రీతిలో తిరుగులేనిదిగా నిలిచింది. సమాజానికి నీవు చేస్తున్న సేవలు, నీ విజన్ నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. నీవు ఎంచుకునే ప్రతి బాటలోనూ మరిన్ని మహత్తర విజయాలు సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను" అని అల్లు అరవింద్ నోట్ పోస్ట్ చేశారు.

 

ట్రెండ్ సెట్టర్ గా..

తొలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న పవన్ కల్యాణ్, ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. గోకులంలో సీత, సుస్వాగతం చిత్రాలతో ఫ్యామిలీ ఆడియెన్స్‌కు చేరువై, తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి చిత్రాలతో యూత్‌లో ఒక సరికొత్త ఫాలోయింగ్‌ను, క్రేజ్‌ను సృష్టించారు. ఆ కాలంలో ఆయన ధరించిన దుస్తులు, మేనరిజమ్స్, హెయిర్ స్టైల్స్ ఒక యుఫోరియాను క్రియేట్ చేశాయి. ఆపై జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, వకీల్ సాబ్, ఓజీ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాసి తన పవర్ ఏంటో నిరూపించారు.

జనసేనానిగా.. డిప్యూటీ సీఎంగా..

కేవలం వెండితెరకే పరిమితం కాకుండా, ప్రజాసేవే పరమావధిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్ కల్యాణ్.. జనసేన పార్టీని స్థాపించి అనేక ఎత్తుపల్లాలను ఎదుర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు., ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఒక నటుడిగా, సామాజిక వేత్తగా, శక్తివంతమైన నాయకుడిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారి గుండెల్లో పవర్ స్టార్ స్థానం చెక్కుచెదరనిదిగా నిలిచారు..