GD Naidu Biopic: ‘రాకెట్రీ’ తర్వాత మాధవన్ మరో బయోపిక్.. రియల్ లైఫ్ హీరో ‘GD నాయుడు’ రిలీజ్కు రెడీ

GD Naidu Biopic: ‘రాకెట్రీ’ తర్వాత మాధవన్ మరో బయోపిక్.. రియల్ లైఫ్ హీరో ‘GD నాయుడు’ రిలీజ్కు రెడీ

భారతీయ ఆవిష్కరణల రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సైంటిస్ట్, ఇంజినీర్ గోపాల స్వామి దొరైస్వామి నాయుడు జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘జి.డి. నాయుడు’. ఈ ప్రెస్టీజియస్ బయోపిక్ థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. వర్సటైల్ యాక్టర్ ఆర్‌. మాధవన్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఆగస్టు 7, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది.

‘ఎడిసన్ ఆఫ్ ఇండియా’, ‘మిరాకిల్ మేన్’, ‘వెల్త్ క్రియేటర్ ఆఫ్ కోయంబత్తూర్’ వంటి పేర్లతో గుర్తింపు పొందిన జి.డి. నాయుడు భారత సాంకేతిక రంగంలో ఎన్నో ప్రయోగాలు చేసి ప్రత్యేక స్థానం సంపాదించారు. ఆయన ఆవిష్కరణలు, కష్టపడి ఎదిగిన ప్రయాణం, శాస్త్రంపై ఉన్న ఆసక్తిని ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకునే ఆర్‌. మాధవన్‌, ఈ సినిమాలో జి.డి. నాయుడు పాత్రకు పూర్తి న్యాయం చేసేందుకు ప్రత్యేకంగా సిద్ధమయ్యారు.

పాత్రకు తగ్గ మేకోవర్‌, విభిన్న గెటప్స్‌, సహజమైన నటన సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. గతంలో భారత అంతరిక్ష శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన రాకెట్రీలో నటించి ప్రశంసలు అందుకున్న మాధవన్‌, మరోసారి నిజ జీవిత శాస్త్రవేత్త పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. నటుడు, దర్శకుడు కృష్ణకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జి.డి. నాయుడు వ్యక్తిత్వం, ఆయన ఆలోచనా విధానం, సాంకేతిక రంగానికి చేసిన సేవలను ఆసక్తికరంగా చూపించే ప్రయత్నం చేశారు. ఈ సినిమాలో సత్యరాజ్‌, జయరామ్‌, ప్రియమణి, దుషారా విజయన్‌, వినయ్ రాయ్‌ కీలక పాత్రలు పోషించారు.

ఇటీవల విడుదలైన తెలుగు ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. సినిమాలోని పీరియడ్ సెటప్‌, మాధవన్‌ గెటప్స్‌, కథా నేపథ్యం సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచాయి. గోవింద్ వసంత అందించిన నేపథ్య సంగీతం సినిమాకు మరింత బలాన్ని చేకూర్చగా, భారీ నిర్మాణ విలువలు మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. భారత సాంకేతిక రంగంలో మార్పులకు కారణమైన ఓ గొప్ప ఆవిష్కర్త జీవితాన్ని తెరపైకి తీసుకొస్తున్న ఈ చిత్రం, కొత్త తరానికి స్ఫూర్తినిచ్చే కథగా నిలవనుంది. జి.డి. నాయుడు ప్రయాణాన్ని వెండితెరపై చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.