మీ పాలనలో తమిళనాడు శిఖరాలకు చేరాలి.. విజయ్ కి ప్రధాని మోదీ, సీఎం రేవంత్ విషెస్

మీ పాలనలో తమిళనాడు శిఖరాలకు చేరాలి.. విజయ్ కి ప్రధాని మోదీ, సీఎం రేవంత్ విషెస్

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. టీవీకే చీఫ్ విజయ్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ చారిత్రాత్మక ఘట్టంపై దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ఆయన పరిపాలన అద్భుతంగా సాగాలని ఆకాంక్షించిన ప్రధాని.. తమిళనాడు ప్రజల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని భరోసా ఇచ్చారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం విజయ్‌కు అభినందనలు తెలియజేశారు. ఈ ప్రజా తీర్పు సమాజంలో పెరుగుతున్న యువ గళాన్ని ప్రతిబింబిస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలను ఎప్పటికీ విస్మరించబోమని, తమిళనాడు ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తూనే ఉంటుందని రాహుల్ స్పష్టం చేశారు.

 తెలంగాణ  సీఎం రేవంత్ రెడ్డి కూడా విజయ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు సమన్యాయం, సంక్షేమంతో కూడిన పాలనను అందిస్తూ.. విజయ్ నేతృత్వంలో తమిళనాడు రాష్ట్రం అభివృద్ధిలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని తాను బలంగా నమ్ముతున్నట్లు రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.