ఎల్ నినో ప్రకృతి వైపరీత్యమేనని.. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు కాదని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. శనివారం ( అక్టోబర్ 17 ) సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ లో ఎల్లమ్మ చెరువును సందర్శించారు మంత్రి పొన్నం. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. సద్దుల బతుకమ్మ కోసం ఎల్లమ్మ చెరువు దగ్గర ఘనంగా ఏర్పాట్లు చేశామని.. హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువును, గ్లాస్ బ్రిడ్జ్ ను, గుట్టను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని అన్నారు.
కబడ్డీ అకాడమీతో పాటు, హుస్నాబాద్ కు స్విమ్మింగ్ ఫుల్ కూడా శాంక్షన్ అయ్యిందని... 2007 లో శంకుస్థాపన చేసిన గౌరవెల్లి ప్రాజెక్టు అడ్డంకులు, సుప్రీంకోర్టు కేసు అవరోధాలు కూడా తొలగిపోయి కాలువల కోసం భూ సేకరణ జరుగుతోందని అన్నారు. త్వరలోనే గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తామని, ఇరిగేషన్ పనులకు ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు మంత్రి పొన్నం.
వ్యవసాయానికి విద్యుత్ కు సంబంధించి ఈ పంట వరకు ఉదయం నుండి సాయంత్రం దాకా రాత్రి కూడా కొంత సమయం విద్యుత్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని.. సీఎం రేవంత్ చెప్పిన విధంగా ప్రజలందరూ కరెంట్, నీళ్ళు పొదుపుగా వాడాలని అన్నారు. ఈ వచ్చే సీజన్ లో వరి పంట కాకుండా నీటి లభ్యత ఆధారంగా రైతులు పంటలు వేసుకోవాలని సూచించారు మంత్రి పొన్నం.
వర్షం పడ్డ పడక పోయిన ఆది ప్రకృతికి సంబంధించిన అంశమని అన్నారు. బీఆర్పఎస్ హయాంలో పదేళ్లలో ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇచ్చారో తెలీదు కానీ.. మా ప్రభుత్వం వచ్చాక నియోజకవర్గానికి 3వేల 500 ఇళ్ళు ఇచ్చామని అన్నారు.
రాష్ట్రంలో ఎక్కడ కూడా గుడిసెలు లేకుండా చూస్తున్నామని.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా అర్హత ఉన్న అందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని, దీన్ని రాజకీయం చేయొద్దని అన్నారు మంత్రి పొన్నం. ప్రభుత్వ స్థలమును ఎవరు కబ్జా చేయడానికి వీలు లేదని, ఆది ప్రభుత్వం అవసరాలకు ఉపయోగిస్తుందని అన్నారు మంత్రి పొన్నం.
