- చెన్నై ‘ఛాత్రోన్ కీ గూంజ్’ సభలో రాహుల్ గాంధీ
- ప్రశ్నించడమే ప్రజాస్వామ్యానికి పునాది
- తమిళ భాష, సంస్కృతి, చరిత్రపై కేంద్రం దాడి
చెన్నై: ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తున్నారని, అసమ్మతిని అణచివేస్తున్నారని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. తమిళనాడు భాష, సంస్కృతి, విద్యా అవకాశాలపై దాడి చేస్తున్నారని అన్నారు.
శనివారం చెన్నైలోని ఐలాండ్ గ్రౌండ్స్‌లో తమిళనాడు కాంగ్రెస్ కమిటీ నిర్వహించిన ‘ఛాత్రోన్ కీ గూంజ్ (విద్యార్థుల గొంతుక)’ కార్యక్రమంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. సామాజిక సంస్కర్త పెరియార్ ఈవీ రామసామి, తమిళ కవి తిరువల్లువర్‌ను స్మరించుకున్నారు. విద్య, సామాజిక పురోగతి, జిజ్ఞాస, ప్రశ్నించే తత్వమే అత్యంత కీలకమని పేర్కొన్నారు.
స్వతంత్ర ఆలోచనలపై పెరియార్ మాటలను గుర్తుచేస్తూ.. ఎవరో ఏదో చెప్పారు కదా అని విద్యార్థులు గుడ్డిగా దేనినీ అనుసరించకూడదని, ప్రతి విషయాన్ని విశ్లేషించి ప్రశ్నించాలన్నారు. అలాగే నేర్చుకోవడాన్ని ఇసుక నేలలో బావి త్రవ్వడంతో పోల్చిన తిరువల్లువర్ తిరుక్కురళ్‌ను ఆయన ఉదహరించారు. పెరియార్ ఉండి ఉంటే.. ప్రధాని మోదీతో ఏమని మాట్లాడి ఉండేవారని ఒక విద్యార్థిని రాహుల్ ప్రశ్నించగా.. పితృస్వామ్యం, మత విశ్వాసాలు, మహిళలను బానిసలుగా చేయడం బలమైన విధానాలు కాదని, ప్రపంచంలో మానవత్వమే అత్యంత బలమైన సూత్రం అని చెప్పేవారని ఆ విద్యార్థి అన్నారు. నీట్ పరీక్షలో అర్హత సాధించలేక ఆత్మహత్య చేసుకున్న ఎస్.అనిత సోదరుడు ఎస్.మణిరత్నాన్ని కూడా రాహుల్ వేదికపైకి పిలిచి మాట్లాడారు.
తమిళ అస్తిత్వంపై కేంద్రం దాడి
తమిళనాడు భాష, సంస్కృతి, చరిత్ర, సంప్రదాయాలపై మోదీ ప్రభుత్వం దాడి చేస్తోందని రాహుల్ ఆరోపించారు. తమిళ భాష, చరిత్ర, సంస్కృతిపై ఎట్టిపరిస్థితుల్లోనూ దాడి జరగనివ్వబోమని తేల్చిచెప్పారు. జాతీయ విద్యా విధానానికి సంబంధించి తమిళనాడుకు రావాల్సిన రూ. 3,300 కోట్లను కేంద్రం నిలిపివేసిందని ఆరోపించారు.
నీట్ కారణంగా ఎంబీబీఎస్ సీట్లు సాధిస్తున్న తమిళ మీడియం విద్యార్థుల వాటా 87% పడిపోయిందన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీల్లో 70 శాతం వరకు వైస్ చాన్స్‌లర్లు లేరని.. వాటికి ఆర్ఎస్ఎస్ అనుబంధ వ్యక్తులు నడిపేలా చూడాలని గర్నర్ ఆర్ఎన్ రవి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. డీలిమిటేషన్‌తో తమిళనాడుకు పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం తగ్గుతుందని, ఇది రాష్ట్రాన్ని శిక్షించడమేనని చెప్పారు.
ఢిల్లీలో జరుగుతున్న నిరసనలను ప్రస్తావిస్తూ.. నగరాన్ని దిగ్బంధించారని, ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారని, విద్యార్థులను పోలీసులు కొట్టారని అన్నారు. నిరసనకారులపై దాడి చేయడానికి బీజేపీ తన మద్దతుదారులను ఉసిగొల్పిందని ఆరోపించారు. “ఎలాంటి ఆందోళన చెందకండి, మీరు నమ్మే ప్రతి దాని కోసం నిలబడండి, అధికారంలో ఉన్నవారిని ప్రశ్నలు అడగడం ఎప్పటికీ ఆపకండి” అని ఆయన విద్యార్థులకు సూచించారు. కాగా, శనివారం ఉదయం చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్‌ను ఆయన నివాసంలో రాహుల్ కలిశారు. విజయ్‌తో కలిసి లంచ్ చేశారు.
చెన్నైలో రాహుల్, విజయ్ భేటీ
చెన్నై: లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, తమిళనాడు సీఎం విజయ్‌ల మధ్య శనివారం ఆసక్తికర భేటీ జరిగింది. చెన్నైలో జరిగిన ఈ సమావేశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కేవలం రాజకీయ చర్చలే కాకుండా, ఇద్దరు నేతలు కలిసి కాఫీ తాగుతూ సరదాగా గడపడం అందరినీ ఆకర్షించింది. చెన్నై శివారు నీలంకరైలోని తన నివాసానికి వచ్చిన రాహుల్ గాంధీకి విజయ్ సాదర స్వాగతం పలికారు.
సుమారు గంటపాటు సాగిన ఈ భేటీలో ఇద్దరు నేతలు రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. అయితే, సమావేశం అనంతర దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అధికారిక సమావేశం ముగిసిన తర్వాత ఇద్దరూ సమీపంలోని ఒక కేఫ్‌కు వెళ్లారు. అక్కడ వారు కప్పుచీనో,
తిరమిసు, కుకీలను ఆర్డర్ చేసి ఆస్వాదించారు. ఒకవైపు, రాజకీయ విషయాలు మాట్లాడుకుంటూనే, మరోవైపు సాధారణ వ్యక్తులలా కేఫ్‌లో గడిపారు.
