క్లాసుకో టీచర్‌‌ లేకుంటే నాణ్యమైన విద్య ఎట్లొస్తది? : మాజీ మంత్రి సాకే శైలజానాథ్

క్లాసుకో టీచర్‌‌ లేకుంటే నాణ్యమైన విద్య ఎట్లొస్తది? : మాజీ మంత్రి సాకే శైలజానాథ్

హైదరాబాద్, వెలుగు: ప్రైమరీ స్కూళ్లలో క్లాసుకో టీచర్‌‌‌‌ను నియమించకుండా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తామనడం పచ్చి మోసమని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యాశాఖ మాజీ మంత్రి సాకే శైలజానాథ్ స్పష్టం చేశారు. నేటి ఆధునిక, సాంకేతిక యుగంలోనూ ఇంకా సింగిల్ టీచర్ బడులు కొనసాగడం అత్యంత విచారకరమని తెలిపారు.

శనివారం హైదరాబాద్‌‌లో అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయుల సమాఖ్య (ఏఐపీటీఎఫ్) దక్షిణ భారత రాష్ట్రాల సమన్వయకర్త సయ్యద్ షౌకత్ అలీ అధ్యక్షతన కేరళ, తమిళనాడు, కర్నాటక, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రతినిధుల సదస్సు జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన శైలజానాథ్ మాట్లాడారు.

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రాథమిక విద్య విషయంలో నేల విడిచి సాము చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ఉమ్మడి రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మాజీ కమిషనర్ ఎస్. బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. సమాజంతో పోటీ పడేలా విద్యార్థులను తీర్చిదిద్దడమే అసలైన నాణ్యమైన విద్య అని పేర్కొన్నారు. మారుతున్న కాలానికి తగినట్టుగా విద్యా విధానంలో మార్పులు తీసుకురాకపోతే పేద పిల్లలు వెనుకబడిపోతారని ఆందోళన వ్యక్తం చేశారు.