నైరుతి రుతుపవనాల రాకతో తెలంగాణలో పాముల సంచారం బాగా పెరిగింది. భారీ వర్షాలకు బొరియలు నీటితో నిండిపోవడంతో పాములు ఆశ్రయం కోసం ఇళ్లు, కార్యాలయాలు, పరిశ్రమల్లోకి వస్తున్నాయి. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి స్నేక్ రెస్క్యూ కాల్స్ పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పాము ఇంట్లోకి వస్తే ఏం చేయాలి? పాముకాటు నుంచి ఎలా రక్షించుకోవాలి? ఎక్స్పర్ట్స్ సూచిస్తున్న జాగ్రత్తలు ఏమిటి? అనేది తెలుసుకుందాం.
వర్షాకాలం మొదలైంది.. చల్లని జల్లులతోపాటు మరో అతిథి కూడా మన ఇళ్లవైపు అడుగులు వేస్తోంది. అదే పాము. భారీ వర్షాల కారణంగా బొరియలు నీటితో నిండిపోవడం, నాగుపాముల గుడ్ల నుంచి పిల్లలు బయటకు రావడం వల్ల తెలంగాణలో పాముల సంచారం బాగా పెరిగింది. హైదరాబాద్ సిటీ గుండా ప్రవహించే మూసీ నదీ తీర ప్రాంతంలోనూ నాగుపాములు, కొండచిలువల సంచారం పెరిగింది.
అడవులు, పొలాలకే పరిమితమైన పాములు ఇప్పుడు ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, కార్యాలయాలు, పరిశ్రమల్లోనూ కనిపిస్తూ ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. తెలంగాణలోని అటవీ గ్రామాలే కాకుండా, హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలైన గచ్చిబౌలి, గండిమైసమ్మ, వనస్థలిపురం, హయత్ నగర్, జవహర్ నగర్, ఉప్పల్, పటాన్ చెరు, అత్తాపూర్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో పాములు తరచుగా ఇళ్లలోకి వస్తున్నాయంటూ ప్రజలు ‘ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ’కి ఫిర్యాదులు చేస్తున్నారు.
పెరిగిన రెస్క్యూ కాల్స్
‘‘వర్షాకాలం మొదలైందో లేదో తమ ఇంట్లోకి పాము వచ్చింది.. వచ్చి పట్టుకోండి అంటూ ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీకి ప్రజలు చేసే ఫోన్ కాల్స్ సంఖ్య పెరిగింద’’ని ఆ సొసైటీ ప్రధాన కార్యదర్శి అవినాష్ విశ్వనాథన్ చెప్పారు. హైదరాబాద్ శివార్లలోని కాప్రా, కీసర, నాగోల్, హయత్ నగర్, కోకాపేట, కిస్మస్ పూర్, జల్ పల్లి, ఘట్ కేసర్ ప్రాంతాల్లోని గుట్టల్లో ఇళ్ల నిర్మాణం చేపడుతుండటంతో నాగుపాములు ఇళ్లల్లోకి వస్తున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
పెరిగిన స్నేక్ బైట్ కేసులు
పాములు జనావాస ప్రాంతాలు, పొలాలు, తోటల్లోకి ఎక్కువగా వస్తుండటంతో అవి ప్రజలను కాటేస్తున్నాయి. నైరుతి రుతుపవనాల రాకతో వ్యవసాయ పనులు ఊపందుకోవడంతో రైతులు పొలాల్లో తరచూ పాము కాటుకు గురయ్యే ముప్పు పెరిగింది. ఒక్క హైదరాబాద్‌లోనే గత ఏడాది 2,400 స్నేక్ బైట్ కేసులు నమోదయ్యాయంటే వీటి బెడద ఏమేరకు ఉందో అర్థమవుతుంది.
నగర శివార్లలోని ఫ్యాక్టరీలు, విద్యాసంస్థల్లోనూ తరచూ పాములు సంచరిస్తున్నాయంటూ విపరీతంగా ఫిర్యాదులు వస్తున్నాయి. చిన్నారుల నుంచి వృద్ధుల దాకా పాము కాటుకు గురవుతున్నారు. అత్యధికంగా పాము కాటు ఘటనలు వర్షాకాలం అయిన జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లోనే నమోదవుతున్నాయని హైదరాబాద్ జూ పార్కు వెటర్నరీ డాక్టర్ ఎం.ఏ హకీం చెప్పారు. పాము కాట్లు ఎక్కువగా పగటివేళల్లోనే నమోదవుతున్నాయి.
భయపడకుండా ప్రశాంతంగా ఉండాలి. పాముకు దూరంగా ఉండాలి. దాన్ని పట్టుకోవడానికి లేదా చంపడానికి ప్రయత్నించకూడదు. పిల్లలు, పెంపుడు జంతువులను ఆ ప్రాంతానికి దూరంగా ఉంచాలి. పాము ఎక్కడ ఉందో గమనిస్తూ వెంటనే స్నేక్ హెల్ప్ లైన్ వాలంటీర్లకు సమాచారం ఇవ్వాలి. గది తలుపులు మూసి పాము ఇతర గదులకు వెళ్లకుండా చూడాలి.
స్నేక్ హెల్ప్ లైన్
మీ ఇంట్లోకి పాము వచ్చిందా? అయితే తమ హెల్ప్ లైన్ ఫోన్ నంబరు 83742 33366 కు ఫోన్ చేయండి అని ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ ప్రధాన కార్యదర్శి అవినాష్ విశ్వనాథన్ సూచించారు. స్నేక్ రెస్క్యూ హెల్ప్ లైన్ సేవలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు.
బౌరంపేటలో సర్ప రక్షణ
‘‘సిటీలో ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ వాలంటీర్లు గత13 ఏళ్లలో 75 వేలకు పైగా పాములను రక్షించి, వాటిని నగర శివారు ప్రాంతం అయిన బౌరంపేటలోని సర్ప రక్షణ, పునరావాస కేంద్రానికి తరలించారు. ఆపై ప్రతీ నెలా రక్షించిన పాములను తమ వాలంటీర్లు తెలంగాణలోని దట్టమైన అడవులు, కవ్వాల, అమ్రాబాద్ అభయారణ్యాల్లో వదిలార”ని అవినాష్ విశ్వనాథన్ చెప్పారు.
పామును చూసి భయపడటం సహజం. కానీ దాన్ని చంపడం కాదు, స్నేక్ హెల్ప్ లైన్‌కు సమాచారం ఇవ్వడమే సరైన చర్య అని ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ వాలంటీర్లు సూచిస్తున్నారు. వర్షాకాలంలో అప్రమత్తంగా ఉంటే పాముల నుంచి మనల్ని మనం సురక్షితంగా కాపాడుకోవచ్చని అన్నారు.
ముందస్తు జాగ్రత్తలే రక్షణ
- ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి.
- చెత్త, పొదలు, కలుపు మొక్కలు పెరగకుండా చూడాలి.
- ఎలుకల నియంత్రణ చేపట్టాలి.
- గోడల్లోని పగుళ్లు, రంధ్రాలను మూసివేయాలి.
- రాత్రివేళ టార్చ్‌లైట్ ఉపయోగించాలి.
- చెప్పులు లేకుండా బయట నడవకూడదు.
- వంటచెరుకు, నిర్మాణ సామగ్రి, ధాన్యపు సంచులను నేలకు ఎత్తుగా నిల్వ చేయాలి.
పాముకాటు వేస్తే...
ప్రశాంతంగా ఉండి, వెంటనే వైద్య సాయం తీసుకోండి. పాముకాటుకు గురైన అవయవాన్ని కదలకుండా ఉంచండి. టోర్నికేట్ కట్టొద్దు. గాయాన్ని కట్ చేయకూడదు. విషాన్ని నోటితో పీల్చి తీయడానికి ప్రయత్నించొద్దు. వీలైనంత త్వరగా సమీపంలోని వైద్య కేంద్రానికి చేరుకోండి.
