ఎండలు మండిపోతున్నాయి. దాదాపు రాష్ట్రమంతటా కరువు అలుముకుంటోంది. పంటసాగు తగ్గింది. సాగుచేసిన పంటలూ అక్కడక్కడా మాడిపోతున్నాయి. సగటు వర్షపాతం 17 శాతం తగ్గింది. వానకు వానకు మధ్య తగ్గిన ఎడం రైతుకు కంటితడి తెప్పిస్తోంది. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. విద్యుత్ వినియోగం పతాక స్థాయికి చేరుతోంది, మరోవైపు విద్యుత్ ఉత్పత్తి గునుస్తోంది. తాగునీటి ఎద్దడి మొదలైంది. రిజర్వాయర్లు నిండలేదు, ఉన్న నీరు ఆవిరవుతోంది. జలమట్టాలు తగ్గుతున్నాయి. సూపర్ ఎల్నినో ప్రభావం అంచనా కన్నా అధికమవుతోంది.
‘యాసంగి సాగు వద్దు, చేసినా వరి వేయొద్దు, ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలు వేసుకోండి’అని ప్రభుత్వం రైతుల్ని కోరుతోంది. ఇంత జరిగాక... ఇప్పుడు ఎల్నినోపై అప్రమత్తంగా ఉండాలని అధికారుల్ని సర్కారు ఆదేశిస్తోంది. ఇదివరకే ఓ కమిటీ వేసినా అది చేసింది శూన్యం. రాష్ట్రంలో ఇంకా కరువు మండలాలు ప్రకటించలేదు. 20 వేల కోట్ల రూపాయల ‘విపత్తు స్పందన నిధి’ ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్రం కోరింది. స్పందన లేదు. పండుగ తర్వాత అఖిలపక్ష భేటీ అని ముందు చెప్పిన ప్రభుత్వం ఉన్నపళంగా ఓ భేటీ జరిపింది. ఇదీ తెలంగాణ పరిస్థితి!
ప్రకృతి విపత్తులు వేరు, మానవ తప్పిదాల వల్ల జరిగే విపరిణామాలు వేరు. ప్రకృతి విపత్తులు కూడా సకాలంలో తగు నివారణ (ప్రివెంటివ్), తట్టుకునే శక్తి (రెజిలియెన్స్), ప్రభావం తగ్గించే (మిటిగేషన్), అలవర్చుకునే (అడాప్టేషన్) చర్యలు చేపట్టని మానవ తప్పిదాల వల్ల మరింత భారీ నష్టం కలిగించే ప్రమాదముంది. సకాలంలో స్పందించి తగు ముందు జాగ్రత్త చర్యలు చేపడితే నష్టనివారణకు ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఎల్-నినో వల్ల ముంచుకు వచ్చిన ‘కరువు’ ప్రమాదం కూడా భారీ నష్టం కలిగించే సూచనలు కనిపిస్తున్నాయి. సకాలంలో స్పందించకపోవడమే అందుకు కారణం. ఎల్-నినో వల్ల తీవ్రమౌతున్న కరువు పరిస్థితి ఆహారోత్పత్తి, జీవనోపాదుల మీద తీవ్ర ప్రతికూల ప్రభావం చూపనుంది. తాగునీటి సమస్య, విద్యుత్ సరఫరాకు కూడా ఇబ్బందులు తలెత్తే ఆస్కారం బలపడుతోంది. ఇవన్నీ అంతిమంగా ఆర్థికాభివృద్దిని, సగటు ప్రజల జీవన పరిస్థితుల్నీ దెబ్బతీస్తాయి.
ఆలస్యంగా స్పందించిన ప్రభుత్వం
ప్రస్తుత సూపర్ ఎల్-నినో ప్రభావం నిజానికి ఎప్పుడో మొదలైంది. జనవరి, ఫిబ్రవరి మాసాల్లోనే అప్రమత్తం కావాల్సిన ప్రభుత్వం ఆలస్యంగా స్పందించింది. వ్యవ సాయ సీజన్ కన్నా ముందుగానే తగు నివారణోపాయాలు, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక, పరిశ్రమలు-, రైతులు, -గృహవినియోగదారులకు తగు అవగాహన కలిగించడం వంటి చర్యల ద్వారా సంసిద్ధం కావాల్సింది. 2027 వరకు ప్రస్తుత ఎల్-నినో ప్రభావం ఉండవచ్చని నిపుణుల కథనం. భారత ద్వీపకల్పంపై తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితులున్నాయి. ఎల్-నినో వల్ల నైరుతి రుతుపవనాలు బలహీనపడటమేకాక సగటు వర్షపాతం తగ్గి, వేడి దినాలు పెరిగి, తేమ బదిలీని కూడా తగ్గించింది. ఇప్పటికే నైరుతి రుతుపవనాల క్షీణత వల్ల వర్షాలు కురవలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 740 ఎంఎం వర్షపాతం కురవాల్సినచోట 615 ఎంఎం మాత్రమే కురిసింది. ఒక్క సెప్టెంబర్లో 38 శాతం వర్షపాతం తగ్గుదల నమోదైంది. మొత్తంమ్మీద ఇప్పటి వరకు సగటున 17 శాతం వర్షపాతం తక్కువ రికార్డయినట్టు గణాంకాలున్నాయి.
కరువు అంచనాలు లేవు
ఉన్నతాధికారులతో ఈ నెల 10న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలో సమావేశం జరిగింది. ఎల్-నినో ప్రభావం వల్ల ఉత్పన్నమైన కరువు పరిస్థితుల దృష్ట్యా తాగునీటి సదుపాయం, నిలవ పంటల రక్షణ, విద్యుత్ అవసరాలు సహేతుక వినియోగం తదితరాంశాల్లో తక్షణ చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. విద్యుత్ వినియోగం ఇప్పటికే ‘పీక’ స్థితికి వెళ్లిపోయింది. గ్రామాల్లో విద్యుత్ అధికారిక-, అనధికారిక కోతలు రైతుల్ని ఇబ్బంది పెడుతున్నాయి. రానున్న రోజుల్లో ఇటు తాగునీటికి, అటు విద్యుత్ సరఫరాకు దుర్బర పరిస్థితులుంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. కరువుపై అంచనాలు లేవు. ఏ ప్రాతిపదికన కేంద్రాన్ని ఆర్థిక సహాయం అడుగుతారో స్పష్టత లేదు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మరో ఇద్దరు మంత్రుల నేతృత్వంలో తాజాగా ఒక అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. రైతు సంఘాలను అనుమతించకుండా కేవలం రాజకీయ పక్షాలకే ప్రాతినిధ్యం ఇచ్చారు. అందులోనూ కాంగ్రెస్ లేదు. సర్కారు పెద్దలే కాంగ్రెస్ కింద లెక్క అంటున్నారు.
ఉపశమన చర్యలే ముఖ్యం
కరువు వల్ల నష్టపోతున్న రైతులకు తక్షణ నష్టపరిహారం చెల్లించాలి. మహారాష్ట్రలో ప్రతి రైతుకు రూ.5 వేల చొప్పున ఇప్పటికే చెల్లిస్తున్నారు. నీటి ఎద్దడి దృష్ట్యా యాసంగిలో పంటలే వేయవద్దు, తాగునీటి కోసం ఈ త్యాగం రైతులు చేయాలంటున్నారు సర్కారు పెద్దలు. ‘నీటి సమస్య ఉంది మీ ఉత్పత్తి నిలపండి’ అని ఏ బీరు కంపెనీనో, ఫార్మా కంపెనీనో ప్రభుత్వం ఆదేశించగలదా? అని వ్యవసాయ నిపుణులు అడుగుతున్నారు. ఫార్మా, మద్యం, టెక్స్టైల్, విత్తన కంపెనీలు పెద్ద మొత్తంలో నీటిని వినియోగిస్తాయి. తాగునీటి ఎద్దడి నిజమే, మరి, ‘పంట విరామం’ (క్రాప్ హాలీడే) ఇచ్చే రైతును ప్రభుత్వం ఎలా ఆదుకుంటుందో స్పష్టత లేదు. ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలు వేసుకోవాలంటున్న ప్రభుత్వం సదరు పంటల కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ), పంట సేకరణకు భరోసా ఇస్తుందా? అన్నది ప్రశ్న.
రాష్ట్రంలో కరువు వల్ల ఇప్పటికే రూ. 20 వేల కోట్ల మేర పంట నష్టం జరిగినట్టు ప్రొ. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టు వార్తలొస్తున్నాయి. సదరు నష్టపరిహారం ఏ ప్రాతిపదికన చెల్లిస్తారు? కేంద్రం నుంచి నిధులు ఎలా రాబట్టుకుంటారు? అన్నది ప్రధానం. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల చివరి రోజున ఎల్-నినో, కరువు దృష్ట్యా 20 వేల కోట్ల రూపాయల సహాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం సభ ఆమోదించింది. తర్వాత పలు విడతల్లో ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలిసి తమ డిమాండ్ గుర్తు చేశారు. ‘జాతీయ విపత్తుల స్పందన నిధి’ (ఎన్డిఆర్ఎఫ్) కింద ఈ సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. స్పందించని కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి అవసరమైతే అఖిలపక్షాన్ని ఢిల్లీ
తీసుకువెళ్లాలని కూడా సర్కారు యోచిస్తోంది.
నెపం నెడితే సరిపోదు
కరువు రైతుల సమస్య మాత్రమే కాదు. మనుషులు, పశువుల తాగునీరు, ఆహారం, విద్యుదుత్పత్తి, జీవనోపాధులపై ప్రభావం చూపించే అంశం. కేంద్రాన్ని సహాయం కోరాం, స్పందించడం లేదనో! ఎల్-నినో కదా ఎవరమైనా ఏం చేయగలం? అని నెపం ఇతరులపై నెట్టి చేతులు దులుపుకునేంత తేలిక వ్యవహారం కాదిది. సకాలంలో చర్యలు అవసరం. ఇప్పటికే స్పందించి ఉండాల్సింది. ఐక్యరాజ్యసమితి (యూఎన్) నియోగించిన అంతర్ ప్రభుత్వాల అధ్యయన బృందం (ఐపీసీసీ) ఎప్పటికప్పుడు ఇచ్చిన ‘హెచ్చరిక’ నివేదికల్ని బట్టి ‘వాతావరణ మార్పు’ (క్లైమెట్ చేంజ్) పైన, ముఖ్యంగా ఎల్-నినో ప్రభావంపైన ప్రపంచ దేశాలు ఎప్పుడో అప్రమత్తమయ్యాయి. వాతావరణ అత్యయిక పరిస్థితి (క్లైమెట్ ఎమర్జెన్సీ)ని ప్రకటించి, అందుకు అనుగుణంగా కార్యాచరణ చేపట్టాయి. కానీ, మన దేశంలో ప్రమాదం ముంచుకు వచ్చే దాకా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కదలికే కరువయింది. ఇప్పటికైనా కదలాలి. కోరలు చాస్తున్న కరువు నుంచి రక్షణకు తక్షణ చర్యలు చేపట్టాలి.
కరువు వెంటనే ప్రకటించాలి
రాష్ట్రంలోని ప్రభావిత మండలాల్లో కరువును అధికారికంగా ప్రకటించాలి. ప్రత్యామ్నాయ కార్యప్రణాళి (కంటింజెన్సీ ప్రోగ్రామ్) ఆచరణ ముమ్మరం చేయాలి. ఇరుగుపొరుగు రాష్ట్రాలైన కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రలో ప్రభుత్వాలు కరువు ప్రకటించాయి. మహారాష్ట్రలో దాదాపు 70 శాతం తాలూకాల్లో కరువు ప్రకటించారు. మన దగ్గరే జాప్యం జరుగుతోంది. మధ్య, దక్షిణ తెలంగాణలో పరిస్థితి దారుణంగా ఉంది. రాష్ట్రంలోని 18 జిల్లాల్లో ఇప్పటికే కరువు పరిస్థితులున్నట్టు, అందులోనూ 13 దక్షిణాది జిల్లాలలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉన్నట్టు సమాచారం. ఇక్కడ వర్షపాతం తగ్గుదల 26 శాతం వరకుంది. సగటు ఉష్ణాగ్రతల కన్నా రెండు, మూడు డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదవుతోంది. సగటు వర్షపాతం తరిగి, వేడి దినాలు పెరగటం వల్ల వాతావరణం నిండు వేసవిని తలపిస్తోంది. ఆగ్నేయ రుతుపవనాల వల్ల (అక్టోబర్-డిసెంబర్) దక్షిణ భారత్లో భారీ వర్షాలు, వరదల ప్రమాదముంది. వేడి కొనసాగి, చలి తక్కువగా ఉండే అవకాశాలున్నాయి.
- దిలీప్ రెడ్డి
పొలిటికల్ ఎనలిస్ట్,
పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్
