క్రికెట్లోకి పోర్చుగల్ దేశం.. ఫుట్ బాల్ స్థాయిలో సత్తా చూపిస్తామని సవాళ్లు

క్రికెట్లోకి పోర్చుగల్ దేశం.. ఫుట్ బాల్ స్థాయిలో సత్తా చూపిస్తామని సవాళ్లు

T20 World Cup 2028: ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ మోయిసెస్ హెన్రిక్స్ పోర్చుగల్ క్రికెట్ జట్టు సారథ్య బాధ్యతలను స్వీకరించాడు. భారత్ వేదికగా జరిగిన 2026 టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించి సంచలనం సృష్టించిన ఇటలీ బాటలోనే పయనిస్తూ, ఫుట్‌బాల్‌కు భారీ ప్రజాదరణ ఉన్న పోర్చుగల్‌ను కూడా ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ లో ఆడటమే తన ప్రధాన లక్ష్యంగా హెన్రిక్స్ సిద్ధమైనట్లు చెప్పుకొచ్చాడు. 

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో పోర్చుగల్ ప్లేస్: 

ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో 37వ స్థానంలో ఉన్న పోర్చుగల్ జట్టు అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన ప్రదర్శన చేసేందుకు హెన్రిక్స్ అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆ దేశ క్రికెట్ బోర్డు భావిస్తోంది.

రొనాల్డో జన్మస్థలం నుంచి ఆస్ట్రేలియాకు: 

ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో జన్మస్థలమైన పోర్చుగల్‌లోని మదీరా దీవిలో 1987 ఫిబ్రవరి 1వ తేదీన జన్మించిన మోయిసెస్ హెన్రిక్స్, ఆ తర్వాత ఆస్ట్రేలియాకు వలస వెళ్లి ఆ దేశ జాతీయ జట్టుకు సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా సేవలందించాడు. ఆస్ట్రేలియా తరఫున 44 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన హెన్రిక్స్, ఆసీస్ దేశవాళీ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన ఆటగాడిగా గుర్తింపు పొందాడు.

బీబీఎల్ టైటిళ్లు, విదేశీ లీగ్‌లు: 

న్యూ సౌత్ వేల్స్, సిడ్నీ సిక్సర్స్ జట్లలో సుదీర్ఘకాలం ఆడిన అతను, సారథిగా బిగ్ బాష్ లీగ్ (BBL 09, BBL 10) లో సిడ్నీ సిక్సర్స్ జట్టుకు రెండుసార్లు టైటిల్ అందించాడు. గత నెలలోనే ఆస్ట్రేలియా డొమెస్టిక్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన హెన్రిక్స్, విదేశీ లీగ్‌లలో ఆడనున్నాడు. అందులో భాగంగా యూరోపియన్ టీ20 ప్రిమియర్ లీగ్‌లో గ్లాస్గో కాస్మిక్ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.

2028 టీ20 ప్రపంచకప్ క్వాలిఫైయర్ పోరు: 

ఆగస్టు 14 నుంచి 20వ తేదీ వరకు జరగనున్న టీ20 ప్రపంచకప్ యూరోప్ సబ్-రీజినల్ క్వాలిఫైయర్ సి గ్రూప్-బిలో పోర్చుగల్ జట్టు ఇజ్రాయెల్, జర్మనీ, గ్రీస్, చెకియాలతో పోటీపడనుంది. ఈ గ్రూప్‌లో విజేతగా నిలిచిన జట్టు ఆగస్టు 21వ తేదీన గ్రూప్-ఎ విజేతతో ఫైనల్ పోరులో తలపడుతుంది.

వరల్డ్ కప్ బెర్త్ దిశగా అడుగులు: 

ఫైనల్లో గెలిచిన జట్టు స్కాట్లాండ్, జెర్సీ, డెన్మార్క్‌లతో కలిసి యూరోపియన్ రీజినల్ ఫైనల్‌కు చేరుకుంటుంది. ఈ టోర్నీలో టాప్-2 స్థానాల్లో నిలిచే జట్లు గ్లోబల్ క్వాలిఫైయర్‌కు అర్హత సాధించి, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఉమ్మడిగా ఆతిథ్యమిచ్చే 2028 టీ20 ప్రపంచకప్‌లో చోటు కోసం పోటీ పడతాయి.

పోర్చుగల్ స్క్వాడ్: 

మోయిసెస్ హెన్రిక్స్ (కెప్టెన్), క్రెయిగ్ కాచోపా, ఎడ్వర్డ్ ఫ్లెమింగ్, క్రిస్టోఫర్ డి ఫ్రెయిటాస్, రాహుల్‌కుమార్ హషు, సిరాజ్ ఉల్లా ఖాదేమ్, హార్దీప్ ఖుట్టన్, జెరెమీ మార్టిన్స్, ధవల్ కుమార్ నొరోటమ్, జార్డాన్ నెట్టో, కార్లోస్ నునెస్, సెబాస్టియన్ డి ఒలివేరా, ఉపెన్ శాంతు, కేమరాన్ షెక్లేటన్