సెయింట్ లూయిస్ (అమెరికా): ఇండియా గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద.. తొలిసారి సెయింట్ లూయిస్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. మరో రౌండ్ మిగిలి ఉండగానే మొత్తం 23.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. జావోఖిర్ సిందరోవ్ (ఉజ్బెకిస్తాన్, 22), వెస్లీ సో (అమెరికా, 20.5) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.
ర్యాపిడ్ విభాగంలో స్వల్ప ఆధిక్యంలో ఉన్న ప్రజ్ఞానంద.. చివరి రోజు బ్లిట్జ్ విభాగంలో సూపర్ షో చూపెట్టాడు. మొత్తం 18 పాయింట్లకుగాను 11.5 పాయింట్లు సాధించాడు. ఈ విజయంతో ప్రజ్ఞానంద.. గ్రాండ్ చెస్ టూర్ (జీసీటీ) ఓవరాల్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి దూసుకెళ్లాడు.
ఫలితంగా ఈ ఏడాది చివర్లో జరిగే గ్రాండ్ ఫినాలే ఫైనల్ బెర్త్‌ను దాదాపుగా ఖాయం చేసుకున్నాడు. ఇక ఆదివారం నుంచి జరిగే క్లాసికల్ టోర్నీలోనూ ప్రజ్ఞానంద ఇదే జోరును కొనసాగించాలని భావిస్తున్నాడు. ఇందులో టాప్–3లో నిలిస్తే మరో అరుదైన రికార్డు అతని సొంతమవుతుంది.
