- ఫామ్‌హౌస్‌కు నీటి మళ్లింపు అధికార దుర్వినియోగమే
- ‘వీ6 వెలుగు’ కథనంపై పీసీసీ చీఫ్ మహేశ్ స్పందన
- కేసీఆర్ తీరు చూస్తుంటే రాజులకాలం గుర్తొస్తున్నది
- అసైన్డ్ భూమిని దళితులకు పంచి తీరుతమని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని ఎర్రవల్లిలో ఉన్న కేసీఆర్ ఫామ్‌హౌస్ బావినుంచి రైతులకు నీళ్లిస్తామని పీసీసీ చీఫ్మహేశ్గౌడ్తెలిపారు. రూ. కోట్ల ప్రజాధనంతో కట్టిన కొండపోచమ్మ సాగర్ నుంచి కాల్వలు, పైపులైన్ల ద్వారా కేసీఆర్తన ఫామ్‌హౌస్‌కు నీటిని తరలించడం తీవ్ర అధికార దుర్వినియోగం కిందికి వస్తుందన్నారు. ఆయన వ్యవహారం చూస్తుంటే ఆనాటి రాజులు, బూర్జువాల కాలం గుర్తుకు వస్తున్నదని పేర్కొన్నారు. శనివారం ‘వీ6 వెలుగు’లో ‘కేసీఆర్ఫాంహౌస్కు మళ్లిన కొండపోచమ్మ’ హెడ్‌లైన్‌తో వచ్చిన కథనంపై మహేశ్‌గౌడ్ స్పందించారు.
కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లోకి నీటిని తరలించేందుకు ఏకంగా 58 ఎకరాల్లో ఒక చెరువు, 3 ఎకరాల్లో బావిని తవ్వించడం, రూ.50 కోట్ల డ్రిప్‌ఇరిగేషన్ నిధులను సొంతానికి వాడుకోవడం క్షమించరాని నేరమన్నారు. ఆయన తీరు వల్ల చుట్టుపక్కల రైతులకు సాగునీరు అందని పరిస్థితి ఉందని మహేశ్‌గౌడ్ చెప్పారు. కేసీఆర్, కేటీఆర్ చేసిన తప్పుల కారణంగా తెలంగాణ ప్రజలు అరిగోస పడ్తున్నారని, ఎలాంటి ప్రణాళిక లేకుండా లోపభూయిష్టంగా కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. కేసీఆర్ అక్రమంగా తరలిస్తున్న నీటిని అడ్డుకోవడంతోపాటు ఫామ్‌హౌస్‌లో ఉన్న అసైన్డ్ భూమిని స్వాధీనం చేసుకొని దళితులకు, పేదలకు పంచుతామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ మిత్రపక్షాల మద్దతు కూడగడతం
రాష్ట్రంలో త్వరలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక శక్తుల మద్దతు కోరుతామని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు. గాంధీ భవన్లో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కాంగ్రెస్ మిత్రపక్షాల మద్దతును కూడగడుతామని చెప్పారు. వీలైనంత త్వరలోనే నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని, అయితే దసరాలోపు ఆ అవకాశం లేదన్నారు. దేశంలో విపత్కర పరిస్థితి ఏర్పడినప్పుడల్లా.. బీజేపీ విదేశీ అంశాన్ని తెరపైకి తెస్తుందని, ఇది దుర్మార్గపు చర్య అని విమర్శించారు. చైనా భారత భూభాగంలోకి చొచ్చుకొని వచ్చినా బీజేపీ మాట్లాడడం లేదన్నారు. ‘సర్’ పేరుతో ఒక్క తెలంగాణలోనే 27 శాతం ఓట్లను తొలగించారని, ఇందులో మైనార్టీలు, ఎస్సీలు, ఎస్టీలు, బడుగు, బలహీనవర్గాల వారే అధికమని చెప్పారు. రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ బీజేపీ నీరుగారుస్తున్నదని మండిపడ్డారు. వీటన్నింటికి వ్యతిరేకంగానే త్వరలోనే హైదరాబాద్ లో భారీ సభను నిర్వహిస్తామని వెల్లడించారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వండి టీజేఎస్‌ను కోరిన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు తెలపాలని టీజేఎస్ చీఫ్, ఎమ్మెల్సీ కోదండరాంను పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. నాంపల్లిలోని తెలంగాణ జన సమితి (టీజేఎస్) కార్యాలయంలో ఆ పార్టీ నేతలతో పీసీసీ చీఫ్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కీ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడారు. రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎంతో కీలకమైనవని, ఈ ఎన్నికల్లో టీజేఎస్ మద్దతు కాంగ్రెస్ పార్టీకి అవసరమని తెలిపారు. దీనిపై ప్రొఫెసర్ కోదండరాం స్పందిస్తూ.. రాష్ట్రంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్య, ప్రభుత్వ పాలనలో టీజేఎస్‌కు భాగస్వామ్యం కల్పించడం, ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు తదితర అంశాలను పీసీసీ చీఫ్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు విషయంపై పార్టీ రాష్ట్ర కమిటీల్లో చర్చించి, త్వరలో నిర్ణయాన్ని ప్రకటిస్తామని కోదండరాం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ నేతలు విశ్వేశ్వర్ రావు, ధర్మార్జున్, బైరి రమేశ్, నిజ్జన రమేష్‌తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
