ఒట్టావా: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 11, 12 తేదీల్లో కెనడాలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని ఒట్టావాలోని భారత హైకమిషన్ అధికారికంగా ధ్రువీకరించింది. గురువారం ఉదయం కాల్గరీలోని ఓ రెస్టారెంట్లో సందర్శకులతో మాట్లాడిన సందర్భంగా కెనడా ప్రధాని మార్క్ కార్నీ సైతం మోదీ పర్యటనను ధ్రువీకరించారు.
ప్రధాని మోదీతో తాను ఇప్పటికే మాట్లాడానని, ఈ పర్యటనలో భాగంగా ఆయన టొరంటో, ఒట్టావా నగరాలను సందర్శిస్తారని కార్నీ పేర్కొన్నారు. పర్యటన పరిధిని మరింత విస్తరించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ ఉన్నత స్థాయి పర్యటన ఇరు దేశాల ప్రధానుల మధ్య ద్వైపాక్షిక చర్చలకు, భారత్ – -కెనడా సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి కీలక వేదికగా నిలవనుందని భావిస్తున్నారు.
