చిత్రాలయం స్టూడియో బ్యానర్‌పై వేణు దోనేపూడి నిర్మించిన క్రైమ్ కామెడీ చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’. గుణి మంచికంటి రూపొందించిన ఈ సినిమాలో ఉపేంద్ర లిమాయే, టీనూ ఆనంద్, అక్షయ్ లగుసాని, విష్ణు ఓయి, రాజా రవీంద్ర ముఖ్య పాత్రలు పోషించారు. అక్టోబర్ 9న విడుదలైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోందని నిర్మాత వేణు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మా కుటుంబానికి సినిమా రంగంతో ఎప్పట్నుంచో అనుబంధం ఉంది. అమెరికాలో ఆటోమొబైల్ బిజినెస్‌తోపాటు మూవీస్ డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ చేసేవాడిని. గోపీచంద్‌తో ‘విశ్వం’ తర్వాత జెన్ జీ ప్రేక్షకులకు నచ్చే కథతో ‘బా బా బ్లాక్ షీప్’ రూపొందించాం. 30 రోజుల్లో షూటింగ్ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకుని 28 రోజుల్లోనే పూర్తి చేశాం.
మేఘాలయలోని అద్భుతమైన లొకేషన్స్‌లో షూట్ చేశాం. అక్కడి ప్రభుత్వం ఎంతో సపోర్ట్ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ ఇండియా, ఓవర్సీస్‌లోనూ బ్రేక్ ఈవెన్ సాధించాం. నవంబర్ 6 నుంచి అమెజాన్‌లో స్ట్రీమింగ్‌కు రానుంది. నెక్స్ట్ నా డ్రీమ్ ప్రాజెక్టుగా భారీ బడ్జెట్‌తో ‘రామమ్’ రూపొందిస్తున్నాం. వీఎన్ ఆదిత్య కథను అందించారు. అలాగే ‘గాంధీతాతచెట్టు’ దర్శకురాలితో ఓ లవ్ స్టోరీ తీస్తున్నాం. పెద్ద హీరోలతో రెండు సినిమాలు ప్లాన్ చేస్తున్నాం. త్వరలో ఆ వివరాలు ప్రకటిస్తాం’ అని చెప్పారు.
