వెలుగు స్పెషల్: ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. ఓటు విలువను కాపాడేదెట్ల?

వెలుగు స్పెషల్: ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. ఓటు విలువను కాపాడేదెట్ల?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఓటు రక్షణ ప్రొటెస్టుల మధ్య ఒక మీటింగ్‌‌‌‌‌‌‌‌లో ‘ఇండియా మదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ డెమోక్రసీ’ అని హిందీలో చెప్పాడు. 1951–52 ఎన్నికలకు ముందు ఇండియాలో ఓటువేసి ప్రభుత్వాన్ని ఎన్నుకునే పద్ధతి ఏ కాలంలో,  ఏ పాలకుని కాలంలో ఉంది అనేది చాలా కీలకమైన ప్రశ్న.  ప్రాచీన భారతదేశాన్ని హరప్పా నగర నిర్మాణం నుంచి హర్షవర్ధనుని పరిపాలన వరకు నేను కొంత సీరియస్‌‌‌‌‌‌‌‌ అధ్యయనమే చేశాను. ఆ తరువాత దేశంలో వందల సంఖ్యలో చిన్నచిన్న రాజరికాలు ఉనికిలోకి వచ్చాయి. ఆ తరువాత ముస్లిం రాజులు, బ్రిటిష్‌‌‌‌‌‌‌‌ పాలకులు వచ్చేవరకు పరిపాలించిన సంగతి మనందరికీ తెలుసు. స్వాతంత్ర్యం  వచ్చేనాటికి 500కు పైగా చిన్నరాజుల సంస్థానాలు ఉన్నాయి. తెలంగాణలో ముస్లిం నిజాం పాలన, ఆంధ్రలో తమిళనాడుతో కలిపి బ్రిటిష్ పాలన ఉండేది. 

ఈ మొత్తం కాలంలో  ఏ రాజును  లేదా  పాలకుడిని ప్రజలు ఓట్లువేసి ఎన్నుకున్నారో ప్రధానమంత్రి చెప్పగలరా?

మొట్టమొదట  నామమాత్రపు  రాజకుటుంబాలకు, ధనవంతులకు, చదువుకున్నవారికి ఓటు అనే పదం తెలిసింది1937లోనే.  కానీ ఆ ఓటుహక్కును ఉపయోగించుకునే హక్కు శ్రమజీవులకు 1937లో కూడా లేదు. మోదీ కుటుంబాలకు  ఓటు హక్కు ఏ ప్రాచీన కాలంలో ఉందో ఆయన చెప్పగలరా?  ఆయన కుటుంబ వేర్లు కూడా వందల ఏండ్లు ఈ దేశంలో ఉన్నాయి కదా! ఆయన నమ్మే ఏ సంస్కృత గ్రంథంలోనైనా  ప్రజలు ఓటు ద్వారా ఒక రాజునో, పాలకుడినో  ఎన్నుకున్నట్టు రాసి ఉందా?

 కేవలం బుద్ధిస్టు సంఘంలో..

కేవలం బుద్ధిస్టు సంఘ మీటింగుల్లో మెజారిటీ, మైనారిటీ  చెయ్యిచూపు ఓటుతో నిర్ణయాలు జరిగేవి. ఈ పద్ధతి మన పార్లమెంటు, అసెంబ్లీలో కూడా చూస్తాం. కానీ ఏ  హిందూ రాజు కాలంలో కనీసం ఒక్క ప్రజాసభ జరిపి రాజు పాలనపై  ఓటు ద్వారా అభిప్రాయ సేకరణ జరిగిన ఆధారాలు లేవు. భారతదేశంలో మగధ సామ్రాజ్య నిర్మాణం దగ్గరి నుంచి ముస్లిం రాజులు దేశాన్ని తమ అధీనంలోకి తీసుకునేవరకు ఏ ఒక్క రాజు ప్రజాభిప్రాయాన్ని గౌరవించి పాలించిన దాఖలాలు లేవు. కానీ, అశోకుడు మాత్రం బుద్ధిస్టుగా మారాక ప్రజాభిప్రాయం సేకరించి వాళ్ల అవసరాలు తీర్చే నిర్ణయాలు తీసుకునేవాడని కొన్ని శాసనాల్లో ఉంది. కొంతమేరకు సంక్షేమ పాలన ఆయన ఒక్కకాలంలోనే  కనిపిస్తుంది. ఆ రోజుల్లో  కూడా ప్రజల కోసం విద్యారంగం అభివృద్ధి చేయలేదు. బుద్ధ విహారాలు, విదేశాల్లో బుద్ధిస్టు  ప్రచారం కోసం వనరులు వాడటం జరిగింది.

హిందూ రాజులు

ఏ హిందూరాజు కూడా  ప్రజాభిప్రాయాలను  గౌరవించి సంక్షేమ పనులు చేసిన దాఖలాలు ఎక్కడా లేవు.  చిన్న ప్రాంతీయ రాజులు కూడా చాలా ప్రజల శ్రమతో  గుడులు,  కోటలు కట్టించారు. కానీ, ప్రజలకు తమ సమకాలీన విద్య నేర్పాలనే ఉద్దేశంతో పాఠశాలలు పెట్టిన దాఖలాలు లేవు.  రాజులందరూ తమను తాము క్షత్రియులుగా ప్రకటించుకోవడం, బ్రాహ్మణ పూజారివర్గంతో పొగిడించుకోవడం, కుల వ్యవస్థను పటిష్టంగా అమలుచేయడం తప్ప రాజ్యం గురుకులాన్నో,  బడులనో  నడిపిన దాఖలాలు లేవు. 

ఈ స్థితిలో ‘ఇండియా మదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్ డెమోక్రసీ’ అని ఆయన పదేపదే చెబితే.. ఆయన డెమోక్రసీ అనే పదాన్ని రాజరికానికి బదులుగా వాడుతున్నాడని సులభంగా అర్థమౌతుంది కదా!  మనం 1951–52లో  మొదటిసారి రాజ్యాంగబద్ధ ఎన్నికలు జరిపేనాటికి అమెరికా దాదాపు 125 సంవత్సరాల రాజ్యంగబద్ధ  డెమోక్రసీని  ఓటుద్వారా అమలుచేసింది. అది కూడా చాలాకాలం స్త్రీలకు, బానిసలకు ఓటు హక్కు ఇవ్వకుండా ఉండింది.  

అమెరికా డెమోక్రసీనే అసలు పూర్తిస్థాయి డెమోక్రసీగా ఆ నాటికి ప్రపంచం ఒప్పుకోలేదు. రాసిన రాజ్యాంగం లేకుండా డెమోక్రసీని 17వ శతాబ్దం నుంచే అమలుచేసిన  బ్రిటన్‌‌‌‌‌‌‌‌.. స్త్రీలకు, బానిసలకు ఓటుహక్కు ఇవ్వలేదు.  మొనార్కీని రద్దు చేయలేదు. ఈనాటికి కూడా దాని డెమోక్రటిక్‌‌‌‌‌‌‌‌ సిస్టమ్‌‌‌‌‌‌‌‌ మొనార్కీ అధీనంలో ఉంది. జపాన్‌‌‌‌‌‌‌‌లో అదే స్థితి.  ఇండియాను  రాచరికం లేని  డెమోక్రసీగా ఆనాటి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌  స్త్రీ– పురుష  కులాతీత ఓటుహక్కును  అమలుచేసింది.  ఇందులో అంబేద్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాత్ర చాలా ఉంది. ఇదంతా ప్రపంచానికి తెలవనట్టు, చరిత్ర పుస్తకాలే  దేశంలో,  ప్రపంచంలో  లేవన్నట్టు ఇంత పెద్ద దేశానికి ప్రధాన మంత్రి ‘ ఈ దేశమే మదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్ డెమోక్రసీ’ అంటే  నవ్వులపాలుకామా?  ఒక దేశ  ప్రధానమంత్రి ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి. 

ముస్లిం రాజుల కాలం

ముస్లిం రాజుల కాలంలో డెమోక్రసీనే కాదు, ప్రజాభిప్రాయ సేకరణ అనేది వినడానికి కూడా అవకాశం లేని మత రాజరికాలు నడిచాయి.  బ్రిటిష్‌‌‌‌‌‌‌‌వాళ్లు దోపిడీ చేయడానికివచ్చి అయినా ఒక భాషను, కొత్తగా హక్కుల చర్చను భారతీయుల  చెవుల్లో  పడేశారు. క్రమక్రమంగా  బ్రిటిష్‌‌‌‌‌‌‌‌  వ్యతిరేక పోరాటాల ద్వారా 1937లో  ఒక రూపంలో  ఎన్నికలు జరిగాయి. ఈ చరిత్ర అంతా ఈనాటి జెన్‌‌‌‌‌‌‌‌ జీని అడిగినా,  కాక్రోచ్‌‌‌‌‌‌‌‌  జనతా పార్టీ  యువతీ,  యువకులను అడిగినా  ముసలోళ్లకంటే  మంచిగా చెబుతారు. 

అటువంటి కొత్త యువ చైతన్య గాలి వీస్తున్న దేశంలో 25 ఏండ్ల  పరిపాలను అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు  డెమోక్రసీ ఇక్కడే పుట్టింది అంటే అర్థమేంటి?  ఈ దేశ విద్యారంగాన్ని  ఇటువంటి  అవగాహనతో నింపితే విద్యార్థులు ఏ చరిత్ర  పుస్తకాలు చదువుకుని వేదకాలంలో లేదా రాజుల కాలంలో ప్రజాస్వామ్యాన్ని చూడాలి.  రుగ్వేదం రాసినప్పటి నుంచి 1950లో  మనం రాజ్యాంగం అమలులోకి తెచ్చుకునేదాకా  ఉన్నదంతా ప్రజాస్వామ్యమే అయితే రాజ్యాంగం రాజరికం తెచ్చిందని చెప్పదలుచుకున్నారా! అందువల్ల ఈ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి మళ్లీ పెట్టుబడిదారి రాజరికాన్ని అమలులో 
పెట్టదలుచుకున్నారా?

ఇప్పుడు జరుగుతున్న పోరాటం దేనికి?

కాక్రోచ్‌‌‌‌‌‌‌‌ జనతా పార్టీ పుట్టిన దగ్గర నుంచి దేశంలో యువత, పాత తరాలు ఊహించనటువంటి ప్రజాస్వామ్య రక్షణ పోరాటం మొదలెట్టింది. అందులో మొదట వాళ్లు యూనివర్సిటీలను ఆలోచనారహితంగా తయారుచేసే ప్రక్రియను ఆపే ఉద్యమం చేశారు. ఆ తరువాత స్కూళ్లు బాగుచెయ్యండి అని ఉద్యమం చేశారు. ఈక్రమంలో  ప్రజలు, మీడియా భయం వాతావరణం నుంచి బయటపడింది. అందువల్లే ఇండియన్‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌ సీఈసీ చేస్తున్న ప్రమాదాన్ని, ఎన్నికలను మటుమాయంచేసే  ప్రక్రియ  సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరుతో జరుగుతున్న తతంగాన్ని బయటపెట్టింది. 13 కోట్లకుపైగా తమకు పడవు అనుకున్న ఓట్లను  సీఈసీ జ్ఞానేశ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిస్టమాటిక్‌‌‌‌‌‌‌‌గా తొలగించాడు. అంతేకాదు. 

 కొత్తగా ఓటు నమోదు చేసుకునే ఫామ్‌‌‌‌‌‌‌‌6ను  కూడా మార్చిపడేసి మొత్తం ఎన్నికల రంగాన్ని మాయ చేశాడు. ఈ ప్రక్రియ ఇప్పుడు నియంతల పాలిస్తున్న కొన్ని దేశాల్లో అమలులో ఉంది. రష్యాలో పుతిన్‌‌‌‌‌‌‌‌ ఎన్నికలు జరుపుతూ ఈ పద్ధతి ద్వారానే ప్రతిసారి తానే గెలుస్తాడు. దాన్ని డెమోక్రసీ అని నమ్మింపజూస్తాడు. భారతదేశం  ఆ దారిలో నడవబోతున్నట్లు ఈ పరిస్థితి చెబుతుంది.  ఇది చాలా పెద్ద ప్రమాదం.  కాక్రోచ్‌‌‌‌‌‌‌‌ జనతా పార్టీ ఈ ప్రక్రియకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టింది.  దేశం మొత్తాన్ని సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వ్యతిరేకంగా కదిలించే ప్రయత్నం మొదలెట్టింది.

ఇండియా కూటమి ఐక్య ఉద్యమం

ఈ క్రమంలో ఇండియా కూటమి కూడా ఐక్య ఉద్యమాన్ని చేపట్టింది.  ఇక చేసేదిలేక  బీజేపీ ప్రభుత్వం పోలీసు, మిలిటరీ, పారా మిలిటరీని ఢిల్లీలో పెద్ద ఎత్తున దింపింది. వందలాది మంది యువకులను అరెస్టు చేసింది. అభిజిత్‌‌‌‌‌‌‌‌ దీప్కేను అరెస్టు చేశాక బెయిల్‌‌పై విడుదలయ్యాడు, సౌరవ్‌‌‌‌‌‌‌‌దాస్‌‌‌‌‌‌‌‌, అశుతోశ్‌‌‌‌‌‌‌‌, రత్నాసింగ్‌‌‌‌‌‌‌‌ మొదలైన సీజేపీ నాయకులంతా అరెస్టు అయి జైలులో ఉన్నారు. నెహాబోరాను అదుపులోకి తీసుకుని  తదుపరి విడుదల చేశారు.  

దేశం మొత్తం వాళ్లమీద అభిమానంతో  అట్టుడుకుతూ అల్లాడుతోంది. నేషనల్‌‌‌‌‌‌‌‌, ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ మీడియా కూడా వారిమీద సానుభూతితో ఉంది. కానీ, ప్రధాన మంత్రి మాత్రం ఈ దేశంలో ప్రజాస్వామ్యం వేదకాలం నుంచి ఉన్నట్టు,  ఇప్పుడు దాని అవసరం లేదన్నట్టు మాట్లాడుతున్నారు.  ప్రజాస్వామ్యం పూర్తిగా ఎన్నికల కమిషన్‌‌‌‌‌‌‌‌ మీద ఆధారపడి ఉంది.  ప్రతిపక్షాల ఓట్లును ఎన్నికల కమిషన్‌‌‌‌‌‌‌‌ చేత తొలగించి ఒక పార్టీ పక్షాన నిలబడితే ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా నాశనం చేయడమే.  ప్రధానమంత్రి ఈ దేశమే ‘మదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ డెమోక్రసీ’ అంటే ప్రపంచం నమ్మదు. జెన్‌‌‌‌‌‌‌‌ జీ నమ్మదు. ఆ సిద్ధాంతాన్ని ఒప్పిస్తూ పుస్తకాలు కూడా రాయించలేరు. రాసినా అది అబద్ధం.