- భారీగా పోలీసుల మోహరింపుపై రాహుల్ ఫైర్
- 50 శాతం పోలీసుల మద్దతు తమకేనని వ్యాఖ్య
- ఈడీ, సీబీఐ, ఈసీ నుంచి 200 మంది అధికారులు
- ఎప్పటికప్పుడు మాకు సమాచారం ఇస్తుండ్రు
- సీఈసీతో పాటు మోదీ, అమిత్ షాలను
- తప్పించే వరకు పోరాటం ఆగదన్న రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: ఢిల్లీని జైలులా ఎందుకు మార్చారని కేంద్ర ప్రభుత్వాన్ని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు. రోడ్లపై వేల సంఖ్యలో పోలీసులను మోహరించి ఢిల్లీ ప్రజలను ఎందుకు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు ఢిల్లీకి రాకుండా బస్సులు, రైళ్లను ఎందుకు నిలిపివేస్తున్నారని నిలదీశారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసేవరకు తమ పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. సోమవారం ఇండియా కూటమి నేతలు చేపట్టిన "చలో ఢిల్లీ - మార్చ్ ఫర్ డెమోక్రసీ" ర్యాలీ ప్రారంభానికి ముందు.. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్ ఎదుట రాహుల్ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ వీధుల్లో 20 వేల నుంచి 30 వేల మంది పోలీసులను మోహరించి కేంద్రం తన అధికారాన్ని ప్రదర్శిస్తోందని విమర్శించారు. డ్యూటీలో ఉన్న పోలీసు బలగాల్లో 50 శాతం మంది సిబ్బంది తమ పోరాటానికి మద్దతుగా ఉన్నారని వెల్లడించారు.
జ్ఞానేశ్ అప్రూవర్‌గా మారాలి
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) పేరుతో జరుగుతున్న అక్రమాలకు బాధ్యత వహిస్తూ సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు."జ్ఞానేశ్ కుమార్ జీ. మీరు తప్పు చేశారు. కానీ ఈ తప్పు వెనుక ఉన్న అసలు సూత్రధారి.. మాస్టర్‌మైండ్ మీరు కాదు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, అజిత్ దోవల్ వంటి వారు మీపై ఒత్తిడి తెచ్చారని మాకు తెలుసు. కాబట్టి మీరు రాజీనామా చేసి అప్రూవర్‌గా మారండి’’ అని కోరారు. ప్రస్తుతం జ్ఞానేశ్ పరిస్థితి ఏంటో తమకు తెలుసని, భయాందోళనల వల్ల ఆయన రాత్రిపూట సరిగ్గా నిద్రపోలేకపోతున్నారని తెలిపారు. వెంటనే పదవికి రాజీనామా చేసి అప్రూవర్‌గా మారాలని సీఈసీకి సూచించారు.
టచ్‌లో 200 మంది అధికారులు
మోదీ ప్రభుత్వంలోని 200 మంది అధికారులు మాకు టచ్‌లో ఉన్నారని రాహుల్ తెలిపారు. వారు తమతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని..లోపల జరుగుతున్న సమాచారాన్ని, డేటాను తమకు అందిస్తున్నారని చెప్పారు. కేవలం ఐదుగురు మన దేశ ఆత్మపై, రాజ్యాంగంపై దాడి చేస్తున్నారని.. ఎంత సమయం పట్టినా సరే వారికి శిక్ష పడే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు.
ప్లాన్ లేకపోవడమే ప్లాన్
‘‘చలో ఢిల్లీ - మార్చ్ ఫర్ డెమోక్రసీ’’ ర్యాలీ ఎలా ఉండాలో ప్లాన్ చేయమని సోదరి ప్రియాంక గాంధీ తనను కోరిందని రాహుల్ తెలిపారు. ప్లాన్ లేకపోవడమే ప్లాన్ అని ఆమెకు చెప్పినట్లు వెల్లడించారు. ‘‘ఇది ప్లాన్ ప్రకారం జరిగేది కాదు. ఇది రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి సాగుతున్న పరమశివుని తాండవంలా సాగుతున్న నృత్యం’’ అని చెప్పినట్లు పేర్కొన్నారు.ఆల్ ఇండియా రేడియో స్టేషన్ ముందు బస్సులో వెళ్లి అరెస్ట్ కావాలనుకున్న ప్రణాళికను పోలీసులు అడ్డుకోవడంతో అప్పటికప్పుడు వ్యూహం మార్చామని, ఈ ఆందోళన పరమశివుని ఊరేగింపు లాంటిదని, ఇందులో రాజ్యాంగాన్ని కాపాడాలనుకునే ప్రతి ఒక్కరూ చేరవచ్చని వ్యాఖ్యానించారు.
రాజ్యాంగంపై దాడి జరుగుతోందని బీజేపీలో ఉన్నవారు కూడా భావిస్తే తమ పోరాటంలో కలవవచ్చని, సీఈసీ జ్ఞానేశ్ తో పాటు ప్రధాని మోదీ, అమిత్ షాలను తొలగించి ఎన్నికల వ్యవస్థను ప్రక్షాళన చేసే వరకు శాంతియుత నిరసనలు కొనసాగుతాయని రాహుల్ స్పష్టం చేశారు. అనంతరం కన్నాట్ ప్లేస్ -బారాఖంబా రోడ్డు జంక్షన్ నుంచి ఇండియా కూటమి నాయకులు, కార్యకర్తలు జాతీయ జెండాలను చేతబూని సుప్రీంకోర్టు వైపు భారీగా మార్చ్ చేపట్టారు. సీజేఐ సూచనల మేరకు మధ్యాహ్నం 3 గంటలకు సుప్రీంకోర్టులో 'ఓట్ల చోరీ', సీఈసీ అక్రమాలపై పిటిషన్ దాఖలు చేశారు. సీఈసీతో పాటు ప్రధాని మోదీ, అమిత్ షాలను తప్పించే వరకు మరియు ఎన్నికల వ్యవస్థను ప్రక్షాళన చేసే వరకు ఈ పోరాటం ఆగదని రాహుల్ స్పష్టం చేశారు.
