ఢిల్లీలో కాలుష్యం లాగా... హైదరాబాద్ లో ఉండకూడదనే.. ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతున్నాం: మంత్రి పొన్నం 

ఢిల్లీలో కాలుష్యం లాగా... హైదరాబాద్ లో ఉండకూడదనే.. ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతున్నాం: మంత్రి పొన్నం 

ఉప్పల్ జోనల్ వర్క్ షాప్ దగ్గర రూ.3.22 కోట్లతో నిర్మిస్తున్న సిటీ బస్సు టర్మినల్ కు శంకుస్థాపన చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. శనివారం ( అక్టోబర్ 24 ) నిర్వహించిన ఈ కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఢిల్లీలో కాలుష్యం లాగా హైదరాబాద్ లో ఉండకూడదనే ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతున్నామని అన్నారు.

మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో ప్రజల ఇబ్బందులు తొలగిస్తూ సిటీ బస్ టెర్మినల్ కు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని.. 1053 బస్సులు ట్రిప్పులు ఇక్కడి నుండి బస్సులు పోతున్నాయని.. రోజుకు లక్ష మంది ఇక్కడి నుండి ప్రయాణించేలా అధునాతన సౌకర్యాలతో బస్ టెర్మినల్ నిర్మిస్తున్నామని అన్నారు పొన్నం ప్రభాకర్. ఇక్కడి నుండి భువనగిరి,యాదగిరి గుట్ట, హనుమకొండ, వరంగల్ ప్రాంతాలకు ప్రయాణాలు ఎక్కువగా సాగుతాయని అన్నారు.

ఈ బస్సు టర్మినల్ ఫిర్జాధిగూడ ,బోడుప్పల్ ఏరియా కిందకి వస్తుందని.. ఆపేరుతోనే కొత్త బస్ స్టేషన్ కు నామకరణం చేస్తామని స్పష్టం చేశారు పొన్నం ప్రభాకర్. ఇప్పటి వరకు 367 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేసి 12,888 కోట్ల రూపాయలు ఆదా చేసుకున్నారని అన్నారు. సంస్థ పరిరక్షణ ప్రయాణికుల సౌకర్యం ,కార్మికుల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ అభివృద్ధి చేస్తున్నామని.. శాసన సభ సమావేశాల్లో ఎమ్మెల్యేలతో సమావేశాలు ఏర్పాటు చేసి నియోజకవర్గాల్లో  అవసరమైన బస్సులు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు.

ఇప్పటి వరకు 3 వేలకు పైగా బస్సులు కొనుగోలు చేశామని.. పీఎం ఈ డ్రైవ్ కింద 2200 ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయని అన్నారు. హైదరాబాద్ లో కొత్త రూట్లలో బస్సులు నడిపిస్తున్నామని... ఎక్కడ అవసరం ఉంటే అక్కడ విజ్ఞాపన ఇవ్వాలని అన్నారు మంత్రి పొన్నం. పదేళ్ల కిందట రద్దయిన ఆర్టీసీ ఎన్నికలు నిర్వహించడం జరిగిందని.. ఎన్నికైన గుర్తింపు సంఘంతో కమిటీ వేసి విలీన ప్రక్రియ ప్రారంభిస్తామని అన్నారు పొన్నం.

క్యూర్ ఏరియాలో ఈవి ఆటోలకు 200 కోట్లు కేటాయించడం జరిగిందని.. ఈవి పాలసీ ద్వారా పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తున్నారని..సున్నా  టాక్స్ ఉందని అన్నారు పొన్నం. ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు పొన్నం. రోడ్ సేఫ్టీ కోసం రిఫ్లెక్టర్ తెచ్చామని.. స్క్రాప్ పాలసీ తీసుకొచ్చామని అన్నారు పొన్నం. కొత్త బస్ టెర్మినల్ లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని.. బస్ స్టేషన్లలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు మంత్రి పొన్నం.