ఓట్ చోరీపై   పోరు ఆగదు..ధర్మయుద్ధంలో అంతిమ విజయం మనదే: రాహుల్ గాంధీ

ఓట్ చోరీపై   పోరు ఆగదు..ధర్మయుద్ధంలో అంతిమ విజయం మనదే: రాహుల్ గాంధీ
  •  ధర్మయుద్ధంలో అంతిమ విజయం మనదే: రాహుల్ గాంధీ
  • దొంగలను చట్టం ముందు నిలబెట్టి తీరుతం
  • ప్రధాన కుట్రదారు మోదీ.. అమలు చేసేది అమిత్ షా
  • జ్ఞానేశ్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు బాధ్యులందరికీ శిక్ష పడాల్సిందే
  • సుప్రీంకోర్టు, సీజేఐపై అపార గౌరవం ఉందన్న రాహుల్
  • ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం కలిసి పోరాడుదాం 
  • విద్యార్థి సంఘాలు, పౌర సమాజ ప్రతినిధులకు పిలుపు
  • ఇండియా కూటమి, విద్యార్థి నేతలతో ​‘చాయ్ పే’ చర్చ 


న్యూఢిల్లీ, వెలుగు: దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే వరకు తమ పోరాటం ఆగబోదని లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. రాజకీయ ప్రతిఘటనతోపాటు ప్రజా ఉద్యమం కూడా కొనసాగుతుందని అన్నారు. అంతిమంగా విజయం సాధించి తీరుతామని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. ఓటు చోరీకి పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెట్టడం తమ బాధ్యత అని ప్రకటించారు.

ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు ఈ వ్యవహారంలో బాధ్యులైన వారందరిపైనా చర్యలు తీసుకునే వరకూ పోరాడుతామని చెప్పారు. దేశ రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి ఎవరూ తప్పించుకోలేరని హెచ్చరించారు. మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో ఇండియా కూటమి నేతలు, ప్రతిపక్ష ఎంపీలు, విద్యార్థి సంఘాలు, పౌర సమాజ ప్రతినిధులతో రాహుల్ గాంధీ ‘టీ’ మీటింగ్ నిర్వహించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. సోమవారం సుప్రీంకోర్టు వైపు చేపట్టిన ‘మార్చ్ ఫర్ డెమోక్రసీ’లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని, ఆ నిరసన రాజకీయ పార్టీల ప్రదర్శన మాత్రమే కాదని, భారత ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమని అన్నారు. ఉద్యమానికి మద్దతుగా నిలిచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం జరుగుతున్న పోరాటంలో వేర్వేరు నిరసనలు లేవని, అందరూ ఒకే ఉద్యమంలో భాగస్వాములని స్పష్టం చేశారు.

ఓటు చోరీ చేసినోళ్లకు ఉచ్చు బిగుస్తున్నది

ఓటు చోరీకి పాల్పడిన వారిని న్యాయస్థానం ముందు నిలబెడతామని రాహుల్ గాంధీ అన్నారు. ‘‘ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి ప్రధాని మోదీ. అమలు చేసేది అమిత్ షా. జ్ఞానేశ్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు మరికొందరు కూడా బాధ్యులు. వీరందరి చుట్టూ ఉచ్చు బిగుస్తున్నదని వారు అర్థం చేసుకోవాలి. ఓటు చోరీకి పాల్పడిన వారందరికీ శిక్ష పడేలా చూస్తామని హామీ ఇస్తున్నాం’’ అని అన్నారు.దేశ రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి, ఎలాంటి చర్యలు లేకుండా తప్పించుకోవడం సాధ్యం కాదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రతిపక్షాల పోరాటం వెనక్కి తగ్గబోదని చెప్పారు.

న్యాయవ్యస్థపై నమ్మకముంది

సుప్రీంకోర్టు, భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ), న్యాయవ్యవస్థపై తమకు అపారమైన గౌరవం ఉందని రాహుల్ గాంధీ తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం జరుగుతున్న ప్రక్రియలో న్యాయవ్యవస్థకు కీలక పాత్ర ఉందని, ఆ బాధ్యతను నిర్వర్తిస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. ఏ సంస్థ తన పాత్ర పోషించినా, పోషించకపోయినా రాజకీయ ప్రతిఘటన, ప్రజా ఉద్యమం మాత్రం కొనసాగుతాయని స్పష్టం చేశారు. ‘‘ఏం జరిగినా, ఏ సంస్థ తన పాత్ర పోషించినా, పోషించకపోయినా రాజకీయ పోరాటం కొనసాగుతుంది. చివరకు ఈ పోరాటం విజయం సాధిస్తుంది’’ అని ధీమా వ్యక్తం చేశారు.

కలిసి పోరాడుదామని పిలుపు

సమావేశానికి ముందు కూడా రాహుల్ గాంధీ తన అభిప్రాయాలను ‘ఎక్స్’ వేదికగా షేర్​చేశారు. ‘‘ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఈ ప్రజా ఉద్యమంలో మనమంతా కలిసే ఉన్నాం. ఉద్యమం కొనసాగుతుంది. టీ సమావేశం తర్వాత అందరం కలిసి మీడియా ముందు మా వాదన వినిపిస్తాం. అన్ని నిరసనలు ఒక్కటే’’ అని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వ్యవహారంపై ప్రతిపక్షాల ఆందోళనలను కొనసాగించడంతోపాటు, ఉద్యమాన్ని రాజకీయ పార్టీలకు మాత్రమే పరిమితం చేయకుండా విద్యార్థి సంఘాలు, పౌర సమాజం, ఇతర ప్రజా సంఘాలను కలుపుకొని వెళ్లాలన్న సందేశాన్ని ఇచ్చారు.

ఈ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌‌పర్సన్ సోనియా గాంధీతోపాటు పలు పార్టీల నేతలు హాజరయ్యారు. ఆర్జేడీ నేతలు తేజస్వి యాదవ్, మనోజ్ ఝా, జేఎంఎం నేత మహువా మాఝీ, సమాజ్‌‌వాదీ పార్టీ నేతలు హరేంద్ర మాలిక్, ఆనంద్ భదౌరియా, మొహిబుల్లా నద్వీ, సీపీఎం నేత ఎం.ఏ. బేబీ, సీపీఐ నేతలు డి. రాజా, పి. సంతోష్ కుమార్, టీఎంసీ నేత మహువా మొయిత్రా పాల్గొన్నారు. ఏఐఎస్ఏ అధ్యక్షురాలు నేహా బోరా, సీపీఐ-ఎంఎల్ నేత దీపాంకర్ భట్టాచార్యతోపాటు విద్యార్థి సంఘాలు, పౌర సమాజ ప్రతినిధులు కూడా హాజరయ్యారు.  

మోదీ ఓట్ల చోరీ ప్లాన్‌‌ను బయటపెడతం: ఖర్గే

ఇండియా కూటమి చేపట్టిన కార్యక్రమాలు విజయవంతమయ్యాయని మల్లికార్జున ఖర్గే అన్నారు. రాహుల్ గాంధీతోపాటు ఇతర ప్రతిపక్ష నేతలు ప్రజా సమస్యలను గట్టిగా లేవనెత్తారని చెప్పారు. ఢిల్లీలో యువత, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి నిరసనల్లో పాల్గొన్నారని తెలిపారు. ప్రధాని మోదీ ఓట్ల చోరీ కుట్రను పూర్తిగా బయటపెట్టేందుకు అందరూ సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. ఓటు చోరీ ఆరోపణలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు.

రాజ్యాంగాన్ని కాపాడేందుకు రెడీ: తేజస్వీ

ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుట్ర చేస్తున్నారని ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్ ఆరోపించారు. రాజ్యాంగ సంస్థలను తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికల సంఘం వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతున్నదని చెప్పారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కాపాడేందుకు ఎంతటి త్యాగాలకైనా సిద్ధమని ప్రకటించారు.

జంతర్ మంతర్ కోసం పోరాడుతం: డి. రాజా

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌‌తో ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై చర్చించినట్లు సీపీఐ నేత డి. రాజా తెలిపారు. ఢిల్లీలో నిరసనలకు అడ్డంకులు సృష్టించడాన్ని, జంతర్ మంతర్‌‌ను నిరసనల వేదికగా అందుబాటులో లేకుండా చేయడాన్ని తప్పుబట్టారు. నిరసన తెలిపే హక్కును అడ్డుకోలేరని, జంతర్ మంతర్‌‌ను తిరిగి నిరసనల వేదికగా సాధించేందుకు పోరాడతామని చెప్పారు.

రాజ్యాంగం ప్రమాదంలో ఉంది: సుప్రియా సూలే

ఇండియా కూటమి పూర్తి ఐక్యతతో ఉందని ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే అన్నారు. రాజ్యాంగాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దేశంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉందని పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అందించిన రాజ్యాంగ హక్కులను కాపాడేందుకు తమ ఆందోళన కొనసాగుతుందని తెలిపారు.

జ్ఞానేశ్ కుమార్‌‌ ఓ మాఫియా: సంజయ్ రౌత్

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌‌పై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ తీవ్ర విమర్శలు చేశారు. ఆయనను ‘మాఫియా’గా అభివర్ణిస్తూ, మొత్తం వ్యవస్థను నేరమయం చేశారని ఆరోపించారు. ఇలాంటి వారిని ఎదుర్కోవడం తమకు తెలుసని వ్యాఖ్యానించారు.

ఇండియా కూటమికి అండగా ఉంటం:హరేంద్ర మాలిక్

ఇండియా కూటమికి ఎస్పీ పూర్తి మద్దతుగా ఉంటుందని ఆ పార్టీ ఎంపీ హరేంద్ర మాలిక్ తెలిపారు. ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేలా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. న్యాయం కోసం చివరి వరకు పోరాడతామని చెప్పారు. 

ప్రజల ఆకాంక్షలను అడ్డుకోలేరు

సోమవారం సుప్రీంకోర్టు వైపు చేపట్టిన మార్చ్ ఫర్ డెమోక్రసీలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడాన్ని ఈ సందర్భంగా రాహుల్ ప్రస్తావించారు. వీధుల్లో కనిపించిన నిరసన రాజకీయ పార్టీలకు మాత్రమే సంబంధించినది కాదని, అది దేశ ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబమని చెప్పారు. తమకు మద్దతుగా నిలిచిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఉద్యమంలో ఇండియా కూటమి నేతలు, విద్యార్థి సంఘాలు, పౌర సమాజ ప్రతినిధులు, ప్రజలు కలిసి ఉన్నారని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం వ్యవహారం, ఓటర్ల జాబితాలో మార్పులపై తమ ఆందోళనలను కొనసాగిస్తామని, ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.