హిట్ మూవీ రీమేక్తో ప్రగ్యా జైస్వాల్

హిట్ మూవీ రీమేక్తో ప్రగ్యా జైస్వాల్

తెలుగుతో పాటు అడపాదడపా హిందీలోనూ సినిమాల్లోనూ నటిస్తోంది ప్రగ్యా జైస్వాల్. రెండేళ్ల క్రితం అక్షయ్ కుమార్ సినిమా ‘ఖేల్ ఖేల్‌‌ మే’లో మెరిసిన ఆమె.. త్వరలో సన్నీ డియోల్‌‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. సన్నీ డియోల్ హీరోగా ఎం. పద్మకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సూర్య’.  రవి కిషన్, మనీష్ వాధ్వా కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని కమల్ ముకుత్ నిర్మిస్తున్నారు.

రీసెంట్‌గా ఈ మూవీ మోషన్‌‌ పోస్టర్‌‌‌‌ను విడుదల చేసిన మేకర్స్‌‌.. నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు ప్రకటించారు.  2018లో మలయాళంలో వచ్చిన క్రైమ్‌‌ థ్రిల్లర్‌‌‌‌ ‘జోసెఫ్‌‌’కు ఇది హిందీ రీమేక్‌‌. ఇప్పటికే రాజశేఖర్‌‌‌‌ హీరోగా ‘శేఖర్‌‌‌‌’ పేరుతో తెలుగులోకి వచ్చిన ఈ చిత్రం తమిళ, కన్నడ భాషల్లోనూ రీమేక్ అయింది.  మలయాళ దర్శకుడే హిందీలోనూ తెరకెక్కిస్తున్నాడు.

ఇందులో ప్రగ్యా క్యారెక్టర్‌‌‌‌ ఎలా ఉండబోతోంది అనేది ఇంకా రివీల్ చేయలేదు.  అయితే ఆల్రెడీ సూపర్ హిట్ అయిన సినిమాకు రీమేక్‌‌ కావడంతో.. హిందీలో తనకు హిట్ ఇస్తుందనే నమ్మకంతో ఉంది ప్రగ్యా జైస్వాల్.  ఇక తెలుగులో ఆమె నటించిన ‘టైసన్‌‌ నాయుడు’ చిత్రం విడుదల కావలసి ఉంది.