2వేల 300 ఉద్యోగాలకు అప్లై చేస్తే ఒక్కటీ రాలే..! జాబ్ మార్కెట్ మరీ ఇంత దరిద్రంగా ఉందా?

2వేల 300 ఉద్యోగాలకు అప్లై చేస్తే ఒక్కటీ రాలే..! జాబ్ మార్కెట్ మరీ ఇంత దరిద్రంగా ఉందా?

నీకేంటిరా మంచిగా చదువుకున్నావ్, మంచి కాలేజీలో ఉన్నావ్ జాబ్ ఇట్టే వచ్చేస్తుంది అనే రోజులు పోయాయ్. ప్రస్తుతం చదువుకుంటే సరిపోదు.. మార్కెట్లో ఉద్యోగం ఉండాలి. మరి నోబెల్ కమిటీనే గుర్తించిన అరుదైన పరిశోధనలు చేసి, అమెరికాలోని అత్యున్నత ప్రిన్స్టన్ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పూర్తి చేసిన యువకుడికి ఏకంగా 2 వేలకు పైగా దరఖాస్తులు పెట్టినా ఒక్క ఉద్యోగం దక్కకపోతే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత గ్లోబల్ జాబ్ మార్కెట్ ఎంతలా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుందో చెప్పడానికి జాక్ వైస్ అనే కెమికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కష్టాలే నిదర్శనం.

రైస్ యూనివర్సిటీలో 'సుమ్మా కమ్ లాడ్'తో పట్టా పుచ్చుకుని, ప్రిన్స్టన్‌లో 2018లో పీహెచ్‌డీలో చేరిన జాక్ వైస్ పరిశోధనల స్థాయి సాధారణమైనది కాదు. ఆయన చేసిన మాలిక్యులర్ ఇంటరాక్షన్స్, ఐస్ ఫార్మేషన్ రీసెర్చ్‌ను ఏకంగా 2024 నోబెల్ బహుమతి ప్రకటన సందర్భంగా నోబెల్ కమిటీ ఉదహరించింది. సైన్స్‌లో AI వాడకానికి ఈయన పనే ఉదాహరణ. కానీ ఇన్ని అర్హతలున్న మేధావి నేడు ఉద్యోగం కోసం సాల్ట్ లేక్ సిటీలోని తన తల్లిదండ్రుల ఇంట్లో తలదాచుకోవాల్సి వస్తోంది.

ఫార్మాస్యూటికల్ రీసెర్చ్, నేషనల్ లాబొరేటరీస్ మొదలుకుని.. సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, చివరకు ఫ్రోజెన్ క్రాబ్ కేక్స్ అమ్మే కంపెనీలో ఫుడ్ ప్రిపరేషన్ ఉద్యోగం వరకు వైస్ దరఖాస్తు చేయని రంగం లేదు. 2024 నుంచి ఇప్పటివరకు ఏకంగా 2వేల300లకు పైగా ఉద్యోగాలకు అప్లై చేసినా ఫలితం శూన్యం. కొన్నిచోట్ల కనీసం స్పందన కూడా రాలేదు. 2026 జనవరిలో ఏఐ ట్రెయినింగ్ స్టార్టప్‌లో గంటకు 70 డాలర్ల వేతనంతో పార్ట్‌టైమ్ జాబ్ దొరికినప్పటికీ.. మార్చి నాటికి అది కూడా ఊడిపోయింది. వైద్యులైన ఆయన తల్లిదండ్రులు సైతం కొడుకు పడుతున్న పాట్లను చూసి బాధపడుతున్నారు.

ప్రస్తుతం జాబ్ మార్కెట్‌లో నిరుద్యోగుల ఆవేదనకు ఈ కథనం అద్దం పడుతోంది. డిగ్రీలు, పీహెచ్‌డీలు ఉన్నా.. మార్కెట్ డిమాండ్ లేకపోవడంతో లక్షలాది మంది యువత ఎదుర్కొంటున్న నిరాశానిస్పృహలకు జాక్ వైస్ ప్రయాణం అద్దంపడుతోంది. ఉద్యోగం రాలేదని కుంగిపోకుండా, ఇప్పుడు లా స్కూల్‌ వైపు అడుగులు వేస్తూ.. ఏఐ డ్రోన్ల ద్వారా కలుపు మొక్కలను తొలగించే వినూత్న బిజినెస్ ఐడియాపై వైస్ దృష్టి పెట్టారు. నిరుద్యోగమనే గోడను బద్దలు కొట్టడానికి కేవలం సర్టిఫికెట్లు సరిపోవు.. వైవిధ్యమైన ఆలోచనలు కూడా కావాలని ఈ పరిస్థితులు చెప్పకనేచెబుతున్నాయి.