Healthy Food: జీడిపప్పు బిరియానీ.. శొంఠి లడ్డు.. బాదం తులసి సూప్.. పోషకాల ఆహారం.. ఎలా తయారుచేయాలంటే..!

Healthy Food: జీడిపప్పు బిరియానీ.. శొంఠి లడ్డు.. బాదం తులసి సూప్.. పోషకాల ఆహారం.. ఎలా తయారుచేయాలంటే..!

పప్పు దినుసులతో ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకాలను తయారుచేసుకోవచ్చు. శరీరానికి అవసరమైన ప్రొటీన్లు, ఫైబర్, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా లభించే ఈ పప్పులతో రోజువారీ భోజనం నుండి అల్పాహారాలు, స్వీట్ల వరకు  రకరకాల వంటలు చేసుకుని తినొచ్చు. అప్పుడు ఆరోగ్యం బాగుంటుంది. పప్పు దినుసుల టేస్టీ ఫుడ్ ను ఎలా తయారు చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!

జీడిపప్పు బిర్యానీ తయారీకి కావాల్సినవి 

 

  • బాస్మతి లేదా మామూలు బియ్యం - ఒక కప్పు
  • నెయ్యి - మూడు టేబుల్ స్స్పూన్లు
  •  జీడిపప్పు - అర కప్పు
  • లవంగాలు - రెండు
  • బిర్యానీ ఆకు - ఒకటి
  •  దాల్చిన చెక్క - చిన్నముక్క
  •  ఉల్లిగడ్డ తరుగు - ఒక టేబుల్ స్పూన్ 
  • అల్లం-వెల్లుల్లి పేస్ట్ - ఒక ఒక టేబుల్ స్పూన్
  •  పచ్చిమిర్చి- రెండు 
  • కారం - అర టీ స్పూన్
  • పుదీనా, కొత్తిమీర పేస్ట్ - రెండు టేబుల్ స్పూన్లు 
  • పచ్చిబఠాణీ- పావు కప్పు
  • క్యారెట్- ఒకటి 
  • ఉప్పు - తగినంత

జీడిపప్పు బిర్యానీ తయారీ విధానం 

బియ్యాన్ని పావుగంటసేపు నానబెట్టాలి. పాన్​ లో  కొద్దిగా నెయ్యి వేడి వేసి జీడిపప్పు వేగించాలి. అలాగే పచ్చి మిర్చిని కూడా వేగించి పక్కనబెట్టాలి. తర్వాత అదే పాన్​ లో  ఇంకాస్త నెయ్యి వేడి చేసి బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క వేయాలి. తర్వాత ఉల్లిగడ్డ తరుగు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, పుదీనా- కొత్తిమీర పేస్ట్, కారం వేసి కొద్దిసేపు వేగించాలి. ఆపైన ఉడికించిన పచ్చిబఠాణీ, క్యారెట్ తరుగు వేసి మూతబెట్టాలి. ఐదు నిమిషాలయ్యాక బియ్యం, తగినన్ని నీళ్లు, ఉప్పు వేయాలి. అన్నం ఉడికాక అందులో వేగించిన జీడిపప్పు, పచ్చిమిర్చి వేసి తింటే చాలా టేస్టీగా ఉంటుంది.

శొంఠి  లడ్డు తయారీకి కావాల్సినవి 

  • గోధుమ పిండి- ముప్పావు కప్పు
  • నెయ్యి - మూడు టేబుల్​ స్పూన్​
  • బెల్లం తరుగు - పావు కప్పు
  • పసుపు -పావు టీ స్పూన్
  • శొంఠి పొడి --అర టేబుల్​ స్పూన్​ 
  • దాల్చినచెక్క పొడి - అర టీస్పూన్
  •  డ్రై ఫ్రూట్స్ -పావు కప్పు (కావాలనుకుంటే)


శొంఠి  లడ్డు తయారీ విధానం

 పాన్​ లో  నెయ్యి వేడి చేసి గోధుమపిండిని పచ్చి వాసన పోయేవరకు వేగించాలి. ఇంకాస్త నెయ్యి వేడి చేసి బెల్లం వేసి కలపాలి. మరో గిన్నెలో పసుపు, శొంఠి పొడి, దాల్చిన చెక్క పొడి వేసి కలపాలి. బెల్లం పాకంలో గోధుమ పిండి, శొంఠి మిశ్రమం వేసి బాగా కలపాలి. మిశ్రమం కొంచెం చల్లారాక చిన్న చిన్న లడ్డూల్లా చేయాలి. ఇవి పదిహేను రోజుల వరకు తాజాగా ఉంటాయి.


బాదం-తులసి సూప్ తయారీకి కావాల్సినవి

  • బాదం పలుకులు - పావు కప్పు
  • తులసి ఆకులు -పన్నెండు
  •  ఇలాచీలు -మూడు
  •  దాల్చినచెక్క - చిన్న ముక్క
  • లవంగాలు - మూడు
  •  ఉప్పు- తగినంత
  •  మిరియాలపొడి - పావు టీ స్పూన్

బాదం-తులసి సూప్  తయారీ విధానం

 బాదం పలుకులను నానబెట్టి మెత్తగా రుబ్బాలి. దాంట్లో ఒక కప్పు నీళ్లు, లవంగాలు, ఇలాచీలు, దాల్చినచెక్క వేసి కలపాలి. దాన్ని పది నిమిషాలు మరిగించి పడగట్టాలి. తర్వాత అందులో ఉప్పు, తులసి ఆకులు, మిరియాలపొడి కలిపి మరో ఐదు నిమిషాలు మరిగించాలి. కావాలంటే అందులో క్రీమ్ వేసుకోవచ్చు. మరీ చిక్కగా అనిపిస్తే కొన్ని వేడినీళ్లు పోసి పలుచగా చేయాలి. వారానికి రెండుసార్లు గోరువెచ్చని బాదం, తులసి సూప్ తాగితే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.