మేడ్చల్: మేడ్చల్ డివిజన్ పరిధిలోని అత్వెల్లిలో నకిలీ వెల్లుల్లి, అల్లం పేస్ట్ తయారు చేస్తున్న కేంద్రంపై పోలీసులు దాడులు నిర్వహించారు. మేడ్చల్ పోలీసులు, కుత్బుల్లాపూర్ ఎస్‌ఓటీ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఈ తనిఖీల్లో భారీగా పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు.
మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అత్వెల్లిలో ఓ ఇంట్లో అక్రమంగా నకిలీ వెల్లుల్లి, అల్లం పేస్ట్ తయారు చేస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి తనిఖీలు చేపట్టారు.
8 క్వింటాళ్ల వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం
ఈ దాడుల్లో సుమారు 8 క్వింటాళ్ల వెల్లుల్లి పేస్ట్, 2 క్వింటాళ్ల అల్లం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న పదార్థాలను ఫుడ్ సేఫ్టీ అధికారుల సమక్షంలో దహనం చేసినట్లు తెలిపారు.అక్రమంగా ఆహార పదార్థాల తయారీ జరుగుతున్నట్లు వచ్చిన సమాచారంతో ఈ దాడులు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.
