న్యూఢిల్లీ: ఓటర్ల జాబితాల నుంచి పేర్ల తొలగింపు, చట్టాల ఉల్లంఘనలపై ఇండియా కూటమి చేపట్టనున్న పోరాటానికి ప్రజలందరూ తరలిరావాలని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో జరగనున్న ఈ భారీ ర్యాలీకి అధికార బీజేపీ, దాని మిత్రపక్షాలు ఉచితంగా ప్రచారం కల్పిస్తున్నాయని అన్నారు. అందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలని, రాబోయే ఏడు రోజులు కూడా ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాలని ఎద్దేవా చేశారు.
ఈమేరకు ఆదివారం ‘ఎక్స్’ లో రాహుల్ గాంధీ పోస్ట్ పెట్టారు. ‘‘ఓటును కాపాడుకుందాం – దేశాన్ని రక్షించుకుందాం’’ అనే నినాదంతో మార్చ్, భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. ‘‘మన ఓట్లను దొంగిలిస్తున్నారు. దీనిని ఏమాత్రం సహించేది లేదు. ఓటర్ల జాబితాల నుంచి పేర్లను తొలగించారు. చట్టాలను ఉల్లంఘించారు. ప్రశ్నలు అడిగిన వారిపై లాఠీచార్జ్ చేశారు. ఇప్పుడు దీనికి దేశమే సమాధానం చెప్తుంది’’ అని పేర్కొన్నారు. ఈ పోరాటంలో విద్యార్థులు, రైతులు, కార్మికులు, మహిళలు, యువత, వ్యాపారులు భాగస్వాములు కావాలని కోరారు. ‘‘ఓటు మీది.. ఈ పోరాటం కూడా మీదే’’ అని రాహుల్ పిలుపునిచ్చారు.
ర్యాలీ తేదీని మార్చాలన్న సీటీఐ
1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల వార్షికోత్సవం ఉన్నందున నవంబర్ 1న ర్యాలీ నిర్వహించడం సిక్కుల మనోభావాలను దెబ్బతీస్తుందని, కాబట్టి తేదీని మార్చాలని బీజేపీ డిమాండ్ చేసింది. మరోవైపు పండుగల సీజన్లో వ్యాపారాలకు విఘాతం కలుగుతుందనే కారణంతో ర్యాలీని నవంబర్ 10 తర్వాత నిర్వహించాలని ఢిల్లీ చాంబర్ ఆఫ్ ట్రేడ్ కోరింది. అలాగే, పెరిగిన కమీషన్లు, ఇతర సమస్యలపై పెట్రోలియం శాఖతో చర్చలు జరపాలని భావిస్తున్న భారత ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల ఫెడరేషన్ (ఎఫ్ఎల్డీఐ) కూడా ఈ ర్యాలీకి దూరంగా ఉంటున్నట్టు తెలిపింది.
