ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రైవేట్ డాక్టర్ల వింత పోకడల ప్రచారాన్ని అరికట్టాలనే సదుద్దేశ్యంతో జాతీయ వైద్య కమిషన్ కొన్ని మార్గదర్శకాలను ఇటీవలే విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలను ఎలాంటి ఉల్లంఘనలు లేకుండా ఆచరించవలసిన బాధ్యత ఆసుపత్రులు, వైద్యుల మీద ఉంది. వైద్యులు, ఆసుపత్రులు సాంఘిక మాధ్యమాల ద్వారా చేయకూడనివి.. తమ గురించి ఉత్తమ వైద్యుడు, నెంబర్ వన్ నిపుణుడు, అద్భుత చికిత్స, నొప్పిలేని చికిత్స, కచ్చితమైన నివారణలాంటి పదాలను ప్రచారానికి ఉపయోగించరాదు.
రోగులను ఆకర్షించటానికి కృత్రిమ మేధను ఉపయోగించుకోవటం లేదా ఇన్‌ఫ్లూయర్స్‌ను లేదా థర్డ్ పార్టీ మార్కెటింగ్ ఏజెన్సీలను నియమించుకోకూడదు. ప్రొఫైల్ లు లేదా రేటింగ్‌లు కృత్రిమంగా పెంచటానికి నకిలీ లైక్ లు, ఫాలోవర్లను సృష్టించరాదు.
పబ్లిక్ కామెంట్ సెక్షన్లలో లేదా డైరెక్ట్ మెసేజ్‌లలో మందులను సూచించటం సరికాదు. చికిత్సకు ముందు, చికిత్స తర్వాత అంటూ రోగుల ఫొటోలు బహిర్గతం చేయటం, రోగులు లేదా వారి కుటుంబ సభ్యుల ప్రశంసాపత్రాలు, వీడియోలు ఉపయోగించటం, రోగి ద్వారా ప్రచారం నిషేధం. రోగి గోప్యతను పాటించాలి. తమ ప్రచారానికి ప్రముఖులను, ప్రజా ప్రతినిధులను ఉపయోగించకూడదు. నిర్దిష్ట ఔషధ బ్రాండ్లు, వైద్య పరికరాలను ప్రచారం నిమిత్తం ఉపయోగించకూడదు.
మోసపూరిత ధరలపై నిషేధం.
అంటే ఉదాహరణకు సీటీ స్కాన్ రూ.999/-గా ప్రకటించి మరొక చార్జీని వసూలు చేయరాదు. రోగిని పంపిస్తే కమీషన్ ఎత్తుగడలు నిషేధం. ఆసుపత్రిలో దొరికే మౌలిక సదుపాయాలను, అందుబాటులో ఉన్న సేవల గురించి మాత్రమే ప్రచారం చేసుకోవచ్చు. కానీ ఆ ఆసుపత్రి వైద్యుడిని ప్రచార ప్రకటనకు ప్రధాన అంశంగా చూపకూడదు.
బహుమతులు, కూపన్లు, డిస్కౌంట్లు లాంటి ఆర్ధిక ప్రలోభాలు ప్రకటించకూడదు. వైద్యుడు ఏదైనా విభాగంలో ప్రత్యేక అర్హత కలిగి ఉంటే తప్ప, తాను ఆ విభాగంలో నిపుణుడినని చెప్పుకోకూడదు. వైద్యుని పేరు, విద్యార్హతలు, రాష్ట్ర లేదా జాతీయ మెడికల్ రిజిస్టర్ నెంబర్ ను స్పష్టంగా ప్రదర్శించాలి. ప్రామాణిక రుసుముల గురించి ప్రకటనలు వాస్తవంగా ఉండాలి.
డాక్టర్లు, ఆసుపత్రులు సాంఘిక మాధ్యమాల్లో చేయతగినవి
ఆరోగ్యవిద్యపై అవగాహన, వ్యాధి నివారణ చిట్కాలు, కోలుకునే అంచనాలు సాంఘిక మాధ్యమాల్లో పంచుకోవచ్చు. ప్రతి ఎలక్ట్రానిక్ పోస్ట్ లో డాక్టర్ పేరు, అర్హతలు, మెడికల్ రిజిస్టర్ నెంబర్ స్పష్టంగా కనిపించాలి. క్లినిక్ వేళలు, చిరునామా మార్పు, ప్రభుత్వ ఆరోగ్య ప్రచారాలు లాంటివి సాంఘిక మాధ్యమాల్లో పోస్ట్ చేసుకోవచ్చు. రోగులను తప్పనిసరిగా అధికారిక టెలీ మెడిసిన్ లేదా వ్యక్తిగత సంప్రదింపులకు మాత్రమే ప్రోత్సహించాలి.
ఉల్లంఘనులపై చర్యలు
రాష్ట్ర వైద్య కమిషన్లు ఉల్లంఘనులపై విచారణలు, చర్యలను నిర్వహిస్తాయి. అప్పీలు అధికారం జాతీయ వైద్య కమిషన్ ఎథిక్స్, రిజిస్ట్రేషన్ బోర్డుకు ఉంటుంది. వైద్యులకు అధికారిక హెచ్చరికలు, జరిమానాలు, వైద్య రిజిస్ట్రేషన్ సస్పెన్షన్, వైద్య రిజిస్టర్ నుంచి పేరు తొలగింపు చర్యలు ఉంటాయి.
డాక్టర్లు, ఆసుపత్రుల సేవల్లో లోపం
పర్మానంద్ కటారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (1989) కేసులో సుప్రీంకోర్టు తీవ్రంగా గాయపడిన లేదా ప్రమాదంలో ఉన్న బాధితుడికి పోలీసు క్లియరెన్స్ కోసం వేచి చూడకుండా తక్షణ ప్రాణరక్షక వైద్య సహాయం అందించటం ప్రతి వైద్యుడి/ ప్రతి ఆసుపత్రి సంపూర్ణ విధి అని పేర్కొంది.
రుసుము తీసుకొని వైద్యులు, ఆసుపత్రులు అందించే వైద్యసేవలు వినియోగదారుల రక్షణ చట్టంలోని ‘సేవ’ అనే నిర్వచనంలోకి వస్తాయని, వైద్యులు లేదా ఆసుపత్రుల్లో వైద్య నిర్లక్ష్యం లేదా సేవా లోపం ఎదుర్కొంటే, డాక్టర్ లేదా ఆసుపత్రి లేదా ఇరువురిని ప్రతివాదులుగా చేర్చి వినియోగదారుల కోర్టును ఆశ్రయించవచ్చునని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వర్సెస్ వి.పి. శాంత (1995) అనే కేసులో సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఉద్ఘాటించింది.
1995 నాటి ఈ తీర్పును సుప్రీం కోర్టు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం సెప్టెంబర్ 2026 లో పునరుద్ఘాటించింది. స్ప్రింగ్ మీడౌస్ హాస్పిటల్ వర్సెస్ హర్జోత్ ఆహ్లువాలియా (1998) కేసులో బాధితుల విషయంలో ఆసుపత్రి యాజమాన్యానికి నేరుగా ఎటువంటి తప్పు లేకపోయినప్పటికీ, ఆ ఆసుపత్రి సిబ్బంది, నర్సులు, రెసిడెంట్ డాక్టర్ల నిర్లక్ష్యానికి ఆసుపత్రులు పరోక్షంగా బాధ్యత వహించవలసి ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది.
అయితే కేవలం సివిల్ కేసుల్లో మాత్రమే పరోక్ష బాధ్యత ఉంటుంది. ఏదేని డాక్టర్‌పై వైద్య నిర్లక్ష్యం కింద క్రిమినల్ చర్యలు చేపట్టాలంటే, దర్యాప్తు అధికారులు స్వతంత్ర వైద్య అభిప్రాయాన్ని తప్పనిసరిగా పొందాలి. అంతే కాకుండా క్రిమినల్ అభియోగం మోపాలంటే ఘోరమైన నిర్లక్ష్యం జరిగినట్లు రుజువు చేయవలసిన బాధ్యత ప్రాసిక్యూషన్ మీద ఉంటుంది.
వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం కేసులు
శరీరంలోని తప్పుడు భాగంపై శస్త్రచికిత్స చేయటం, వైద్య పరికరాలను శరీరం లోపల వదలివేయటం, తప్పుడు వైద్య నిర్దారణ లేదా నిర్దారణలో జాప్యం లాంటి కారణాలు వైద్యపరమైన నిర్లక్ష్యంగా పేర్కొనవచ్చు. ప్రసూతి వైద్యులు, స్త్రీల వైద్యులు, జనరల్ సర్జన్లు, న్యూరో సర్జన్లు, కార్దియో వాస్కులర్ సర్జన్లు, ప్లాస్టిక్ సర్జన్లుపై సేవాలోపం లేదా వైద్య నిర్లక్ష్యం పేర్కొంటూ వినియోగదారుల రక్షణ చట్టం క్రింద కేసులు దాఖలు అయ్యే అవకాశముంది.
- తడకమళ్ళ మురళీధర్, విశ్రాంత జిల్లా జడ్జి–
గమనిక: ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ [email protected]
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.
