ఈ పోరాటం మీదే.. ప్రతి ఒక్కరూ రండి: దేశ ప్రజలకు రాహుల్ కీలక పిలుపు

ఈ పోరాటం మీదే.. ప్రతి ఒక్కరూ రండి: దేశ ప్రజలకు రాహుల్ కీలక పిలుపు

న్యూఢిల్లీ: భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో ప్రతిపక్ష ఇండియా కూటమి తలపెట్టిన మెగా ర్యాలీలో యువత, మహిళలు, రైతులు పాల్గొనాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పాటు పడే ప్రతి ఒక్కరూ తప్పక హాజరు కావాలని.. ఓటు మీదే.. ఈ పోరాటం కూడా మీదేనని అన్నారు.

ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పొల్గొని మెగా ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. బీజేపీ, ఎన్నికల సంఘం కుమ్మక్కై ఓట్లను దొంగిలిస్తున్నాయని.. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మౌనంగా సహించబోమని హెచ్చరించారు. బీజేపీ, ఈసీ అవినీతి, అక్రమాలను ప్రశ్నించిన వారిపై లాఠీలతో దాడులు చేస్తున్నారని.. బాధ్యుల్లో ఏ ఒక్కరిని వదలిపెట్టబోమని ప్రతిఒక్కరూ మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. 

సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఓట్ బచావో.. దేశ్ బచావో పేరుతో నవంబర్ 1న రామ్‎లీలా మైదాన్‎లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి మెగా ర్యాలీ నిర్వహించనుంది. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించేందుకు విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి కనీసం 10 లక్షల మందితో ఈ ప్రదర్శనను చేపట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. సర్ ప్రక్రియను తక్షణమే నిలిపివేయడంతో పాటు సీఈసీ జ్ఞానేష్ కుమార్ ను పదవి నుంచి తొలగించాలని ఇండియా కూటమి ప్రధాన డిమాండ్.