- 2047నాటికి వికసిత్ భారత్- ధ్యేయంగా ఐదు భారీ లక్ష్యాలు ప్రకటన
- దేశ, అంతర్జాతీయ సంక్షోభాలను విజయవంతంగా ఎదుర్కొన్నాం
- 25 ఏండ్ల అధికార ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో బహిరంగ సభ
న్యూఢిల్లీ: దేశ అభివృద్ధి, భవిష్యత్తు లక్ష్యాల సాధనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు సరికొత్త స్లోగన్ ఇచ్చారు. దేశీయంగా, అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ‘వియ్ విల్ డూ ఇట్(మనం చేయగలం)’ అనే నినాదం చేశారు. మోదీ ముఖ్యమంత్రిగా, ప్రధానిగా 25 ఏండ్ల అధికార ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో వికసిత్ భారత్ సంకల్ప్ సభ నిర్వహించారు.
ఈ వేడుకలో పాల్గొన్న వేలాదిమంది ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని దేశ భవిష్యత్తు కోసం ఐదు అతిపెద్ద లక్ష్యాలను ప్రకటించారు. ఆయన లక్ష్యాన్ని ప్రకటించిన ప్రతిసారీ ప్రజలు ‘వియ్ విల్ డూ ఇట్’ అంటూ గట్టిగా అరిచి మోదీకి మద్దతిచ్చారు. 2001 అక్టోబర్ 7వ తేదీన మోదీ తొలిసారిగా గుజరాత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సుదీర్ఘ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజలందరూ కొత్తగా సంకల్పం తీసుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు.
సంక్షోభాలను విజయవంతంగా ఎదుర్కొన్నాం
గత కొద్దికాలంగా కరోనా మహమ్మారి.. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, మిడిల్ ఈస్ట్ సంక్షోభాల వల్ల ప్రపంచవ్యాప్తంగా సప్లయ్ చైన్ వ్యవస్థలు దెబ్బతిన్నాయని మోదీ తెలిపారు. అయినప్పటికీ సమర్థవంతమైన నాయకత్వం వల్ల భారత్ ఈ సంక్షోభాలను విజయవంతంగా ఎదుర్కొందని చెప్పారు. గతంలో దేశంలో పాలసీ పరమైన ఇబ్బందులు ఉండేవని, కానీ నేడు దేశం సంస్కరణల బాటలో వేగంగా దూసుకుపోతోందన్నారు.
దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం తెచ్చిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) స్కీమ్ వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని వివరించారు. ఎగుమతులు కూడా భారీగా పెరుగుతున్నాయని చెప్పారు. గతేడాది ఆగస్టుతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టు నాటికి దేశ ట్రేడ్ డిఫిసిట్ సుమారు 78,000 కోట్ల రూపాయలకు తగ్గిందని వెల్లడించారు. దేశ శక్తిని చాటేలా అందరం కలిసి పెద్ద లక్ష్యాలను సాధించడానికి శ్రమిద్దామని ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు.
ఐదు అతిపెద్ద లక్ష్యాలివే..
2047 నాటికి భారతదేశాన్ని పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన ధ్యేయమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ప్రపంచంలోని టాప్ 3 ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా నిలవడం, పూర్తిగా స్వయం సమృద్ధి సాధించడం (ఆత్మనిర్భర్ భారత్), దేశాన్ని గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా మార్చడం, ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం, అంతరిక్ష రంగంలో మరిన్ని అద్భుతాలు సాధించడం వంటి ఐదు పెద్ద లక్ష్యాలను మోదీ తన జాబితాలో చేర్చారు.
ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ముందుందని చెప్పారు. 2014లో 10వ స్థానంలో ఉన్న మన దేశం ఇప్పుడు 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని గుర్తుచేశారు.
