ఫిలిప్పీన్స్‎లో సినీ రేంజ్‎లో విమాన ప్రమాదం.. గాల్లోనే ఢీకొన్న రెండు విమానాలు.. నలుగురు పైలట్లు మృతి

ఫిలిప్పీన్స్‎లో సినీ రేంజ్‎లో విమాన ప్రమాదం.. గాల్లోనే ఢీకొన్న రెండు విమానాలు.. నలుగురు పైలట్లు మృతి

మనీలా: ఫిలిప్పీన్స్‎లో సినీ రేంజ్‎లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఫిలిప్పీన్స్ ఎయిర్ ఫోర్స్‎కు చెందిన రెండు సైనిక విమానాలు శిక్షణా విన్యాసాల సమయంలో గాల్లోనే ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు పైలట్లు మరణించారని అధికారులు తెలిపారు. దేశంలోని బటంగాస్ ప్రావిన్స్‌లోని ఫెర్నాండో ఎయిర్ బేస్‌లో శుక్రవారం (అక్టోబర్ 23) ఈ ప్రమాదం జరిగింది.

గాల్లో విమానాలు ఢీకొన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి. సైనిక విన్యాసాలు చూడటానికి వచ్చిన ప్రజలు ఈ ప్రమాదంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో రెండు SF-260 సైనిక విమానాలు ప్రమాదానికి గురయ్యాయని.. అవి రెండు ఎయిర్ బేస్ పరిధిలోనే కూలిపోయాయని ఫిలిప్పీన్స్ ఎయిర్ ఫోర్స్ వెల్లడించింది. 

ఈ ఘటనలో నలుగురు పైలట్లు దుర్మరణం చెందగా.. సామాన్య పౌరులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపింది. ఈ ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేపట్టారని.. విచారణ తర్వాత ప్రమాదానికి గల స్పష్టమైన కారణం ఏంటన్నది తెలుస్తోందని పేర్కొంది. ముందుజాగ్రత్త భద్రతా చర్యగా అన్ని SF-260 విమానాలను తాత్కాలికంగా నిలిపివేశారు.

ఈ ప్రమాదంలో వీర మరణం పొందిన వైమానిక దళ సిబ్బంది సేవ, త్యాగాన్ని పీఏఎఫ్ గౌరవిస్తుందని సంఘీభావం తెలిపింది. మృతుల కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందిస్తామని.. పైలట్ల కుటుంబాల అభ్యర్థన మేరకు ఈ క్లిష్ట సమయంలో వారి గోప్యతను గౌరవించాలని ప్రజలకు వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొంది.