
ఎండాకాలంలో దొరికే సీమచింతకాయలంటే చాలామంది ఇష్టంగా తింటారు. వగరు, తీపి కలిసి రుచిగా ఉంటాయి. వీటిని గుబ్బకాయలు, పులి చింతకాయలని కూడా పిలుస్తారు. వీటిని తినడం వల్ల చాలా ఉపయోగాలున్నాయి. పులి చింతకాయల్లో ప్రొటీన్స్ , ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అందువల్ల వీటిని తిన్నప్పుడు పొట్ట నిండినట్లుగా అనిపిస్తుంది. వెంటనే ఆకలికాదు. అలాగే వీటిలో ఐరన్, క్యాల్షియం ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల గర్భిణీలకు చాలా మంచిది. మలబద్దకం తగ్గిస్తాయి. వణుకు, నరాల బలహీనత లాంటివి రాకుండా కాపాడుతాయి. ఈ కాయల్లో కాపర్ కూడా ఉంటుంది. కనుక.. తినడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
సీమచింతకాయల్లో ఉండే పొటాషియం శరీరంలోని పీహెచ్ లెవల్స్ పెరగకుండా, తగ్గకుండా చేస్తుంది. గుండె కొట్టు కోవడం, మజిల్ ఫంక్షన్ సరిగా జరగడానికి ఈ కాయలు ఉపయోగపడతాయి. ఈ కాయల్లో ఫ్యాట్ ఉండదు. బీపీ, షుగర్ కంట్రోల్లో ఉంచుతాయి. తినడం వల్ల బరువు పెరగరు. ఆహార నిపుణులు రోజూ కప్పులో నాలుగోవంతు తీసుకోవడం మంచిదని చెప్తున్నారు. అలా కుదరకపోయినా వేసవిలో దొరికే వీటిని తప్పకుండా తినడంవల్ల శరీరం సమతుల్యంగా ఉంటుంది.