సుడా విస్తరణ ఇంకెప్పుడు ? రెండేండ్ల కింద ఉత్తర్వులు.. కాగితాలకే పరిమితమైన జీవో

సుడా విస్తరణ ఇంకెప్పుడు ? రెండేండ్ల కింద ఉత్తర్వులు.. కాగితాలకే పరిమితమైన జీవో

సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథార్టీ(సుడా) జిల్లా మొత్తం విస్తరిస్తామన్న ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. రెండేండ్ల కింద మొత్తం జిల్లాను సుడా పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా.. ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. దీంతో పదేండ్ల కింద 26 గ్రామాలతో ఏర్పడిన సుడా.. ఇప్పటికీ ఆ గ్రామాలకే పరిమితమైంది. మరోవైపు మూడేండ్లుగా సుడా చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుర్చీ ఖాళీగానే ఉంది.

రెండేండ్ల కింద ఉత్తర్వులు
సిద్దిపేట అర్బన్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ అథారిటీ(సుడా) 2017లో  ఏర్పాటైంది. సిద్దిపేట మున్సిపాలిటీతోపాటు సిద్దిపేట అర్బన్, రూరల్, చిన్నకోడూరు, కొండపాక మండలాలకు చెందిన మొత్తం 26 గ్రామ పంచాయతీలు సుమారు 327 కి.మీ సుడా పరిధిలోకి తెచ్చారు. ఈ టైంలో జిల్లా సరిహద్దులోని ఆరు మండలాలకు చెందిన 74 గ్రామాలు హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎండీఏ పరిధిలోనే ఉండిపోయాయి.

అనంతరం రెండేండ్ల కింద హెచ్ఎండీఏ పరిధిలోని గ్రామాలు మినహాయించి  జిల్లాలోని ఐదు మున్సిపాల్టీలతో పాటు 290 గ్రామాలు సుడా పరిధిలోకి విస్తరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కానీ ఇప్పటివరకు అమలు చేయలేదు. పాత జీవో ప్రకారమే ప్రస్తుతమున్న 26 గ్రామాల పరిధిలోనే సుడా పర్యవేక్షణ కొనసాగుతోంది. 

ఆదాయానికి భారీగా గండి
జిల్లా మొత్తం సుడాను విస్తరించినా అమలుకు ఆదేశాలు రాకపోవడంతో ఆదాయానికి భారీగా గండి పడుతోంది. జిల్లాలోని 290 గ్రామాలు, ఐదు మున్సిపాల్టీల పరిధిలో భారీ భవనాలు, పరిశ్రమలు, పెట్రోలు బంకులు, పౌల్ట్రీ ఫామ్, రియల్ ఎస్టేట్ వెంచర్లకు సుడా అనుమతి తప్పనిసరి. అయితే సుడాను విస్తరించకపోవడంతో స్థానిక పంచాయతీలు, మున్సిపాలిటీల ద్వారానే పర్మిషన్లు తీసుకుంటున్నారు. దీని వల్ల సుడా ఆదాయానికి గండి పడుతోంది.

మరోవైపు నిధుల కొరతతో సుడా పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడుతోంది. ఇప్పటికే పలు కూడళ్లతోపాటు సుందరీకరణ పనులు చేసినా కొంత కాలంగా నిధుల కొరత వల్ల సుడా పరిధిలో ఎలాంటి పనులు జరగడం లేదు. ఈ విషయంపై సుడా సీపీఓ ఆంజనేయులు మాట్లాడుతూ జిల్లా మొత్తం విస్తరణకు ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చాయని, అయితే ఆదేశాలు రాకపోవడంతో ఇంకా సుడాను విస్తరించలేదని చెప్పారు.

మూడేండ్లుగా చైర్మన్ పదవి ఖాళీ
సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథార్టీ(సుడా) చైర్మన్ పదవి మూడేండ్లుగా ఖాళీగా వుంది. సుడా ఏర్పాటైన తరువాత చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు 12 మంది డైరెక్టర్లను ప్రభుత్వం నియమిస్తోంది. సిద్దిపేట మున్సిపల్ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వ్యవహరిస్తున్నారు.

రాష్ట్రంలో ప్రభుత్వం మారాక 2023 నుంచి చైర్మన్ పదవికి ఎవరిని నామినేట్ చేయలేదు. ప్రస్తుతం సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ సుడా వైస్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తుండగా చైర్మన్, డైరెక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పదవుల కోసం పలువురు ఆశావహులు ప్రయత్నం చేస్తున్నారు.