సమ్మర్ కదా..ఏసీ కొనాలనుకుంటున్నారా?..ఈ 10 పాయింట్లు తప్పనిసరిగా చెక్ చేయండి

 సమ్మర్ కదా..ఏసీ కొనాలనుకుంటున్నారా?..ఈ 10 పాయింట్లు తప్పనిసరిగా చెక్ చేయండి

ఎండాకాలం మండిపోతుంది.ఎండవేడిమి నుంచి ఉపశమనం కోసం చాలామంది ఏసీలు కొనేందుకు ప్లాన్ చేస్తుంటారు. అయితే ఏసీ అనేది ఒకేసారి కొని వదిలేసే వస్తువు కాదు, ఇది ఒక దీర్ఘకాలిక పెట్టుబడి. సరైన ఏసీని ఎంచుకోకపోతే కూలింగ్ సరిగ్గా రాకపోవడమే కాకుండా, కరెంట్ బిల్లులు తడిసి మోపెడవుతాయి. అందుకే ఏసీ కొనేముందు ఈ 10 విషయాలు తప్పనిసరిగా చెక్ చేసుకుంటే మంచిది. 

గది సైజును బట్టి ..

మీ గది వైశాల్యాన్ని బట్టి ఏసీ సామర్థ్యాన్ని ఎంచుకోవాలి. 100 చదరపు అడుగుల లోపు గదికి - 1 Ton సామర్థ్యం సరిపోతుంది. 100 నుంచి 150 చదరపు అడుగుల గదికి - 1.5 Ton,  150 చదరపు అడుగుల కంటే ఎక్కువ ఉంటే - 2 Ton ఏసీ తీసుకోవడం ఉత్తమం.

స్టార్ రేటింగ్..

విద్యుత్ ఆదా చేయాలనుకుంటే స్టార్ రేటింగ్ చాలా ముఖ్యం. 5-స్టార్ ఏసీలు తక్కువ విద్యుత్తును వినియోగిస్తాయి. 3-స్టార్ ఏసీతో పోలిస్తే 5-స్టార్ ఏసీ ధర కొంచెం ఎక్కువైనా, లాంగ్ రన్‌లో కరెంట్ బిల్లుల ద్వారా ఆ డబ్బు ఆదా అవుతుంది.

ఇన్వర్టర్ ఏసీ vs నాన్-ఇన్వర్టర్..

ఇన్వర్టర్ ఏసీలు గది ఉష్ణోగ్రతను బట్టి కంప్రెసర్ వేగాన్ని అడ్జస్ట్ చేస్తాయి. దీనివల్ల కూలింగ్ స్థిరంగా ఉండటమే కాకుండా కరెంట్ కూడా ఆదా అవుతుంది. ఎక్కువ సమయం ఏసీ వాడేవారికి ఇన్వర్టర్ ఏసీనే బెస్ట్.

 కాపర్ కాయిల్..

ఏసీలో అల్యూమినియం కంటే కాపర్ కాయిల్ ఉన్న వాటినే ఎంచుకోండి. కాపర్ కాయిల్స్ త్వరగా చల్లబడతాయి. వీటి మెయింటెనెన్స్ సులభం.ఇవి ఎక్కువ కాలం మన్నుతాయి.

ఎయిర్ ఫిల్టర్లు..

ప్రస్తుత కాలుష్య పరిస్థితుల్లో ఏసీ కేవలం చల్లదనాన్ని ఇస్తే సరిపోదు. అందులో PM 2.5 ఫిల్టర్లు, యాంటీ బాక్టీరియల్ ఫిల్టర్లు ఉన్నాయో లేదో చూడండి. ఇవి గాలిని శుద్ధి చేసి ఆరోగ్యకరమైన గాలిని అందిస్తాయి.

నాయిస్ లెవల్..

నిద్రపోయే సమయంలో ఏసీ సౌండ్ ఇబ్బంది కలిగించకూడదు. కాబట్టి, కొనేముందు ఏసీ ఇండోర్ యూనిట్ శబ్దం ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. తక్కువ డెసిబుల్స్ (dB) ఉన్న ఏసీని ఎంచుకుంటే మంచిది. 

 మెయింటెనెన్స్ & సర్వీస్..

మీరు కొనే బ్రాండ్‌కు మీ ఏరియాలో మంచి సర్వీస్ సెంటర్ ఉందో లేదో ముందే తెలుసుకోవాలి. ఏసీకి రెగ్యులర్ సర్వీసింగ్ అవసరం, కాబట్టి సర్వీస్ నెట్‌వర్క్ బాగున్న బ్రాండ్‌కే ప్రాధాన్యత ఇవ్వాలి. 

వారెంటీ ..

సాధారణంగా ఏసీలపై 1 సంవత్సరం వారెంటీ ఉంటుంది. కానీ కంప్రెసర్ , పీసీబీ (PCB) మీద కనీసం 5 నుంచి 10 ఏళ్ల వారెంటీ ఇచ్చే బ్రాండ్లను ఎంచుకోవడం సురక్షితం.

 అదనపు ఫీచర్లు..

వైఫై కనెక్టివిటీ, టర్బో కూలింగ్, డీహ్యూమిడిఫికేషన్ (తేమను తగ్గించడం), స్లీప్ మోడ్ వంటి స్మార్ట్ ఫీచర్లు మీ ఏసీ వాడకాన్ని మరింత సౌకర్యవంతంగా మారుస్తాయి.

 బడ్జెట్..

చివరగా మీ బడ్జెట్. ఆన్‌లైన్‌లో ,ఆఫ్‌లైన్ స్టోర్లలో ధరలను పోల్చి చూడండి. ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్లు ,నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను వాడుకోవడం ద్వారా నచ్చిన ఏసీని తక్కువ ధరకే పొందవచ్చు.

ఏసీ కొనేటప్పుడు తొందరపడకుండా ఈ 10 పాయింట్లను దృష్టిలో ఉంచుకుంటే, మీరు సరైన నిర్ణయం తీసుకోగలరు. ఈ వేసవిని చల్లగా, హాయిగా గడపొచ్చు.